Cashew Nut Cultivation: జీడిమామిడి తోటలను మన రాష్ట్రంలో శ్రీకాకుళం-నెల్లూరు వరకు గల కోస్తా తీర ప్రాంతంలో మూడు లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. దీని ఉత్పత్తి 95 వేల టన్నులు, ఉత్పాదకత ఎకరాకు 280 కేజీలు.

Cashew Nut Cultivation
Also Read: Cashew Feni: జీడి మామిడి పండుతో మద్యం ఎలా చేస్తారు.!
ప్రవర్థనం: జీడి మామిడిని విత్తనం ద్వారా మరియు శాఖీయ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చును. ప్రవర్ధన పద్దతి ఏదైనా ప్రవర్ధనానికి కావల్సిన విత్తనపు గింజలను లేదా శాఖలకు కొన్ని ప్రత్యేక లక్షణములు గల తల్లి చెట్టు నుండి సేకరించాలి. ఆ లక్షణాలేమనగా చెట్టు ఒత్తుగా కురచ కొమ్మలు, ఎక్కువగా ఉండాలి. ఎక్కువ శాతం ఆడ పువ్వులను కలిగిఉండాలి. మధ్య సైజు కలిగిన గింజలు కలిగి అధిక దిగుబడినిచ్చే విధంగా ఉండాలి. మరియు చీడ పీడలను తట్టుకొన కలిగి ఉండాలి.
జీడి మామిడిని శాఖీయంగా గాలి అంట్లు (Airlayerings) ఎపికొటైల్ గ్రాఫ్టింగ్ మరియు సాఫ్ట్ఫుడ్ గ్రాఫ్టింగ్ అనే పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేయుచున్నారు. 4 నెలల వయసు పైబడి 10-15 ఆకులు కల్గి ఉన్న అంటు మొక్కలను పొలంలో నాటుకొనుటుకు ఉపయోగించాలి.
జీడిమామిడి గింజలు మొలకెత్తి శక్తిని త్వరగా కోల్పోతాయి. కాబట్టి అప్పుడే సేకరించిన గింజలను నాటుకొనుటకు వాడాలి. మధ్య పరిమాణం గల 5-6 గ్రాముల బరువుండే విత్తనపు గింజలను సేకరించాలి. విత్తనాన్ని సుమారు 2-3 రోజులు బాగా ఎండబెట్టాలి. హెక్టారుకు సుమారు 2 కేజీల విత్తనపు గింజలు సరిపోతాయి.
గింజలు విత్తడానికి ముందు సుమారు 48 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత నాటాలి. దీని వల్ల గింజలు త్వరగా మొలకెత్తును. విత్తనాన్ని నారుగా పెంచిగాని లేక పొలంలో నేరుగా నిర్ణీత భాగాలలో విత్తవచ్చును, విత్తనాన్ని పాలిథీన్ సంచులలో విత్తుట మంచిది. ఈ సంచులలో మట్టి, పశువుల ఎరువును కల్పి నింపవలెను. సంచులలో తేమ ఎక్కువగా ఉంటే విత్తనం కుళ్ళిపోవును. కావున తగినంత తేమను మాత్రమే ఉంచాలి. విత్తనాలు విత్తిన 20-30 రోజులలో మొలకెత్తి 50-60 రోజులలో నాటుటకు సిద్ధంగా ఉండును.
నాటడం: జీడిమామిడిని నాటుటకు 20 రోజుల ముందు 60×60×60 సెం.మీటర్ల గుంతలను 8-10 మీటర్ల ఎడంతో తీసి ఎరువు మరియు మట్టి మిశ్రమంతో గుంతను నింపాలి. నారు మొక్కలు సుమారు 2 నెలల వయసు కల్గినప్పుడు నాటటం మంచిది. నేరుగా విత్తదల్చుకున్నప్పుడు ప్రతి గుంతకు 2-3 విత్తనాలు విత్తి తర్వాత ఏపుగా దృఢంగా పెరుగుచున్న ఒక మొలకను మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తీసివేయాలి. వర్షం పడిన తరువాత జీడిమామిడి అంట్లను జూలై ఆగష్టు నెలల్లో నాటుకోవాలి. ఎంపిక చేసిన రకపు కొమ్మ అంట్లను, అంటు అతుకు జాయింట్ నేలకు 5 సెం.మీ పైన ఉండే విధంగా గుంటల మధ్యలో నాటాలి.
Also Read: Cashew Nut Business: జీడిపప్పు వ్యాపారంతో లక్షల ఆదాయం