ఆంధ్రా వ్యవసాయంతెలంగాణ సేద్యంమన వ్యవసాయం

సమగ్ర యాజమాన్య పద్దతుల ద్వారా కొబ్బరిని ఆశించే కొమ్ము పురుగు – నివారణ

0

కొబ్బరి మానవదైనందిన జీవితంలో ప్రముఖపాత్ర పోషిస్తుంది. కోనసీమ,కోస్తా ప్రాంతాలలో ఈ కొబ్బరి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సుమారు 1.4 లక్షల హెక్టార్ల లో సాగు చేయబడుతుంది. కోనసీమ, కోస్తా ప్రాంతాలలోనే కాక అనంతపురం, తెలంగాణ జిల్లాలైన నల్గొండ, ఖమ్మం, జిల్లాలలో ఏవైతే కొబ్బరి ప్రాధమిక పంట కాదో , అటువంటి జిల్లాలలో కూడా రైతులు ఎంతో మక్కువతో ఈ కొబ్బరిసాగును చేపడుతున్నారు. మన దేశంలో కొబ్బరి ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా నాటిన కొబ్బరి తోటలను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తున్న పురుగు కొమ్ముపురుగు. ఈ కొమ్ము పురుగు ఆశించిన తరువాత ఎర్రముక్కు పురుగు, మొవ్వు కుళ్ళు ఆశించే అవకాశం ఉండి చెట్టు చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొమ్ము పురుగును నివారంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

లక్షణాలు:

  • విప్పారిన ముదురు ఆకులపై “ v ” ఆకారములో కత్తిరించినట్లు ఉంటుంది. కొబ్బరిచెట్టు మొవ్వులో పురుగు తొలచిన రంధ్రము, మొవ్వు భాగంలో పురుగు నమిలి విడిచి పెట్టిన పిప్పి ఉంటుంది.
  • కొమ్ముపురుగు కొబ్బరి లేత మొవ్వు భాగము, పొత్తులను తొలుచుట వలన విప్పారిన లేత ఆకులు, పొత్తులు నష్టపోయి కొబ్బరి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది.
  • చిన్న మొక్కలలో ఈ పురుగు ఆశించి, మొవ్వు దెబ్బతిని మొక్క చనిపోయే ప్రమాదము కూడా ఉంది. అంతేగాక కొమ్ముపురుగు ఆశించిన మొక్కల మొవ్వు వంకర తిరిగి ఉంటుంది.
  • ఈ పురుగు ప్రత్యక్షంగానే కాక, పరోక్షంగా కూడా నష్టము కలుగజేసే అవకాశం ఉంది. ఈ పురుగు ఆశించిన చెట్లు మొవ్వుకుళ్ళు బారిన పడిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • అంతేగాక కొమ్ము పురుగు నష్టపరిచిన మొవ్వుభాగము నుండి వచ్చే పులిసిన నాసినకు కొబ్బరి కాండము తొలిచే ఎర్రముక్కు పురుగు ఆశించి నష్టము కలుగజేసే ప్రమాదమున్నది.

సమగ్ర యాజమాన్యం:-

  1. తోటలలో ఉన్న పడిపోయిన చెట్లను తొలగించి వాటిని తగిన విధంగా వినియోగించుకోవాలి లేదా నాశనము చేయాలి.
  2. పడిపోయిన చెట్ల మొదళ్ళు ( భూమిలో ఉన్న భాగము) త్రవ్వించి, తగుల బెట్టించాలి.
  3. తోటలో పశువుల ఎరువు కుప్పలు ఉంచరాదు. దగ్గరలోని పశువుల ఎరువు కుప్పలను 3 నెలలకొకసారి తిరగేస్తూ, వివిధ దశలలో ఉన్న కొమ్ము పురుగులను తీసి నాశనం చేయాలి.
  4. 3 నెలలకొకసారి కొబ్బరి చెట్ల మొవ్వలలో,ఆకు వలయాలలో వేప పిండి లేక వేపగింజల పొడి 100 గ్రాములు,130 గ్రాములు ఇసుకలో కలిపి చల్లాలి.
  5. మెటరైజియమ్ ద్రావణాన్ని మూడు ఘనపు మీటర్ల కుప్పకు ఒక లీటరు ద్రావణము ( లీటరుకు 5 గ్రాములు) చొప్పున చల్లి, మెటరైజియమ్ బూజు తెగుళ్ళను,పురుగు ఉధృతి కేంద్రాలైన పశువుల పెంట, వ్యర్ధ సేంద్రీయ పదార్ధాల కుప్పంలో వ్యాప్తి చేయాలి.
  6. కొమ్ము పురుగును ఆకర్షించు రైనోల్యూక్ అనే ఫిరమోన్ ఎరలను బక్కెట్లో  పెట్టి 5 ఎకరముల తోటకు ఒకటి చొప్పున పెట్టి, వాటి లోపలికి తల్లిపురుగులు ఆకర్షితమైన తరువాత చంపాలి.
  7. 2 – 4 సంవత్సముల లోపల వయస్సు గల కొబ్బరి మొక్కలలో కొమ్ముపురుగు ఉధృతి ఎక్కువ ఐన ఎడల ఫెర్టరా గుళికలు (0.4 శాతం జి.ఆర్. క్లోరాన్ ట్రానిలిప్రోల్) 5-10 గ్రాములను చిన్న పాలధీన్ సాచేట్ లలో కట్టి మొవ్వులో ఉంచాలి.

