Green Gram Cultivation: మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 8.13 లక్షల ఎకరాలు, ఉత్పత్తి 1.36 లక్షల టన్నులు మరియు ఉత్పాదకత ఎకరాకు 180 కిలోలు. ముఖ్యంగా తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. ప్రత్తిలో అంతర పంటగా కూడ పండించవచ్చు.
బూడిద తెగులు :
లక్షణాలు
ఈ తెగులు విత్తిన 30-35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు, ముదురు ఆకులపై, బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలుగా కనపడి, అవి క్రమేణా పెద్దవై ఆకులపైన, క్రింది భాగాలకు మరియు కొమ్మలు, కాయలకు వ్యాపిస్తుంది.
యజమాన్యం
నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్బండైజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిథైల్ లేదా 1 మి.లీ. కెరాథేన్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ లేదా 1 మి.లీ. ట్రైడిమార్ఫ్‌లను కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. నిర్ధేశించిన కాలంలో విత్తుకోవాలి. మొక్కల సాంద్రత సరిపడా వుండాలి. తెగులును తట్టుకునే రకాలను విత్తుకోవాలి.
సెర్కోస్పొరా ఆకుమచ్చ తెగులు :
లక్షణాలు
ఈ తెగులు సోకిన ఆకులపై గోధుమ రంగు గుండ్రని చిన్న చిన్న మచ్చలు కనిపించి అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఈ మచ్చలు పెద్దవై ఆకులు ఎండి రాలిపోతాయి. దీని వలన కాయల్లో గింజలు సరిగా నిండవు.
యజమాన్యం
దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లేదా 2 గ్రా. క్లోరోథలోనిల్ లేదా 1 గ్రాము కార్బండైజిమ్ లేదా 1 గ్రా. థయోఫానేట్ మిథైల్‌లను కలిపి వాడటం ద్వారా ఆకుమచ్చ తెగులుతో పాటు బూడిద తెగులును కూడా నివారించవచ్చు.
బాక్టీరియల్ బ్లైట్ :
లక్షణాలు
ఈ తెగులు సోకిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో చిన్న చిన్న మచ్చలు కనిపిస్తాయి.
యజమాన్యం
- 1 గ్రా. పౌషామైసిన్‌ను నీటిలో కలిపిన ద్రావణంలో కిలో విత్తనాన్ని 30 నిమిషాలు నానబెట్టి విత్తాలి.
- ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ మరియు 100 మి.గ్రా. ప్లాంటో మైసిన్‌ను కలిపి 12 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి.
Also Read: వనమూలికల ఔషధంతో చీడపురుగులకు చెక్
ఆకుముడత తెగులు (మొవ్వుకుళ్ళు) :
లక్షణాలు
ఇది వైరస్ జాతి తెగులు. తామర పురుగుల ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచు కుని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగుభాగంలోని ఈనెలు రక్తవర్ణాన్ని పోలి వుంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టటం ద్వారా పైరులోని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు.
యజమాన్యం
లీటరు నీటికి 1 గ్రాము ఎసిఫేట్ లేక 2 మి.లీ. డైమిథోయేట్ మందును కలిపి పిచికారి చేయాలి. యం.జి.జి. -295, యల్.జి.జి.-460 పెసర రకాలు ఈ తెగులును కొంతవరకు తట్టుకొంటాయి.
ఎల్లోమొజాయిక్ (పల్లాకు) తెగులు :
లక్షణాలు
ఇది వైరస్ జాతి తెగులు. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపుపచ్చ పొడలు ఏర్పడతాయి.
యజమాన్యం
తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేక 2 మి.లీ. డైమిథోయేట్ మందును పిచికారి చేసి కొంతవరకు నివారించవచ్చు. ఎమ్. ఎల్.267, ఎల్‌జిజి 407, ఎల్ జిజి 460, డబ్ల్యు జిజి 37 రకాలు ఈ తెగులును తట్టుకోగలవు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చి వేయాలి. తెల్లదోమల ఉధృతిని వెంటనే అరికట్టాలి.
బంగారు తీగ (కస్కుటా) :
లక్షణాలు
వరి మాగాణుల్లో బంగారు వన్నెగల సన్నని తీగ పైరుపై వ్యాపించి మొక్కలనుండి రసం పీలుస్తుంది. దీని వలన పైరు ఎదగక క్షీణించిపోతుంది. ఈ తీగ, పైరుపై కనిపించిన వెంటనే తీగ వ్యాపించిన మొక్కలతో పాటు పీకి కాల్చి వేయాలి.
యజమాన్యం
దీని ఉధృతి ఎక్కువగా ఉన్నచోట పైరు 20 రోజులప్పుడు ”ఇమిజితాపిర్” (పర్‌ష్యూట్) అనే కలుపు మందును ఎకరాకు 200 మి.లీ. చొప్పున పిచికారి చేసి 5-7 రోజుల లోపల పైరుపై 1.0% యూరియాను పిచికారీ చేయాలి. అశ్రద్ధ చేస్తే ఇది పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి సంవత్సరం పొలంలో కనిపించి పైరును నష్టపరుస్తుంది.
Also Read: దానిమ్మలో వచ్చే బాక్టీరియా తెగులు మరియు దాని యజమాన్యం