Dairy Farmer Protest: మహారాష్ట్రలో ఓ మంత్రికి పాల రైతులకు మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై తీసుకున్న నిర్ణయమే. మహారాష్ట్రలో ఇకపై వైన్ కిరాణా దుకాణాల్లో విక్రయించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా షెల్ఫ్ ఇన్ షాప్ విధానాన్ని సర్కారు ఆమోదించింది. 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న సూపర్ మార్కెట్‌లు, కిరాణా దుకాణాలలో వైన్ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించింది.
అయితే వైన్ కిరాణా షాపుల్లో విక్రయించడం ద్వారా ఆ చర్య రైతులకు మేలు చేస్తుందని మైనారిటీ అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్ ప్రకటించారు. పండ్ల నుండి వైన్ తయారు చేయడం వల్ల రైతులకు అధిక ధరలు లభిస్తాయని, గత కొన్ని సంవత్సరాలుగా ఇది నీరుపితం అయిందని మంత్రి అన్నారు. అయితే మాలిక్ కామెంట్స్ ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మద్యంపై ఉన్న ప్రేమ పాల వ్యాపారులపై లేదని మండిపడుతున్నారు రైతులు. రాష్ట్రంలో మెజారిటీ రైతులకు పాల వ్యాపారమే జీవనోపాధి. ఈ క్రమంలో పాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మద్యానికి కాకుండా పాలకు ధర ఇవ్వాలని పాల ఉత్పత్తిదారులు (సంఘర్ష్ సమితి) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్‌ను నెరవేర్చకుంటే పాల ఉత్పత్తిదారులు ఉద్యమం చేపడతామని కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
పాల ఉత్పత్తిదారుల డిమాండ్లను సంఘర్ష్ సమితి పాల అభివృద్ధి శాఖ మంత్రి, డెయిరీ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖను నిలదీస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోవడంతో పాల సంఘాలు, ప్రైవేట్ పాల కంపెనీలు పాడి రైతులు ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. రాష్ట్రంలో రైతుల్ని నిలువుదోపిడీ చేసేందుకే కిరాణా షాపుల్లోనూ వైన్ అమ్మకాలకు అనుమతినిచ్చిందని వారు వాపోతున్నారు. పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని పెంచేవిధంగా విధానాలు తీసుకుని రావాలని, మద్యం వ్యాపారులకు మేలు చేసే విధంగా విధానాలు ప్రవేశపెట్టడం సరికాదని ఫైర్ అవుతున్నారు. మహారాష్ట్రలో రైతులు,వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సకాలంలో డైరీ పాలసీని అవలంబించాలి. పాల భద్రత, ఎఫ్‌ఆర్‌పీకి ఆదాయాన్ని పెంచడం తక్షణమే ప్రకటించాలని కోరుతున్నారు.
కాగా.. వైన్ ప్రాథమికంగా ద్రాక్షతో తయారు చేయబడుతుందని, పండ్లతో వైన్ తయారు చేస్తున్నారని, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని పండ్ల సాగుదారులకు, ముఖ్యంగా ద్రాక్ష పండించే రైతులకు మరియు వారి పంటలకు మంచి ధరలు లభిస్తాయని సర్కారు చెప్తుంది.