Bugga’s Organic Milk: చీనీ చెట్లకు వచ్చే వ్యాధుల నివారణకు పురుగు మందులతో అలసిపోయి పాలేకర్ సూచించిన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించడానికి ఒక దేశీ ఆవుతో మొదలై గేదెలతో సహా రోజుకు 200 లీటర్ల పాలను ఉత్పత్తి చేసి సేంద్రీయ పరంగా విక్రయిస్తున్న బుగ్గ సుబ్బారెడ్డి. ఇతని పూర్తి పేరు సంసాని సుబ్బారెడ్డి. ఊరు కడప మండలం వెంకట గారి పల్లి. కడపలో బీటెక్ పూర్తి చేసి వ్యవసాయము మీద ఆసక్తితో తన దగ్గర ఉన్న 20 ఎకరాలలో చీనీ తోటను ప్రారంభించాడు.
సుబ్బారెడ్డిది వ్యవసాయ నేపథ్యం, ఉన్నత చదువులు చదివిన తరువాత ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా వ్యవసాయం మీద ఉన్న మక్కువతో వ్యవసాయరంగంలోనే స్థిరపడ్డాడు. 20 ఎకరాలలో బత్తాయి సాగు ఉంది. 2005వ సంవత్సరములో బత్తాయి మొక్కలు నాటి 2010 వరకు రసాయనాలు కూడా ఉపయోగించి 2010 నుంచి రసాయనాలను పూర్తిగా మానివేసి సేంద్రియ పద్ధతులు మొదలుపెట్టాడు.
సేంద్రియ సాగు చేయాలంటే పాడి పశువులు తప్పనిసరి అని గ్రహించి 2015వ సంవత్సరం నుండి పాడి పశువులను కొనుగోలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతానికి 50 గేదెలు, 10 నాటు ఆవులు ఉన్నాయి. వీటి మేత కొరకు 10 ఎకరాలలో సూపర్ నేపియర్, 4 ఎకరాలలో కో-4 గ్రాసాన్ని పెంచుతున్నాడు. పశువులకు మేత కోసం సూపర్ నేపియర్, కో-4 గ్రాసంతోపాటు వేరుశనగ చెక్క, వరిగడ్డి, అలసంద పొట్టు, శనగచెత్త, అలసంద మొక్కలు, తవుడు అందిస్తున్నాడు. పశువులకు ఆహారం కొరకు బయట నుంచి ఏమీ కొనుగోలు చేయడం లేదు. ప్రతిరోజు సగటున 200 లీటర్ల గేదె పాలు, లీటరు 70/-ల చొప్పున 20 లీటర్ల ఆవుపాలు పొందుతూ లీటరు 80/-ల చొప్పున అమ్మకం చేస్తున్నాడు. పాల దిగుబడి తగ్గకుండా చూసుకుంటూ అవసరమయితే పాడి పశువుల కొనుగోలు చేసుకుంటూ వస్తున్నాడు.
Also Read: Saline Soils Management: చౌడు భూములు – వాటి పునరుద్ధరణ (యాజమాన్యం)

Bugga’s Organic Milk
చీనీ తోటలో కాయలు వచ్చే సమయానికి మరియు వచ్చిన తరువాత 3 ఏళ్ల వరకు వ్యాధుల నివారణకు అతను చెట్లకు కొట్టని పురుగు మందు లేదు. వచ్చే దిగుబడి కన్నా పురుగుమందులకు అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంది. ఆ సమయంలో పాలేకర్ సూచించిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి మారడం జరిగినది. దీనికి ముఖ్యముగా దేశీ ఆవు పేడ అత్యవసరం. ఎందుకంటే ప్రకృతి కషయాలు తయారు చేయాలంటే దేశీ ఆవు పేడ తప్పనిసరి. ఈ గోఆదారిత వ్యవసాయములో దిగుబడి కోసం సమయం వెచ్చించిన సుబ్బారెడ్డి తరువాతి మూడు ఎండ్లలో రెట్టింపు దిగుబడి మరియు రుచికరమయిన కాయలతో విజయవంతముగా పురుగు మందులు లేని చీనీ కాయలు సాధించాడు. అదే మూడు సంవత్సరాలలో మరో వైపు సేంద్రియ పాలను కుడా ఉత్పత్తి చేసాడు.
