మన వ్యవసాయం

క్యారెట్ రైతు విజయగాధ..

0

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలంలో గూడూరు గ్రామాన్ని దత్తత గ్రామంగా ఎంపిక చేయటం జరిగినది. ఈ గ్రామానికి శంషాబాద్ దగ్గరగా ఉండటం వలన. దత్తత గ్రామ కమిటీ సభ్యులు కూరగాయల సాగును ప్రోత్సహించినారు. ప్రోత్సాహాంలో భాగంలో వ్యవసాయ కళాశాలకు చెందిన అనుభవం ఉన్న శాస్త్రవేత్తలతో కూరగాయల మీద శిక్షణ కార్యక్రమాలను నిర్వహించినారు.  

దీనిలో భాగంలో గూడూరు గ్రామానికి చెందిన అత్తిలి మల్లారెడ్డి అనే రైతు క్యారెట్ సాగును చేపట్టినారు. మల్లారెడ్డి తనకు ఉన్న భూమిలో కంది, మొక్కజొన్న, ప్రత్తి మరియు వరి పంటను సాగు చేయడం జరిగింది. తరువాత దత్తత గ్రామ కమిటీ శాస్త్రవేత్తల సూచనల మేరకు ముందుగా అర ఎకరంలో క్యారెట్ సాగును చేపట్టినారు. క్యారెట్ సాగులో భాగంగా అర ఎకరం పొలాన్ని ట్రాక్టర్ తో లోతుగా దుక్కి దున్ని చదును చేసుకొన్నారు. దుక్కి చేయించిటానికి ఐదు వేల రూపాయల ఖర్చు చేయడం జరిగినది. దత్తత గ్రామ శాస్త్రవేత్తల, క్షేత్ర ప్రదర్శనలో భాగంగా నంధారి కంపెనీకి చెందిన సూపర్ కరొడా అనే క్యారెట్ రకంను రైతుకు అందజేయడం జరిగినది. తరువాత 600 గ్రా. క్యారెట్ విత్తనాన్ని మూడు కిలోల ఇసుకలో కలిపి అర ఎకరం పొలంలో చల్లడం జరిగినది. వర్షం పడటం వలన నీరు ఇవ్వలేదు. తరువాత కలుపు నివారణకు మెట్రీలుజిన్ 75 డబ్ల్యుపి నీటిలో కలిపి అర ఎకరం పొలంలో పిచికారీ చేసినారు. పొలం తయారీలో భాగంగా ఒక బస్తా ఎరువును (28-28-0)కిలోలు పొలంలో వేయడం జరిగినది. ఎరువులకు సుమారుగా రూ. 2275/- రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. క్యారెట్ విత్తనం నాటిన 6-7 రోజులలో మంచి మొలక వచ్చినది. సుమారుగా 5000/- రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. అవసరాన్ని బట్టి స్ప్రింక్లర్ల ద్వారా నీరు అందించారు. తరువాత నాటిన 45 రోజులకు ఒకసారి 19-19-19 అనే ఎరువుల మందును లీటరు నీటికి 5 గ్రా. కలిపి పిచికారీ చేయడం జరిగినది. వాతావరణం అనుకూలంగా ఉండటం వలన ఎటువంటి పురుగు మందులు పిచికారీ చేయవలసిన అవసరం రాలేదు. క్యారెట్ విత్తిన 90 రోజులకు, దశల వారిగా క్యారెట్ ను పీకి, నీటిలో శుభ్రంగా కడిగిన తరువాత మార్కెట్ కు తరలించినారు. కోత మరియు రవాణాకు సుమారుగా రూ॥ 20,000/-(ఇరవై వేల రూపాయలు) ఖర్చు అయినది. క్యారెట్ కు మార్కెట్ రేటు సరాసరి కిలోకు పదిహేను రూపాయలు ధర వచ్చినది. మొత్తంగా అర ఎకరానికి 50 క్వింటాళ్ల క్యారెట్ దిగుబడి వచ్చినది. చివరకు అర ఎకరం నుండి మొత్తం ఆదాయం రూ.75,000/- వచ్చినది. సాగు ఖర్చు రూ.34,575/- అయినది. నికరాదాయం రూ 40,425/-వచ్చినది. 

   సాగు ఖర్చు వివరాలు (అర ఎకరానికి)                                 ఖర్చు (రూపాయాలలో)         

  1. దుక్కిదున్నటం మరియు చదును చేయడం                                           5,000/- 
  1. విత్తనం ఖరీదు                                                                                1,500/- 
  1. కలుపు నియంత్రణ                                                                              800/- 
  1. ఎరువులు                                                                                       2,275/- 
  1. కోత కూలీ                                                                                      10,000/- 
  1. రవాణా ఖర్చు                                                                                 10,000/- 
  1. స్ప్రింక్లర్ అమరిక                                                                             5,000/- 

                                                                                                    = 34,575/- 

దిగుబడి 50 క్వి  

మొత్తం ఆదాయం (15/-కిలో) రూ॥ 75,000/- 

సాగు ఖర్చు = రూ॥ 34,575/- 

నిఖరాదాయం = రూ॥ 40,425/- (అర ఎకరానికి)

డా॥ ఎమ్. వెంకటేశ్వరరెడ్డి, డా॥ సుహాసిని, డా॥ రాజేశ్వరి,
డా॥రవీందర్ నాయక్, డా॥ అంజయ్య మరియు డా॥ ఎస్.మధుబిందు
వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్.
  
 

Leave Your Comments

COVID – 19 సందేహాలు, సమాధానాలు, జాగ్రత్తలు..

Previous article

పార్థీనియం కలుపు మొక్కలను అరికట్టే చర్యలు..

Next article

You may also like