Colombo red gram yields more profits ఎప్పుడూ ఒకే రకం పంటలు పండించడం వల్ల ఒక్కోసారి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యవసాయంలో మూస ధోరణితో కొందరు రైతులు రొటీన్ పంటలనే పండిస్తున్నారు. అలా కాకుండా కొత్త రకం పంటలు, తక్కువ ఖర్చు, ఎక్కువ ఆదాయం చేకూరే పంటలను ఎంచుకుంటే అధిక దిగుబడి మాత్రమే కాకుండా పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు రైతులు. భిన్నంగా అలోచించి , వినూత్న ప్రయోగాలతో సాగు చేస్తే వ్యవసాయం ఒక బంగారు బాటలా మారుతుంది.
కొలంబో కంది సాగు చేస్తూ కొందరు రైతులు లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఎకరానికి దాదాపుగా 40 వేల నుంచి 50 వేల వరకు ఆదాయం అందుకుంటున్నారు. వరి, పత్తి పంటలకు వచ్చే ఆదాయం కంటే అధిక ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఒక ఎకరా – ఒక పంట – ఒక లక్ష ఆదాయం వచ్చేలా సాగు చేసి సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ రకం కొలంబో విత్తనాలు శ్రీలంక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ పంటని సాగు చెయ్యడం వల్ల ఆరేండ్ల పాటు సంవత్సరానికి రెండు పంటలను ఇస్తాయని చెప్తున్నారు రైతులు. కొలంబో కంది 146, 147, 156, 282 రకాలను సాగు చేస్తే అధిక దిగుబడి పొందే అవకాశం ఉంది. మరో విశేషం ఏంటంటే ఈ రకం పంటలో అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చు. మొత్తంగా ఏడాదికి ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సంపాదించవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులు ఈ రకం పంటని సాగు చేస్తున్నారు. కొలంబో కందికి మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉంది. Colombo red gram
ఈ పంట సాగు చేయడం వల్ల రైతులకు శ్రమ, సమయం, పెట్టుబడి కలిసి వస్తుంది. ఒక పంట వేయాలంటే ప్రతీసారి దుక్కిదున్నాల్సిందే. కానీ కొలంబో కందికి ఆ అవసరం లేదు. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు ఆరు సంవత్సరాలు లాభాలు పొందొచ్చు. ప్రస్తుతం మనం ఇతర దేశాల నుంచి దిగుబడి చేసుకుంటున్న కందిపప్పులో ఈ కొలొంబో రకమే అధికంగా ఉంటుంది. మన రాష్ట్రంలోని నేలలు కూడా ఈ పంటకు అనువుగా ఉంటాయి. కొలంబో కంది పంట ఇప్పుడు రైతులందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది.