ఆంధ్రా వ్యవసాయంమన వ్యవసాయం

మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు – నివారణ చర్యలు

0

మొక్కజొన్న పంటను  ప్రస్తుతం ఎక్కువగా నష్టపరుస్తున్న కత్తెర పురుగు, దాని నివారణ చర్యలు గురించి తెలుసుకుందాం..

కత్తెర పురుగు:

గొంగళి పురుగు ముఖంపై తిరగబడిన “Y” ఆకారంలో తెల్లని చారను కలిగి ఉండును. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితం పై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉండును. మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహరితాన్ని గోకి తింటూ ఆకులపై రంద్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగేకొద్ది ఆకుల చివరల నుండి తింటూ ఆకులపై కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినివేయుట గమనించవచ్చు. ఆకు సుడులను మరియు కాండాన్ని కూడా తొలచి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి మరియు లేత కండె భాగాన్ని కుడా తిని నష్టపరుస్తుంది.

సమగ్ర యాజమాన్యం:

లోతు దుక్కులు దున్నుకోవడం వలన పురుగు యొక్క కోశస్థ దశలు నాశనం అవుతాయి. పంట చుట్టూ నాలుగు వరుసలు నేపియర్ గడ్డిని ఏర పంటగా వేసుకోవాలి. ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గ్రుడ్ల సముదాయాలను గుర్తించి ఏరివేసి నాశనం చేయాలి. కత్తెర పురుగు గ్రుడ్లను ఆశించే ట్రైకోగ్రామ బదనికలను ఎకరానికి 20,000 చొప్పున పొలంలో విడుదల చేయాలి. గ్రుడ్లను గమనించిన వెంటనే ఎకరానికి ఒక లీటరు వేపనూనెను లేదా 5% వేప గింజ కషాయాన్ని పిచికారీ చేయాలి. తొలిదశ గొంగళి పురుగులను నివారించుటకు ఎకరానికి 500మి.లీ. క్లోరిఫైరిఫాస్ లేదా 400 మి.లీ. క్వినాల్ ఫాస్ మందులను పిచికారీ చేసుకోవాలి. గొంగళి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.డి. 80గ్రా.లేదా స్పైనోశాడ్ 45% ఎస్.సి. 60మి.లీ. ఎకరానికి సుడులు లేదా మొవ్వు లోపలి ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 2 నుండి 3 సార్లు మందును పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకు 10కిలోల తవుడు+ 2కిలోల బెల్లం మరియు 2 లీటర్ల నీరు కలిపి 24గంటల పాటు పులియబెట్టి . ఆ మిశ్రమానికి 100గ్రా. ధయోడికార్బ్ మందును జోడించి సాయంత్రం వేళల్లో సుడులు/పత్రగుచ్చం/మొవ్వులో వేయాలి. ఈ పురుగు యొక్క ఉనికిని రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ, సరైన యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో పాటించి, ఈ పురుగు యొక్క ఉధృతిని మరియు పురుగు వలన కలిగే అపారమైన నష్టాన్ని నివారించవచ్చు.

Leave Your Comments

సేంద్రియ వ్యవసాయం చేస్తున్న 104ఏళ్ల రైతు పాపమ్మాళ్ కి పద్మశ్రీ అవార్డు..

Previous article

బచ్చలికూర మొక్కలతో ఈ – మైయిల్స్ ..

Next article

You may also like