CASTOR వాణిజ్య విలువలు గల నూనెగింజల పంటలలో ఆముదం ఒక ముఖ్యమైన పంటగా చెప్పవచ్చు. పారిశ్రామికంగా ఎంతో విలువైన ‘రిసినోలిక్ ఆమ్లం’ కేవలం ఆముదం నూనెలో మాత్రమే లభ్యమవుతుంది. ఆముదం యొక్క ఉత్పత్తులు మరియు ఉపఉత్పత్తులు సుమారు 200కు పైగా పరిశ్రమలలో వాడబడుతున్నాయి. ఆముదం పంట యొక్క సాగు విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. మనదేశంలో ఆముదం పంట 8.3 లక్షల హెక్టార్లలో సాగవుతూ 14.21 లక్షల టన్నుల ఉత్పత్తి నమోదు చేసింది . ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో ఈ పంట సాగులో వుంది. జాతీయ సగటు ఉత్పాదకత 1700 కి/హె. వుండగా మన రాష్ట్ర సగటు ఉత్పాదకత కేవలం 590 కి/హె. మాత్రమే ఉంది. దీనికి పలు కారణాలు వుండగా నాణ్యమైన విత్తనాలను వాడకపోవటం, నిస్సారవంతమైన నేలల్లో పూర్తిగా వర్షాధారంగా సాగుచేయటం, సరైన యాజమాన్య పద్ధతులను పాటించకపోవడం, దీర్ఘకాలిక బెట్ట మరియు బూజు తెగులు ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.
నేడు ఆముదంలో చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులనిచ్చే కొత్త వంగడాలు/సూటి రకాలు ఎన్నో అందుబాటులో వున్నాయి. కాబట్టి రైతులు వారి నేల స్వభావం, వాతావరణం, వర్షపాతం, నీటి వసతి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని రకాలను ఎంపిక చేసుకోవాలి. ఆముదంలో అందుబాటులో ఉన్న వివిధ రకాలు, వాటి గుణగణాల వివరాలు
పి.సి.హెచ్-111 : ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పాలెం వారిచే రూపొందించబడిన సంకర రకం. దీని కాండం ఆకుపచ్చ రంగులో వుంటుంది. మైనపు పూత పల్చగా కాండంపైన మరియు ఆకుల అడుగు భాగాన వుంటుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. మిగతా రకాలతో పోలిస్తే. బూజు తెగులు ఉధృతి కొంత తక్కువగా ఉంటుంది. గెలలు పెద్దవిగా వుంటాయి. 90-95 రోజులకు మొదటి గెల కోతకు వస్తుంది.
ప్రగతి: ఇది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పాలెం వారిచే రూపొందించిన సూటి రకం. కాండం ఆకుపచ్చ రంగులో వుండి, తెల్లని మైనపు పూత కాండంపై మరియు ఆకుల అడుగు భాగాన వుంటుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. గింజ పరిమాణం పెద్దదిగా వుండి, నూనె శాతం అధికంగా ఉంటుంది. 80-85 రోజుల్లో మొదటి గెల కోతకు వస్తుంది. వర్షాధారంగా సాగుచేసినప్పుడు ఎకరానికి ప్రదేశ్, 6-7క్కి దిగుబడినిస్తుంది.
ఆముదం సాగు చేసే రైతులు పంటను విత్తేముందు ఈ క్రింది అంశాలను గమనించాలి.
ఆముదాన్ని 500 నుండి 600 మి.మీ. సగటు వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో సాగు చేయవచ్చు. సహజంగానే ఆముదానికి కొంత వరకు బెట్టను తట్టుకునే సామర్థ్యం కలిగి వుంది. అధిక వర్షపాతాన్ని కూడా కొంత వరకు తట్టుకోగలదు కాని పొలంలో మురుగు నీరు నిలువ వుంటే మాత్రం పంట తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి పొలం నుండి మురుగు నీరు బయటకు పోయే వసతి తప్పనిసరిగా ఏర్పరచుకోవాలి.
- ఆముదం పంట సాగుకు ఎర్రనేలలు, ఎర్ర చల్కానేలలు, మధ్యస్థ నల్ల రేగడి నేలలు అనుకూలంగా వుంటాయి. చౌడు భూముల్లో ఈ పంటను సాగు చేయకూడదు. భూసారం ఎక్కువగా ఉన్న బరువైన నేలల్లో సాగుకు రైతులు సంకర రకాలను ఎంపిక చేసుకుంటే అధికం దిగుబడులు పొందవచ్చు.
- వేసవిలో లోతు దుక్కులు చేసుకుంటే గట్టిగా వున్న నేల పైపొర గుల్లగా మారి తరువాత వేర్లు సులువుగా చొచ్చుకొనిపోవడానికి సహాయపడతాయి. అంతేకాకుండా కలుపు మొక్కల విత్తనాలు, పురుగుల యొక్క కోశస్థ దశలు, లోతు దుక్కులు చేసినప్పుడు భూమి లోపలి పొరల నుండి పైకి వచ్చి ఎండవేడికి నాశనం అవుతాయి.
- తొలకరి వర్షాలు పడిన తరువాత భూమిని 3-4 సార్లు నాగలితో దున్ని తరువాత గుంటకతో చదును చేసుకోవాలి. ఋతుపవనాలు ప్రారంభమైన తరువాత ఎర్ర నేలల్లో 50-60 మి.మీ., నల్లరేగడి నేలల్లో 60-70 మి.మీ. వర్షపాతం నమోదైన తరువాతనే ఆముదం పంటను విత్తుకోవాలి.
- ఖరీఫ్లో సాగుకు ఆముదాన్ని జూన్ 15 నుండి జూలై 31 లోగా విత్తుకోవాలి. విత్తే తేది ఆలస్యమయ్యే కొద్ది దిగుబడులు తదనుగుణంగా తగ్గుతాయి.
- ఋతుపవనాల రాక ఆలస్యమై మరే ఇతర ఖరీఫ్ పంటలు వేసుకోలేని పరిస్థితులకు ఒక ప్రత్యామ్నాయ పంటగా సాగుచేయదలచినప్పుడు ఆగష్టు మొదటి వారం వరకు ఆముదం పంటను విత్తుకోవచ్చు. వర్షాధారంగా సాగుచేస్తున్న రైతులు సాధారణంగా బోదెలు తీయరు. వర్షపునీరు బోదెల మధ్య ఎక్కువ సేపు నిలువ ఉండడం చేత భూమిలోకి బాగా ఇంకి, మొక్కల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు బోదెలు తీసే పద్ధతిని తప్పనిసరిగా అవలంభించాలి. రెండు సార్లు అంతరకృషి చేసిన తరువాత మళ్ళీ గుంటక సహాయంతో బోదెలను ఏర్పరచుకోవాలి.
- విత్తే ముందు విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే విత్తనం లేదా భూమి ద్వారా వ్యాపించే తెగుళ్ళు పంట మొదటి దశలో ఆశించకుండా సమర్థవంతంగా నియంత్రించవచ్చు. తద్వారా సస్యరక్షణ ఖర్చులు రైతులు తగ్గించుకోవచ్చు. ఒక కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ లేదా 3 గ్రా. థైరమ్ లేదా 1 గ్రా. కార్బండాజిమ్ మందుతో విత్తనశుద్ధి చేసుకుంటే మొలక కుళ్ళు తెగులు మరియు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులును నివారించవచ్చు.