ఫెరమోన్ ఎరలు :

  • కొమ్ము పురుగు యొక్క సెరామోన్ ఎరలను ఉపయోగించి అధిక సంఖ్యలో కొమ్ము పురుగులను ఆకర్షింప చేసి నాశనము చేయవచ్చు.
  • ఫెరమోన్ కలిగిన చిన్న ప్యాకెట్ ను ప్లాస్టిక్ బకెట్ ( 10.లీ కెపాసిటీ) లో రేకుల మధ్యలో అమర్చి,హంగర్ సహాయముతో 10-15 అడుగుల ఎత్తుగల స్తంభాలకు తోటలో అమర్చవలెను.
  • ఈ మధ్య కాలంలో బహుళజాతి సంస్థలు 5 లీ .సామర్ధ్యం గల ఆకర్షపు ఎరను వాడుకలోకి తీసుకురావటం జరిగింది.
  • బకెట్ లో పడిన కొమ్ము పురుగులను సేకరించి నాశనము చేయుట వలన చాలా వరకు కొమ్ముపురుగు తగ్గే అవకాశముంది.

మెటారైజియమ్ :

  • ఈ మెటారైజియమ్ శిలీంద్రము కొమ్ము పురుగు యొక్క అన్ని దశలను (గొంగళి పురుగు దశ, కోశస్థ దశ, తల్లి పురుగు దశ) ఆశించి నివారించును.
  • ప్రయోగశాలలో మెటారైజియమ్ ను మొక్కజొన్న లేక జొన్నగింజల పొడి పై ఉత్పత్తి చేసి వాటిని కొమ్ము పురుగు ఉత్పత్తి కేంద్రములైన కుళ్లుతున్న పెంట కుప్పలు, చనిపోయిన కొబ్బరిమానులు ,మొదళ్ళు మొదలైన వాటి పై చల్లాలి.
  • వేసవి కాలం కంటే, గాలిలో తేమ శాతం అధికంగా ఉండే వర్షాకాలంలో ఈ బూజు తెగులు అధికంగా ఉంటుంది.
  • జొన్న లేక మొక్కజొన్న పొడి మాత్రమే కాకుండా మెటారైజియమ్ ఆశించిన లార్వాల నుండి శిలీంధ్రబీజములకు నీటిలో కలిపి (5 – 10 శిలీంద్ర బీజములు) మూడు ఘనపుటడుగుల పెంటకుప్పకు ఒక లీటరు ద్రావణము చొప్పున పెంట కుప్పల పై చల్లవలెను.
  • ఈ విధముగా చేసిన పెంటకుప్పలో ఉన్న కొమ్ము పురుగు దశాలనన్నీయూ నిర్మూలమగును.
  • తెగులు సోకిన తరువాత గోధుమ రంగులో ఉండు లార్వా పురుగులు నీరశించి ఆహారము తినక కృశించి,ముడుతలు పడి ఉపరితలమునకు చేరి చనిపోతాయి. ఆ తరువాత శరీరము పై నీలం మరియు ఆకుపచ్చ కలిగిన రంగులో ఉండు శిలీంధ్రబీజములు వృద్దిచెంది లార్వాలు నీలి ఆకుపచ్చ రంగులోకి మారును. ఈ విధంగా లార్వా (లేదా) ఇతర దశలపై ఉన్న శిలీంధ్ర బీజములు మిగిలిన ఉత్పత్తి కేంద్రములకు వ్యాపిస్తాయి.

డా.ఎన్.బి.వి చలపతి రావు,ప్రధాన శాస్త్రవేత్త ,కీటక విభాగం ,డా .బి.వి.కె. భగవాన్,ప్రధాన శాస్త్రవేత్త (హార్టికల్చర్),&హెడ్. డా.డి దేవికారాణి, రీసెర్చ్ అసోసియేట్ ,కీటక విభాగం 

Leave Your Comments

యాసంగి మొక్కజొన్న సాగు  –  సూచనలు

Previous article

మునగలో విశిష్టత

Next article

You may also like