Agriculture భారత్‌లో ఏటా భారీగా పంటల అవశేషాలు, వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. పెద్దమొత్తంలో వాటిని తగలబెడుతున్నందువల్ల వాయు కాలుష్యం అధికమవుతోంది. భారత నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశీయంగా ఏటా 50 కోట్ల టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో అధిక భాగాన్ని పశుగ్రాసంగా, గృహ, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తున్నారు. అవన్నీ పోను 14.2 కోట్ల టన్నుల మేర మిగిలిపోతున్నాయి. అందులో దాదాపు 9.2 కోట్ల టన్నుల అవశేషాలను ఏటా దహనం చేస్తున్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని రైతులు వరి పంట అవశేషాలను అధిక మొత్తంలో కాల్చడం వల్ల దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం చుట్టుముడుతోంది.
పంట అవశేషాలను దహనం చేయడానికి బదులుగా ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ ప్రైవేటు సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాయి. అందులో భాగంగా సమర్థ్ పథకాన్ని తాజా బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. థర్మల్ ప్లాంట్లలో అయిదు నుంచి ఏడు శాతం బయోమాస్ గుళికలను వాడాలని నిర్ణయించారు. దానివల్ల ఏటా 3.8 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలను నియంత్రించవచ్చని వెల్లడించింది. ఆ పథకం ద్వారా రైతులకు అదనపు ఆదాయమూ లభిస్తుందని తెలిపింది. పంట వ్యర్థాల విషయంలో ఇతర ప్రత్యామ్నాయాలను సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందులోని పోషకాలు తిరిగి భూమిలోకి చేరే విధానాలవైపు రైతులు మొగ్గుచూపేలా పాలకులు చొరవ తీసుకోవాలి.
హరిత విప్లవం తరవాత భారత్‌లో మేలైన వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. నీటి వసతి పెరగడంతో ఏటా రెండు పంటలు పండే విస్తీర్ణం అధికమైంది. ఫలితంగా పంట వ్యర్థాలు సైతం భారీగా పెరిగాయి. వాటి నిర్వహణ ప్రస్తుతం సవాలుగా మారింది. పంట పూర్తయిన తరవాత ఆ అవశేషాలు మట్టిలో కుళ్ళిపోవడానికి ఆయా పంటలను బట్టి నెల నుంచి మూడు నెలల సమయం పడుతుంది. వెంటనే మరో పంట వేయడానికి రైతులు ఆ అవశేషాలను కాల్చివేస్తున్నారు.
దాన్ని చాలా సులభమైన పద్ధతిగా భావిస్తున్నారు. దానివల్ల భూమి పై పొరల్లో ఉండే సూక్ష్మపోషకాలకు నష్టం వాటిల్లి భూసారం తగ్గిపోతుంది. నీటిని శోషించుకునే తత్వాన్ని నేల కొంతవరకు కోల్పోతుంది. అది దిగుబడులపై ప్రభావం చూపుతుంది. ఇండియాలో వరి, గోధుమ పంటల వల్ల అధిక మొత్తంలో అవశేషాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. అందులో ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర ముందువరసలో ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం- పంట అవశేషాలను కాల్చడం వల్ల ఏటా దాదాపు 14.9 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 90 లక్షల టన్నులకుపైగా కార్బన్ మోనాక్సైడ్, 2.5 లక్షల టన్నుల సల్ఫర్ డయాక్సైడ్, ఏడు వేల టన్నుల కార్బన్ తదితరాలు విడుదలవుతున్నాయి.
చైనా, ఇండొనేసియా, నేపాల్, థాయ్‌లాండ్, మలేసియా, జపాన్ వంటి దేశాలు బయో విద్యుత్తు, కంపోస్ట్‌ను తయారు చేయడానికి పంట అవశేషాలను ఉపయోగిస్తున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పంట అవశేషాలను కాగితం, నిర్మాణ పరిశ్రమల్లో ముడిసరకుగా ఉపయోగిస్తున్నారు. భారత్ సైతం ఆ విధానాలను అందిపుచ్చుకోవాలి. జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలు పంట అవశేషాలను కాల్చడానికి ప్రత్యామ్నాయంగా ‘వేస్ట్ డీకంపోజర్’ను అందుబాటులోకి తెచ్చారు. దానివల్ల అతి తక్కువ ఖర్చుతో పొలంలో విస్తరించిన అవశేషాలు నెల రోజుల్లో కుళ్ళిపోతాయి.
పొలంలో పంట వ్యర్థాలను తొలగించకుండానే మరో పంట విత్తనాలను ట్రాక్టర్ సాయంతో నాటేందుకు ‘హ్యాపీ సీడర్’ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఉత్తర భారతదేశంలో వరి తరవాత రెండో పంటగా గోధుమను విత్తేందుకు అది ఉపయోగపడుతోంది. ఆ పరికరాన్ని రైతులందరికీ అందుబాటులోకి తేవాలి. మన దేశంలో పంట వ్యర్థాలతో కంపోస్ట్ తయారీ ప్లాంట్లు స్వల్పంగానే ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో కంపోస్ట్ తయారీకి మార్గదర్శకాలను రూపొందించి పంట అవశేషాలతో రైతులు దాన్ని తయారు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. బయో విద్యుత్తు ప్లాంట్లను సైతం నెలకొల్పాలి. ఇలా పలు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తే పంట పొలాల్లో పొగలు కనిపించవు. పర్యావరణానికి కాలుష్యం బెడద కొంతవరకూ తప్పుతుంది.