ఇరు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే నూనె గింజ పంటల్లో ఆముదానికి ప్రత్యేక స్థానముంది. మన రాష్ట్రం ఆముదం సాగులో దేశంలోనే రెండవ స్థానంలో ఉంది. ప్రతి యేటా మూడు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయబడి మంచి ఆదాయాన్ని ఆర్జించి పెడుతుంది. ఈ పంట ముఖ్యంగా నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ప్రకాశం, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో సాగు చేయబడుతూ ఉంటుంది. ఈ పంటను జూలై ఆఖరు వరకు నాటుకోవచ్చు. అందువల్ల ఈ పంటలో సాగు, యాజమాన్య పద్ధతులను గురించి తెలుసుకుందాం.
నేలలు-వాటి తయారీ :
సాధారణంగా ఈ పంటను అన్ని రకాల నేలలందు సాగుచేయవచ్చును. నీరు బాగా ఇంకిపోయే సాధారణమైనటువంటి తేలిక నేలలు అనుకూలమైనవి. నేలను రెండు, మూడు సార్లు దున్ని గుంటకతో సమపర్చాలి.
విత్తనం, విత్తే పద్ధతి :
ఆధునిక దిగుబడినిచ్చే రకాలకు (క్రాంతి,జ్యోతి,జ్వాల,కిరణ్) ఎకరాకు మూడు, నాలుగు కిలోల విత్తనం సరిపోతుంది. అదే సంకర జాతి రకాలకు 2.5-3 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుంది. విత్తనాన్ని విధిగా విత్తన శుద్ధి చేయాలి. ఒక కిలో విత్తనానికి మూడు గ్రాము థైరమ్ లేదా కాప్టాన్ లేదా కార్బెండిజమ్ మందును వాడాలి. విత్తనాన్ని విత్తేటప్పుడు వరుస మధ్య 90 సెం.మీ వరుస వెంట 45 సెం.మీ. లేదా 60 సెం.మీ దూరంలో విత్తాలి. ఆలస్యంగా నాటేటప్పుడు సుమారు 60-30 సెం.మీ దూరంలో వేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చును. రెమ్ము తుంచిన పంటకు 45 – 35 సెం.మీ దూరం ఉండాలి.
రకాలు-గుణగణాలు :
ఆముదంలో అరుణ, క్రాంతి, జ్యోతి, జ్వాల, కిరణ్, హరిత అనే రకాలు, జి.సి.హెచ్- 4, డి.సి.హెచ్- 32, జి.సి.హెచ్- 5, డి.సి.హెచ్- 177 హైబ్రిడ్ రకాలు సాగుకు అనువైనవి. జ్యోతి, జ్వాల, జి. సి. హెచ్-4,5, డి.సి.హెచ్-177 రకాలు ఎండు తెగుళ్ళను తట్టుకుంటాయి.
అరుణ :
ఈ రకం తొలకరికి విత్తే రకం. సుమారు 120-150 రోజుల్లో పంటకొస్తుంది. ఎర్రని కాండం కలిగి కురుచైన మొక్కపూత దట్టంగా ఉంటుంది. నూనె దిగుబడి సుమారు 50 శాతం కలిగి మొదటి గెల 9-15 కుణువు దగ్గర వచ్చి ఎకరాకు 4-5 క్వింటాళ్ళు దిగుబడినిస్తుంది.
క్రాంతి (పి.సి.యన్- 4) :
గింజ పెద్దదిగా ఉండి బెట్టకు తట్టుకొని 90-150 రోజుల్లో పంటకొస్తుంది. ఎకరాకు సుమారుగా 5 – 6 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.
జ్వాల (48-1) :
ఈ రకం బూజుతెగులు, ఎండుతెగులను తట్టుకొని 150-180 రోజుల్లో పంటకొచ్చి 4-6 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.
జ్యోతి (డి.సి.యన్- 9) :
ఈ రకం ఎండుతెగులను తట్టుకొని 90-150 రోజుల్లో పంటకొచ్చి 4-5 క్వింటాళ్ళ దిగుబడి ఎకరాకు ఇస్తుంది.
కొత్త రకాలు:
కిరణ్ (పి.సి.యన్- 136) :
ఈ రకం 90-150 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 4-6 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది. వర్షాధారంగా పండి, నీటి ఎద్దడిని, పచ్చదోమను తట్టుకుంటుంది. గెలలో ఆడపూలు ఎక్కువగా వచ్చి పొడవు గెలిస్తుంది.
హరిత (పి.సి.యన్-124) :
ఈ రకం 90-180 రోజుల్లో పంటకు వచ్చి ఎకరాకు 5.5-6.5 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. తర్వాత ఆలస్యంగా విత్తుకునే దక్షిణ, తెలంగాణ, రాయసీమ ప్రాంతాలు, ప్రకాశం జిల్లాకు అనువైనది. కాయ చిట్లవు, రెండు దఫాలుగా పూతకు వస్తుంది. నీటి ఎద్దడిని చాలా వరకు తట్టుకుంటుంది.
ఎరువులు :
ఎకరాకు సుమారు రెండు నుంచి మూడు టన్నుల పశువుల ఎరువును దుక్కిలో కలియదున్ని ఆఖరి దుక్కిలో భాస్వరం ఎకరానికి 15-18 కిలోల (క్వింటాల్ సూపర్ ఫాస్ఫేట్ (సుమారుగా), పోటాష్ ఎకరానికి 12-15 కిలోల (సుమారు 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వేయాలి. నత్రజని రెండు దఫాలుగా (30+30) సగం విత్తడానికి ముందు మిగిలిన సగాన్ని 35`40 రోజుల్లో వేయాలి. హైబ్రీడ్‌లకు 80-100 కిలోల నత్రజనిని వాడాలి.