ఈ ప్రకృతి వ్యవసాయం కోసం మంచి ఒంగోలు దేశీ ఆవు కోసం మమ్మల్ని సంప్రదించడం జరిగినది. దేశీ ఆవు ను కొనుగోలు చేసిన తర్వాత ఆవు ద్వారా వచ్చే పాలను ఇంటి వద్దనే విక్రయించడం మొదలుపెట్టాడు. అతని దగ్గర అంతకు మునుపు ఉన్న గేదెలతో ఇంటి దగ్గరకు వచ్చి గేదె పాలు వేపించుకునే ప్రెవేటు డైరీ వారు వెన్న శాతం ప్రకారం లీటరుకు 40 రూపాయలు మాత్రమె వచ్చేవి.
వ్యవసాయములోనే గాక పాలలో కూడా ఎటువంటి కల్తీ లేకుండా సేంద్రియ పాలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ పశువులకు సరి కొత్తగా పశువుల పాక ఏర్పాటు చేసి సేంద్రియ పద్దతిలో ఎటువంటి మందులు మరియు రసాయనాలు వాడని గడ్డిని మేతగా ఇవ్వడం ప్రారంభించాడు. ఈ విధమయిన దేశీ పాల యొక్క ప్రాముఖ్యత తెలిసిన వాళ్ళు తన ఊరిలో కూడా సేంద్రియ పాలకు మంచి డిమాండు ఏర్పడి మొదటగా లీటరు 50 రూపాయలకు విక్రయించాడు. అంతేగాక తన వద్ద ఉన్న మూడు నాటు గేదెలకు వచ్చే పాలను కూడా లీటరు రూ.50లకు విక్రయించేవాడు. తద్వారా ఎక్కువ డిమాండ్ రావడంతో కడపలో బుగ్గ సేంద్రియ పాలు అని షాపు ప్రారంభించాడు. అదే క్రమములో ఎక్కువ దేశీ ఆవు పాలు ఇచ్చే గిర్ జాతి ఆవులను మరియు ఇంకా కొన్ని గ్రేడేడ్ ముర్రా జాతి గేదెలను కొనుగోలు చేసాడు.
ప్రస్తుతం రోజుకు ఈ దేశీ ఆవులు మరియు గేదెల నుండి 200 లీటర్లకు పైగా సేంద్రియ ఆవు మరియు గేదె పాలను ఉత్పత్తి చేసి లీటరు గేదె పాలు 70 /- లకు, దేశీ ఆవు పాలు అయితే లీటరు 80/- లకు విక్రయిస్తూ సేంద్రియ ఆవు పాలకు మార్కెట్ చేయడం జరిగినది. ఇతనిని ఆదర్సముగా మరి కొందరు అదే లైన్లో చాల వరకు సేంద్రియ ఆవు పాలు మరియు పల్లె పాలు అని పేర్లతో అవుట్ లెట్లు ప్రారంభించారు. మాములుగా అయితే మన రైతు పేరు సంసాని సుబ్బారెడ్డి. ఈ సేంద్రియ పాలు ప్రారంభించిన తరువాత అతని ఇంటి పేరు బుగ్గ సుబ్బారెడ్డిగా మారిపోయింది. ఈ విధముగా యువరైతు తన ఆలోచన పరిధిని మార్చుకోవడం వలన మిగతా పాడి రైతులకు ఆదర్సంగా నిలిచాడు.
Also Read: Coconut – Cocoa Crops: కొబ్బరి – కోకో పంటలలో చేపట్టవలసిన పనులు.!