మన వ్యవసాయం

సిరులు కురిపిస్తున్న కనకాంబరం సాగు

0

సాంప్రదాయకంగా సాగుచేస్తున్న విడిపూలలో కనకాంబరం విశిష్టమైనది. ఆకర్షణీయమైన రంగులతో తేలికగా, ఎక్కువ నిల్వ, శక్తి కలిగిన కనకాంబరం పూలను దక్షిణ భారత దేశంలో తమిళనాడు కర్ణాటక, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. ఇవి సంవత్సరం పొడవునా పూస్తూ ఆదాయాన్ని ఇస్తాయి. వాసన లేకున్నా పలు ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే ఈ పూలను ఎక్కువగా పూజ సమయంలో దండలు, పూల జడ తయారీల్లో, స్త్రీ శిరోజాంకరణకు విరివిగా వాడతారు. ఉద్యానవనాల్లో రాకరీలలోనూ, బార్డర్లలోను పెంచేందుకు ఉపయోగపడతాయి. దీన్ని మామిడి, కొబ్బరి లాంటి తోటల్లో అంతర పంటగా కూడా సాగుచేయవచ్చు.
కనకాంబరం బహువార్షిక పంట. ఇది 4-6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మార్కెట్‌లో ఎక్కువ ధర పలకడంతోపాటు పూల సాగుచేస్తున్న రైతులకు అధిక లాభాలు వస్తుండడం వల్ల ఎక్కువ మంది కనకాంబరం సాగుకు మొగ్గు చూపుతున్నారు.

రకాల ఎంపిక :

కనకాంబరంలో నారింజ, గులాబి, ఎరుపు, పసుపు రంగు రకాలేకాక రెండు రంగు కల గలిపిన నీలి, తెలుపు రకాలు కూడా సాగులో ఉన్నాయి. ఆరెంజ్‌క్రోసాండ్రో ముదురు నారింజ రంగు పూలు ‘‘టిటియాఎల్లో’’ రకం పసుపు రంగు పూలు , సెబకాలిస్‌ రెడ్‌ ఎరుపు రంగు పూలు, లక్ష్మీ రకం నారింజ రకం పూలు పూస్తాయి.

డా॥ ఎ.పి.జె అబ్దుల్‌ కలాం రకం అధిక నిల్వ స్వభావం కలిగి ఎక్కువ దూరం రవాణాకు అనుకూలమైన ముదురు ఎరుపు రంగు రకం. అంతేకాకుండా ముదురు ఎరుపు రంగు పూలను ఇచ్చే ‘‘మారువుల్‌ అరసి’’ అధిక దిగుబడినిచ్చే రకం. ఇలాంటి రకాలు సాగు చేయడం వల్ల సంవత్సరం పొడవునా పూలను పొందవచ్చు.

వాతావరణ పరిస్థితులు :
అధిక తేమ, వేడి కల్గిన ప్రాంతాలు కనకాంబరం సాగు చేయడానికి అనుకూలము. ముఖ్యంగా కోస్తా జిల్లాల సాగు చేయుటకు అనువైనవి. పెరుగుదలకు 300 సెం. ఉష్ణోగ్రత చాలా అనుకూలము. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూలు దిగుబడి అధికంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలో పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేదు.

నేలలు :

నీరు నిలవని అన్ని రకాల నేలలు సాగుకు అనుకూలం . సారవంతమైన అధిక సేంద్రియ పదార్థం గల ఎర్ర నేలలో ఉదజని సూచిక 6 -4 మధ్య నేలలు సాగు చేయుటకు అనుకూలము. అధిక ఆమ్ల, క్షార క్షణాలు కలిగిన నేలల్లో మరియు నులి పురుగు తాకిడి అధికంగా ఉన్న నేలల్లో ఈ పూలను సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులు రైతులు పొందలేరు.