అంతరపంటలు – అంతరకృషి :
వర్షధార పరిస్థితుల్లో అనిశ్చిత పరిస్థితులను అధిగమించి ఆదాయాన్ని పొందేందుకు ఆముదంలో కంది 1:1 పెసర, అలసంద, గోరుచిక్కుడు, సోయాచిక్కుడు పైర్లను 1:2, వేరుశనగ 1:5 నిష్పత్తిలో అంతర పంటలుగా వేసుకోవచ్చును. విత్తిన 20 రోజుల వ్యవధిలో చేతితో కలుపు తీసి గుంటకగాని, దంతులుగాని నాటిన 40 రోజులలోపు నడపాలి. నైట్రోఫిన్ 1.25 కిలోలు లేదా అలాక్లోర్ 1.5 కిలోలు హెక్టారుకు కలుపు మొక్కలు మొలవక ముందు వాడి కలుపు మొక్కలను నివారించవచ్చును.
దాసరి నామాల పురుగు :
వీటి యాజమాన్యానికి ఎకరాకు 50 వేల ట్రైకోగ్రామా పరాన్నజీవులను పైరుపై వదలాలి. ఎదిగిన దాసరి పురుగును ఏరివేయాలి. పక్షులు కూర్చునేందుకు వీలుగా ఎకరాకు 10 వంగ కర్రలు పాతాలి. ఆకుల అడుగుభాగం తడిచేలా వేప నూనె ( 5 మి.లీ. / లీ.) లేదా బాస్లిస్ తురింజెనిసిస్ (ఒక మి.లీ / లీ) పిచికారీ చేయాలి. పైరులో మైక్రోసైటిస్ అనే పరాన్న జీవులు ఎక్కువగా ఉంటే పురుగు మందు చల్లారదు. వీటిసంఖ్య తక్కువగా * ఉంటే గనుక మోనోక్రోటోఫాస్(1.6 మి.లీ/లీ.) లేదా కార్బరిల్ (3 గ్రా / లీ.) పిచికారీ చేయాలి.
ఎర్రగొంగళి పురుగు నివారణకు ఉధృతిని బట్టి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలి. రసం పీల్చే, కాయ తొలుచు పురుగుకు డైమిధోయేట్ (2 మి.లీ / లీ) లేదా మోనోక్రోటోఫాస్ (1.6 మి.లీ./ లీ) పిచికారీ చేయాలి. పొగాకు లద్దెపురుగు నివారణకు గుడ్ల సముదాయాలున్న ఆకులు ఏరివేసి వేపనూనె 5. మి.లీ / క్లోరిపైరిఫాస్ (2.5 మి.లీ) / మోనోక్రోటోఫాస్ (2 మి.లీ) లీటరు నీటికి కలిపి చల్లాలి. ఎదిగిన పురుగు నివారణకు 5 లీటర్ల నీటికి 5 కిలోల తవుడు, అరకిలో బెల్లం, అర లీటరు మోనోక్రోటోఫాస్ కలిపి తయారు చేసిన ఎర ఉండలు ఎకరాకు పెట్టాలి.
తెగుళ్ళు :
బూజు తెగులు (గ్రేరాట్) యాజమాన్యానికి ముసురు సూచనలుంటే గమనించి కార్బండిజమ్ / థయోఫాస్ఫేట్ మిథైల్ 0.05 శాతం పిచికారీ చేయాలి. విత్తేటప్పుడు పైరును ఎడంగా విత్తితే ఈ తెగులు బాధ నుండి తగ్గించుకోవచ్చు. తెగులు సోకిన గెలల్ని తీసివేయాలి. వర్షం వెలిసిన తరువాత ఎకరాకు 20 కిలోలు యూరియాపై పాటుగా వేయాలి. ఆకుమచ్చ తెగులుకు మాంకోజెబ్ (2 గ్రా/ లీ) పిచికారీ చేయాలి. వేరుకుళ్ళు, ఎండుతెగులు రాకుండా విత్తిన శుద్ధి మేలైన విధానం.
చివరగా రైతు విత్తనం సేకరించేటప్పుడు నాణ్యమైన విత్తనాన్ని ఎన్నుకొని ఈ వర్షాలకు విత్తనం విత్తాలి. విత్తనాలకు ఆగష్టు నెల 15 తర్వాత విత్తటం మంచిది కాదు. నేలలో తేమను బట్టి సిఫార్సు చేయబడ్డాయి. దాసరి పురుగు, ఎర్రగొంగళి పురుగు, కాయకుళ్ళు తెగుళ్ళ ఉధృతిని గమనిస్తూ సూచించిన చర్యను సకాలంలో చేపట్టి, సలహాకు సందేహాలకు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలను లేదా మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించండి.
మన రాష్ట్రంలో ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూనె గింజలు ఆముదంపై ప్రాంతీయ వ్యవసాయం పరిశోధనాస్థానాలైన జగిత్యాల, పాలెంలో శాస్త్రవేత్తలు ఆముదం పంటపై పరిశోధనలు చేస్తున్నారు. రైతాంగం పంటపై పరిశోధనలు చేస్తున్నారు. రైతాంగం ఆయా ప్రాంతాల శాస్త్రవేత్త సలహాను వాడి ఆముదంలో అధిక దిగుబడులకు కృషి చేయాలి.
ఆముదం సాగు – యాజమాన్య పద్ధతులు
Leave Your Comments