Milk Production: సహజంగా రైతులు పాల ఉత్పత్తి మరియు పాలలోని వెన్న శాతం ఎందుకు తగ్గుతుందో, ఎందుకు పెరుగుతుందో అర్ధం కాక ఇబ్బంది పడుతుంటారు. ఉన్నట్టుండి పాడి పశువులలో పాల దిగుబడి తగ్గిపోవడం లేదా పాలలోని వెన్నశాతం తగ్గిపోవడం వంటివి జరిగినప్పుడు, రైతులు వారు పాలు పోసే పాల కేంద్రంలోని వారి పై అనుమానంగా ఉంటారు.
వివిధ రకాల పాడి పశువులు:- పాల ఉత్పత్తి మరియు పాల పదార్థాల శాతం ఒక్కొక్క పశువుకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆవులకు మరియు గేదెలకు మధ్య కూడా ఈ వ్యత్యాసం చాలా ఉంటుంది
పాడి పశువుల జాతి:- ఒకే రకమైన పశువులలోని వివిధ జాతుల మధ్య కూడా పాల ఉత్పత్తి మరియు పాల పదార్థాల శాతం మారుతుంటుంది. నాటు ఆవులు, గేదెల కన్నా, సంకరజాతి వాటిలో పాల ఉత్పత్తి సామర్ధ్యం ఎక్కువ, పాల ఉత్పత్తి పెరిగే కొలది, పాలలోని వెన్న శాతం తగ్గిపోతుంటుంది. పాల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు, వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది.
Also Read: Dryland Agriculture Problems: మెట్ట ప్రాంత పంటల ఉత్పత్తి లో సమస్యలు మరియు యాజమాన్యం.!
పాడి కాలం:- పశువు ఈని పాలు ఇవ్వడం మొదలు పెట్టిన దగ్గర నుండి, ఒట్టిపోయే వరకు గల కాలమునే పాడి కాలం అంటారు. పశువు ఈనిన తర్వాత మొదట వచ్చే పాలనే జున్ను పాలు అంటారు. జున్ను పాలు 4-5 రోజులు వరకు ఉత్పత్తి అవుతాయి. జున్ను పాలలో వెన్న మరియు ప్రొటీన్లు శాతం అధికంగా వుండి, లాక్టోజ్ శాతం తక్కువగా ఉంటుంది. ఈ పాలలో ఆంటీ బాడీలు శాతం చాలా ఎక్కువ. జున్ను పాల తరువాత, పాల శాతం క్రమేపి పెరిగి, దానితో పాటు లాక్టోజ్ శాతం కూడా పెరుగుతుంది. దీనినే పిక్ ఆఫ్ లాక్టేషన్ అంటారు. ఇది సుమారు పాడి పశువులు ఈనిన తరువాత 4-6 వారాలలో జరుగుతుంది. తదుపరి పాల ఉత్పత్తి కొద్దిగా తగ్గి, స్థిరంగా అలాగే 30-35 వారాల పాటు ఉండి తదుపరి పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. పై కాలంలో పాల ఉత్పత్తి వ్యత్యాసంతో పాటు, పాల పదార్థాల మార్పు కూడా జరుగుతుంటుంది.
పాల ఉత్పత్తి లో ప్రతిరోజు జరిగే మార్పులు:- పాల ఉత్పత్తి మరియు పాల పదార్థాల శాతం ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం కూడా మారుతుంటుంది. ఇది సహజంగా ఆ రోజు వాతావరణపు మార్పుల మీద, మనం పశువుకు అందించే దాణా మరియు మేత, ఎక్సైట్మెంట్, పాడి పశువులు ఎదలో ఉండడం, అసంపూర్తిగా పాలు పిండడం వంటి అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. సహజంగా ఉదయం పూట పాలలో వెన్న శాతం కొద్దిగా తక్కువగాను, సాయంత్రం పూట పాలలో కొద్దిగా ఎక్కువగాను ఉంటుంది.
పాడి పశువుల వ్యక్తిగత సామర్ధ్యం:- ఒకే జాతిలోని వివిధ పశువుల మధ్య కూడా పాల ఉత్పత్తి మరియు పాల పదార్థాల శాతంలో వ్యత్యాసం ఉంటుంది. ఇవి పూర్తిగా ఆ పశువు యొక్క జన్యువుల మీద మరియు ఆ పశువు యొక్క యాజమాన్యం మీద ఆధారపడి ఉంటుంది. పాడి పశువుకు 7 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి సంవత్సరం పాదుగు నిర్మాణంలో, పాలను ఉత్పత్తి చేసే ఎసినార్ కణాల శాతం పెరుగుతుంటుంది. ఫలితంగా 7 సంవత్సరాల వరకు ఈతకు ఈతకు మధ్యన పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంటుంది. పాల ఉత్పత్తితో పాటు వెన్న శాతం మరియు ఇతర పాల పదార్థాల శాతం కూడా పెరుగుతుంటుంది. 7 సంవత్సరాల తదుపరి పాల ఉత్పత్తిలో తగ్గుదల కనిపిస్తుంటుంది.
Also Read: Milk Importance: మానవ ఆహారంలో పాలు మరియు పాల పదార్దాల యొక్క ఆవశ్యకత.!