ప్రవర్థనం & విత్తనం :

అధిక దిగుబడినిచ్చే రకాన్ని విత్తనం ద్వారా ప్రవర్థనం చేస్తారు. ఎకరానికి 2 కిలో విత్తనం అవసరం. మంచి నాణ్యత గల విత్తనం పొందుటకు మొక్కలను 50 x 50 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. పూలు పూసిన 55-60 రోజుల తరువాత విత్తనాలు పక్వ దశకు వస్తాయి. కావున అటువంటి పూలను పూల వెన్ను నుండి తీసుకొని కిలో విత్తనాకు 2 గ్రా. కాప్టాన్‌ లేదా బావిస్టన్‌ పొడి కలిపి నారుమడిలో విత్తుకోవాలి.
విత్తనాలను వెడల్పు 1 మీ, ఎత్తు 15 సెం.మీ. గల నారుమడిని తయారు చేసుకొని వరుసల్లో పెరుగుదల గమనించి, రెండు వారాల కు ఒకసారి కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ మందును 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లేదా మడిలో పోయడం చేయాలి. మొక్కలు 4-5 ఆకు తొడిగిన తరువాత అంటే 50-60 రోజుల వయసు గల మొక్కలను పొలం లో నాటుకోవచ్చు. అంతే కాకుండా విత్తనాలను 22.5 x 15 సెం.మీ. 100 గేజ్‌ మందం గల పాలిబ్యాగ్‌లో కూడా విత్తుకోవచ్చు. పశువు ఎరువు, ఎర్రమట్టిని 1:3 భాగాలు కలుపుకొని పాలిబ్యాగ్‌లో నింపుకొని విత్తనాల ను ప్రతి బ్యాగ్‌లో రెండు విత్తనాలను విత్తి మొక్కలను ప్రవర్ధనం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల నాణ్యమైన, బలమైన మొక్కలను పొందవచ్చు.

కాండపు మొక్కలు :
కొమ్మ చివర నుండి 6-10 సెం.మీ. పొడవు, కనీసం 2 కణుపులున్న కాండపు ముక్కల్ని 500 పిపియం ఇండోల్‌బ్యుట్రిక్‌ ఆమ్లం (ఐబిఎ) ద్రావణంలో ఒక నిమిషం పాటు ముంచి మిస్టు ఛాంబర్లలో నాటితే వేర్లు ఏర్పడతాయి. వేర్లు బాగా ఏర్పడిన 16,700 కాండపు ముక్కల్ని ఎకరా భూమిలో నాటవచ్చు. డిల్లీ క్రోసాంధ్ర రకాన్ని కత్తిరింపు ద్వారా ప్రవర్ధనం చేస్తారు.

ఎరువులు :
మొక్కల్ని నాటుకోవడానికి పొలాన్ని 4, 5 సార్లు బాగా కలియదున్నాలి. ఎకరాకు 10-15 టన్నుల పశువు ఎరువు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. పశువు ఎరువుతో పాటు 20-30 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ మరియు 50 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ను చివరి దుక్కిలో వేయాలి. పైపాటుగా యూరియాను రెండు దఫాలుగా మొక్కలు నాటిన 3 నెలలకు మరియు 6 నెలలకు 20 కిలోల చొప్పున వేయాలి. కనకాంబరంలో ఇనుము ధాతు లోపం ఎక్కువ కనబడుతుంది. కనుక దీని నివారణకు 5 గ్రా. పెర్రస్‌ సల్ఫేట్‌ను 20 గ్రా. యూరియాతో కలిపి మొక్కల పై పిచికారి చేయాలి.

ప్రధాన పొలం తయారీ, మొక్క నాటుట :

పొలాన్ని మళ్ళలో తయారు చేసుకొని మొక్కలను సాయంత్రం వేళల్లో సాలుకి, సాలుకి మధ్య 45 సెం.మీ. మరియు మొక్కకు, మొక్కకు మధ్య 30 సెంమీ. దూరంలో నాటుకోవాలి. సామాన్యంగా మే-జూన్‌ మాసాల్లో నారుపోసి ఆగస్టు-సెప్టెంబరు మాసాల్లో నాటుకోవచ్చు.
అవసరాన్ని బట్టి తడులు ఇవ్వాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారానికి ఒకసారి నీరు అందించాలి. ఎదుగుతున్న తొలిదశలో కలుపు మొక్కల నిర్మూలన చేపట్టాలి.

