Cabbage Cultivation శీతాకాలంలో సాగు చేసే పంటల్లో ముఖ్యంగా క్యాబేజి ఒకటి. కొద్దిపాటి నీటి సౌకర్యంతోనే దీని సాగు చేసి ఎక్కువ లాభాలు పొందవచ్చు. సకాలంలో సరైన యజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. క్యాబేజి కూరల్లోనే కాకుండా ప్రత్యేకంగా సలాడుగా కూడా ఉపయోగిస్తుంటారు. అందుకే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీని సాగుకు ముఖ్యంగా ఇసుకతో కూడిన బంక నెలలు, సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. చౌడు క్షార నేలలు పనికి రావు. స్వల్ప కాలిక రకాలను డిసెంబరు మొదటి పక్షం వరకు దీర్ఘకాలిక రకాలను డిసెంబరు మొదటి పక్షం నుంచి చివరివారం వరకు నాటుకోవచ్చు. ఎకరానికి సూటి రకాలు 300 గ్రా., హైబ్రిడ్ రకాలు 100-150 గ్రా. విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ను కలిపి విత్తన శుద్ధిచేయాలి.
సాగుకు అనువైన రకాలు ఇవే.. క్యాబేజి సాగు చేయాలనుకున్నపుడు వాటి రకాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందులో మేలు రకాలైనవి.. గోల్డెన్ (ఎసిఆర్‌ఇ) రకం, ఎర్లీ డ్రమ్ హెడ్ రకం, ప్రైడ్ అఫ్ ఇండియా రకం, లేట్ డ్రమ్ హెడ్ రకం మేలైనవి.
విత్తనాలు నాటే ముందు నేల అదునుకు వచ్చేవరకు 4-5 సార్లు కలియదున్నాలి. 100 చ.మీ. విస్తీర్ణంలో, 25-30 గంపల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. విత్తనాలను సన్నని ఇసుకతో కప్పివేయాలి. విత్తనాలు మొలిచే వరకు రోజు నీరు పెట్టాలి. మొక్కలు మొలకెత్తిన తరువాత ఎండిన ఆకులను తీసివేయాలి. నారు కుళ్ళు తెగులు సోకకుండా లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్‌తో నేలను తడపాలి. నారుమడిని ఆకు తినే పురుగు బారి నుంచి రక్షించేందుకు 2 మి.లీ. మలాథియాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.