మన వ్యవసాయం

అపరాల నిల్వ కొరకు గాలి చొరవని మూడు పొరల సంచులు (హెర్మాటిక్ బ్యాగులు) వినియోగం

0

రైతాంగానికి పంటకోత అనంతరం పంటను సురక్షితంగా నిల్వ చేయడం అనేది చాలా పెద్దసవాళ్ళు. ఎందువలనంటే ముఖ్యంగా పెసలు, మినుములు, కందులు, ఉలవలు మరియు శెనగలు వంటి అపరాలను చీడపీడలు, కీటకాలు, జంతువులు, పక్షులు వంటివి ఎక్కువగా ఆశించడం వలన సురక్షితంగా నిల్వచేయడం అనేది అధిక లాభాలు గడించడానికి చాలా అవసరమైన ప్రక్రియ. అదే విధంగా మన దేశంలో ప్రతీ సంవత్సరం 20 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను సురక్షితమైన పద్ధతులను పాటించకపోవడం వలన నష్టపోవడం జరుగుతూ ఉన్నది ఒక వైపు ఇంత పెద్ద మొత్తంలో మనదేశంలో ఆహారధాన్యాలు నిరుపయోగమవుతుంటే, మరో వైరు 20% మంది దేశ జనాభా పోషకాహారలోప వ్యాధులకు గురి అవుతూ ఉన్నారు.
అదే విధంగా మన దేశంలో అధికశాతం మంది చిన్న మరియు సన్నకారు రైతులు కోత అనంతరం సుమారు 60% ఆహార ధాన్యాలను రైతులు తమ ఇండ్లలోనే సాధారణ పాలిప్రొపైలీన్ లేదా గొనే సంచులలో నిల్వ చేయడం జరుగుతూ ఉన్నది. దీని వలన రైతులు తమ ఇండ్లలో సరైన సదుపాయాలు లేక మరియు సరైన శాస్త్రీయ పద్ధతులను పాటించకపోవడం వలన పండిన పంటకు శిలీంధ్రాలు, క్రిమికీటకాలు మరియు ఎలుకల వలన అధిక మొత్తంలో నష్టపోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ నష్టశాతం అపరాలలో అధిక మొత్తంలో ఉండటం గమనించదగ్గ విషయం.
అపరాలు నిల్వ సమయంలో శిలీంధ్రాలు మరియు కీటకాలు ఆశించడం వలన వాటి నాణ్యత మరియు మొలకశాతం గణణీయంగా తగ్గిపోవడం వలన విత్తనానికి గాని లేక వినియోగానికి గాని పనికి రాకుండా అవుతాయి. దీనికి సరైన పరిష్కార మార్గం గాలి చొరవని మూడు పొరల సంచులు లేదా హెర్మాటిక్ బ్యాగులు వినియోగం. ఈ హెర్మాటిక్ బ్యాగులు వినియోగం వలన అపరాలను మరియు ఇతర ఆహార ధాన్యాలను ఎండబెట్టిన తర్వాత సురక్షితంగా మరియు తక్కువ ఖర్చుతో 6 నెలలకు పైగా ఇంటి వద్దనే నిల్వ చేసుకోవచ్చు. ఈ హెర్మాటిక్ బ్యాగులు 10 కేజీలు, 50 కేజీలు, 60 కేజీలు మరియు 100 కేజీలు సామర్ధ్యంతో లభిస్తున్నాయి. పరిమాణం ఆధారంగా వీటి ధర 11 రూ॥ నుండి 35 రూ.. వరకూ ఉంటుంది.
మూడు పొరల గాలి సంచులు లేదా హెర్మాటిక్ బ్యాగులు పని చేసే విధానం:
హెర్మాటిక్ అంటే ‘గాలి చొరవని’ అని అర్ధం. గాలి చొరవనివకుండా ఈ మూడు పొరలు మందంగా ఉండటం వలన కీటకాలు మరియు శిలీంధ్రాలకు ఆక్సిజన్ అందనీయకుండా చేయడం ద్వారా వాటిని నియాంత్రిస్తాయి. అదే విధంగా ఈ మూడు పొరల గాలిచొరవని సంచులలో అపరాలను నిల్వచేయడం వలన వాటిపై అంతకు ముందే ఉన్న కీటకాలు కూడా కార్బన్ డైయాక్సైడ్ అధికంగా ఉండటం వలన చనిపోవడం జరుగుతూ ఉంటుంది.
హెర్మాటిక్ బ్యాగులు వినియోగించే విధానం:
కోత అనంతరం అపరాలను లేదా ఇతర ఆహార ధాన్యాలను బాగా శుభ్రపరిచి తేమ శాతం కనీసం 13% వరకు ఎండబెట్టాలి. ఆహార ధాన్యాలు సరిగా అరక పోయిన లేక వర్షంలో తడిచిన కీటకాలు మరియు శిలీంధ్రాలు అధికంగా ఆశించడానికి ఆస్కారం ఉంది. ఆహార ధాన్యాలలో తేమ 8 నుండి 9 శాతం మధ్య ఉన్నట్లయితే నిల్వకు అనుకూలంగా ఉంటాయి.
బాగా ఎండబెట్టిన అపరాలను ముందుగా హెర్మాటిక్ బ్యాగులోని లోపలి పొరలో నింపి, పూర్తిగా నిండిన తర్వాత గట్టిగా గాలి చొరవకుండా లోపలి సంచి చివరిని ‘U’ ఆకారంలో మడచి తాడుతో కాని, రబ్బరు బ్యాండుతో కాని కట్టివేయాలి. దానిని రెండవ పొరలో పెట్టి దానిని గూడ బిగించి కట్టాలి. చివరగా దీనిని మూడవ పొరలలో పెట్టి ఆ సంచిని కూడా గాలి చొరవకుండా గట్టిగా బిగించికట్టాలి. ఇలా సంచికి మూడు పొరలు ఉండటం వలన లోన నిల్వచేసిన అపరాలకు ఒక గాలి చొరవని వాతావరణం కల్పించబడుతుంది.
ఇలా అపరాలను నింపిన బ్యాగులను ఇంటిలో గాని గోదాములలో కాని తడి లేని ప్రదేశంలో నిల్వచేయడం వలన మనం వీటిని ఎక్కువ కాలం ఎటువంటి కీటకనాశన మందులను మరియు రసాయినాలను కలుపకుండా సేంద్రియ పద్ధతిలో నిల్వచేయవచ్చు. అందువలన రైతాంగం సాధారణ గోనె సంచులకు బదులుగాని చొరవని మూడు పొరల సంచులను వినియోగించుకొని మినుములు,పెసలు, కందులు, శెనగలు వంటి అపరాలతో పాటుగా ఇతర ఆహారధాన్యాలను సురక్షితంగా నిల్వ చేయవచ్చు.

     డా. కె. భాగ్యలక్ష్మి, డా. డి. చిన్నంనాయుడు, కృషి విజ్ఞాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం
                                         శ్రీమతి కె. సుధారాణి, కె. వి.కె రెడ్డిపల్లి

Leave Your Comments

ధాన్యానికి మద్ధతు ధరలు దక్కాలంటే రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ..

Previous article

మిద్దెతోటలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు

Next article

You may also like