Quality Milk Production: పాలు ప్రకృతి ఇచ్చిన అత్యుత్తమమైన వరము. సంపూర్ణమైన ఆహారం. దేవుని పూజలకు, అతిధి సత్కార్యానికి, మనిషి నిత్యవసరాలకు పాలు శ్రేష్టమైన స్థానాన్ని పొందాయి.ఆరోగ్యవంతమైన పశువు నుండి ఆరోగ్యవంతమైన మనిషి, పరిశుభ్రమైన వాతావరణంలో, పరిశుభ్రమైన పాత్రల్లో పిండే పాలను పరిశుభ్రమైన పాలు అని అంటారు. పరిశుభ్రమైన పాలలో పొదుగు నుంచి వచ్చే కణాలు, సూక్ష్మక్రిములు తక్కువ సంఖ్యలో ఉంటాయి. దుమ్ము, ధూళి ఉండవు. రంగు, రుచి, వాసన బాగుంటాయి. వేడి చేస్తే విరిగిపోవు.
అపరిశుభ్రమైన పాలలో కణాలు, సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి. దుమ్ము, ధూళితో ఉంటాయి. రంగు, రుచి, వాసనలో తేడా ఉంటుంది. వేడి చేస్తే విరిగిపోయే అవకాశముంటుంది. పరిశుభ్రమైన పాలు త్వరగా చెడిపోవు. ఎక్కువ సేపునిలువ ఉంటాయి. పాల సేకరణ కేంద్రంగాని, శీతలీకరణ కేంద్రంగాని, పాల శుద్ధి కర్మాగారం గాని పాలను అంగీకరించక వెనక్కు తిప్పి పంపవు. పైగా ఎక్కువ ధర చెల్లించే అవకాశం ఉంటుంది. వినియోగదారునికి ఈ రకమైన పాలు ఆరోగ్యమును ఇస్తాయి.
పరిశుభ్రమైన పాల ఉత్పత్తిలో పాల పాత్రల యొక్క పాత్ర:- పాలు పిండడానికి కప్పు గల పాత్రలు ఉపయోగిస్తే మంచిది. వీలైనంత వరకు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను ఉపయోగించాలి. పాలు పిండడం అయి పోగానే పాత్రలన్నింటిని వేడినీటితో గాని, క్లోరిన్ కలిసిన ద్రావణంతో కాని కడిగి, తడి అరిపోయేటట్లు బోర్లించి శుభ్రమైన చోట నిలువ వుంచాలి. వాటిపై ఎండ తగిలితే మంచిదేగాని దుమ్ము, ధూళి పడకుండా పాల పాత్రలన్నింటికి మూతలుంచాలి లేదా బోర్లించి ఉంచాలి.
Also Read: African Swine Fever: పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్.!
పాలు పిండు వాతావరణం ఎలా ఉండాలి:- పరిశుభ్రంగా ఉండాలి. పాలు పిండే ముందే షెడ్డును శుభ్రంగా కడిగి అరనివ్వాలి. షెడ్డులో దుమ్ము, ధూళి లేకుండా నీటితో తుడుస్తూ ఉండాలి. ఈగలు, దోమలు, ఇతర కీటకా, బల్లులు, ఎలుకలు మొదలగునవి లేకుండా చూడాలి లేదా అవి పాలలో పడే ప్రమాదం ఉంటుంది. పాలు పిండే ముందు ఎండు మేత, పచ్చి మేత వేయరాదు. దాణాను నీటితో తడిపి పెడితే మంచిది లేదా ఏమీ తినకుండా పాలిచ్చే అలవాటు చేయాలి. పాలు పిండే చోట నేల పొడిగా ఉండాలి.
పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు:- పాలు పిండే ముందు వచ్చే రెండు మూడు ధారల్ని బయటకు వదలివేయాలి. వీటిలో కణాలు, సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఉంటాయి. ఈ ధారల్ని నల్లటి గుడ్డ కట్టి ఉన్న స్ట్రిప్ కప్పులోకి పిండితే పొదుగు వాపు వ్యాధిని గుర్తించవచ్చు. పాలు త్వరగా పిండాలి. పాలు పిండిన తరువాత చనులను టీట్ డిప్ లోషన్లో ముంచితే పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. పైగా తరువాత పాలు పిండేటప్పుడు కణాలు, సూక్ష్మక్రిములు తక్కువగా ఉంటాయి. షెడ్డును ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పొడిగా ఉంచాలి. పశువును పేడ పైన, మూత్రం పైన, తడి నేలపైన పడుకోనివ్వరాదు.
పాలు పిండిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు:- పిండిన పాలను గుడ్డ కట్టిన క్యానులో వడబోస్తూ పోయాలి. పాలను చల్లని వాతావరణంలో నిల్వ ఉంచాలి. వీలైతే క్యానుకు తడి గుడ్డ చుడితే మంచిది. పిండిన ఒకటి, రెండు గంటల్లో పాల సేకరణ కేంద్రానికి కాని లేదా శీతలీకరణ కేంద్రానికి గాని, వినియోగదారులైన హోటళ్ళు, హాస్టళ్ళు మొదలగు వారికి చేర్చాలి లేదా 5 డిగ్రీల సెంటిగ్రేటు వద్ద నిలువ ఉంచాలి.
Also Read: Infectious Bronchitis in Chickens: కోళ్ళలో ఇన్ ఫెక్ష్యూయస్ బ్రాంకైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!