అంతర కృషి :

మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు తీసి పొలాన్ని శుభ్రంగా ఉంచాలి. పైపాటుగా 3వ, 9వ నెలలో యూరియా వేసినప్పుడు మట్టిని ఎగదోయాలి. వేసవి ఎండ తీవ్రత తగ్గించడానికి కొంత నీడను కల్పిస్తే మొక్కలు వేసవిలో బాగా పెరిగి నాణ్యమైన అధిక పూల దిగుబడినిస్తాయి. దీని కొరకు తోటలో అవిశె మొక్కల్ని పెంచాలి. పూల కాడల్లో పూలు కోయడం పూర్తయిన తరువాత పూగుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే సంవత్సరం పొడవునా పూలు దిగుబడి పెరుగుతుంది.

చీడ పీడల నివారణ :

కనకాంబరంలో ఎండుతెగులు ముఖ్యమైన సమస్య తెగుళ్లు ఆశించిన మొక్క ఆకుల అంచు పసుపు రంగుకు మారతాయి. వేర్లు, కాండం మొదలు కుళ్ళడం వల్ల మొక్క ఆకస్మికంగా ఎండిపోతుంది. కాండాన్ని చీల్చి చూస్తే లోపల గోధుమ రంగుకు మారి ఉంటుంది. ఆకుమచ్చ తెగులు కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతు ఆకుమచ్చ తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే 2 గ్రా. కార్బండిజమ్‌ ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కనకాంబరంలో నులి పురుగు బెడద ఎక్కువగా ఉంటుంది. నులిపురుగు సోకిన మొక్క వేర్లపై గోధుమ రంగు నుండి నల్ల మచ్చలు ఏర్పడతాయి. వేర్లపైన కణితలు కూడా కనిపిస్తాయి. ఆకు పాలిపోయి పత్రహరితాన్ని కోల్పోతాయి. మొక్క పెరుగుదల తగ్గిపోయి పక్కకొమ్మలు ఏర్పడవు. చివరగా ఆకులు అన్నీ రాలిపోతాయి.

దిగుబడి :

పైన తెలిపిన సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల మొక్కలు నాటిన 2-3 నెలలకు పూత ప్రారంభమై సంవత్సరం పొడవునా పూలు పూస్తాయి. జూన్‌ నుండి జనవరి వరకు ఎక్కువ దిగుబడి ఉంటుంది. కనకాంబరం పూలు ఒక క్రమంలో వెన్ను కింది భాగం నుండి విచ్చుకుంటాయి. పువ్వు పూర్తిగా విచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. కాబట్టి రోజు మార్చి రోజు ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో పూలు కోయాలి. వెన్ను పొడవును బట్టి అందులో అన్ని పూలు విచ్చుకోవడానికి 15-25 రోజులు పడుతుంది. కనకాంబరం పూలు చాలా తేలికగా ఉంటాయి. కాబట్టి ఒక కిలోకు 15,000 పూలు తూగుతాయి.
కనకాంబరం బహువార్షిక పంటైనా ఒక సంవత్సరం వరకు మాత్రమే అధిక దిగుబడులు వస్తాయి. వాణిజ్యపరంగా సాగు చేయాల నుకునే రైతు ప్రతి సంవత్సరం పొడవునా 1500-2000 కిలోల పూల దిగుబడిని పొందవచ్చు.

రైతు కౌలు దారుడు కాకుండా సొంత భూమి ఉన్నట్లయితే నికర ఆదాయం ఇంకా పెరుగుతుంది. పైన తెలిపిన వివరాల ప్రకారం కనకాంబరం సాగుపై రైతు పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడిపై మొదటి సంవత్సరం రూ. 2.90 పైసా ఆదాయం, అంటే ఖర్చు పోను రూ. 1.90 పైస లాభం వస్తుంది. అలాగే రెండవ సంవత్సరం పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి పై రూ. 3 ఆదాయం, అంటే ఖర్చు పోను ప్రతి రూపాయి పెట్టుబడిపై రూ. 2 లాభం వస్తుంది. రైతు సరైన యాజమాన్య పద్ధతును పాటించి, దళారు చేతిలో మోసపోకుండా తామే స్వయంగా మార్కెటింగ్‌ చేసుకోగలిగితే కనకాంబరం సాగు కనకవర్షం కురిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave Your Comments

తోటకూర సాగు -యాజమాన్య పద్ధతులు

Previous article

పశుగ్రాసాల సాగు చేసుకోవడం ఉపయోగదాయకం

Next article

You may also like