భారతీయుల జీవన సరళిలో, ఆహార వినియోగంలో పసుపుకు ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. పసుపును శుభ సూచికంగా భావించే హిందూ సమాజంలో తెలుగు వారి పాత్ర ప్రత్యేకమైంది. ఇక్కడి సారవంతమైన, అపార జల సంపదతో కూడిన భూముల్లో అత్యధిక మంది రైతులు పసుపును ఎంతో ఉత్సాహంగా పండిరచడంతో పాటు, గృహ అవసరాలకు దాన్ని వినియోగించడం పరిపాటి. ఇప్పటి వరకూ దేశంలో పసుపు పంటను పండిరచేందుకు ప్రతిభ, టేకూరిపేట, సేలం, ఈరోడ్, మైదుకూరు రకాలపై రైతులు ఆధారపడుతున్నారు. దశాబ్దకాలానికి పైగా ప్రతిభ పసుపు రకం బాగా ప్రాచుర్యంలోకి వచ్చి, దేశీయ మార్కెట్‌లో తన సత్తాను నిరూపించుకొంటోంది.
తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు జిల్లాలో అనాదిగా పసుపు పండిరచడం రైతులకు ఎంతో ఇష్టమైన వ్యవహారం. అక్కడి రైతులు అధికంగా ప్రేమించి, సాగు చేసుకునే దుగ్గిరాల పసుపు రకం ప్రస్తుతం కనుమరుగౖెెపోయింది. ఎంతో సువాసనతో, పసుపు విలువకు ప్రాధాన్యతనిచ్చే కుర్కుమిన్ పదార్ధం శాతం అధికంగా ఉండి, ఈ గడ్డపై పుట్టిన ఈ రకం ఉనికి ప్రస్తుతం కేరళలోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధనా సంస్థలో ఒక ఎగ్జిబిషన్ వస్తువుగానే పరిగణించబడుతున్నది. దుగ్గిరాల రకం అంతర్ధానం తరువాత వచ్చిన పైన తెలిపిన పసుపు రకాలు వివిధ కారణాల వల్ల రైతులకు ఆశాజనకంగా కనిపించకపోవడం, తెగుళ్లు, పురుగుల తాకిడి అధికం కావడం, పసుపు నుండి అనుబంధ ఉత్పత్తులు తీసే సంస్థలు అధిక కుర్కుమిన్ శాతాన్ని కోరుకోవడం ఫలితంగా కేరళ సుగంధ ద్రవ్యాల శాస్త్రజ్ఞులు గింజ నుండి ఉద్భవింపచేసిన ప్రతిభా రకం పసుపును ఎక్కువ మంది రైతులు తమ పంట పొలాల్లో సాగు చేసుకొని, మరిన్ని ఉత్తమమైన రకాల కొరకు ఎదురుచూస్తున్న నేపథ్యం.
మారుతున్న కాలం, వాతావరణ పరిస్థితుల్లో సమతుల్యం లోపించడం, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పసుపు పంటకు కూడా స్వాభావికంగా తెగుళ్ళు సంభవించడం, పసుపులో ఉండవలసిన కుర్కుమిన్ శాతం లాభసాటిగా లభించకపోవడంతో ప్రత్యామ్నాయ రకం కొరకు అటు శాస్త్రజ్ఞులు, ఇటు రైతులు జరుపుతున్న పరిశోధనలకు ఒక కొత్త ఊపు లభించింది. కేరళ రాష్ట్రంలోని టెక్కాడి అడవులు సహజమైన సుగంధ ద్రవ్యాల పంటలకు నిలయమైన నేపథ్యంలో అక్కడి నుండి సేకరించిన రెండు పసుపు రకాల్ని ఎసిసి-48, ఎసిసి-79 రూపంలో వాటిపై అభివృద్ధి పరిశోధన బాధ్యతలను సుగంధ ద్రవ్యాల పరిశోధనా సంస్థ తెలుగు రైతులకు అప్పగించింది.
పసుపు పంటకు మన దేశంలోనే గుంటూరు జిల్లా పెట్టింది పేరు. పవిత్రమైన కృష్ణవేణి తీరాన ఇప్పుడు అమరావతి పేరుతో పవిత్ర రాజధానిని నిర్మిస్తున్న ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉన్న గుండిమెడ గ్రామంలో ఆదర్శ రైతు శాస్త్రవేత్తగా పేరుపొందిన పిడికిటి చంద్రశేఖర్ ఆజాద్‌కు ఈ నూతన పసుపు రకం ప్రవర్ధనం బాధ్యతలను ఐఐయస్‌ఆర్ సంస్థ అప్పగించింది. గత రెండు దశాబ్దాలుగా మేలు రకమైన పసుపు రకాల ప్రవర్ధనంలో విశేష ప్రతిభ కనబరచి తెలుగు రైతు తేజాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చంద్రశేఖర్ ఆజాద్ పేరు చెబితే అందరూ ప్రతిభా ఆజాద్‌గానే ఆయనను గుర్తుపడతారు. పసుపు సాగులో తెలుగు రైతులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మార్గదర్శిగా నిలిచిన ఆజాద్ విత్తన సాధికారతలో ప్రపంచంలోని ఏ రైతుకూ తీసిపోని విధంగా సేవలందించారు. ఆయన అంకిత భావానికి, రైతాంగం పట్ల ప్రదర్శించే నిబద్ధతకు మెచ్చి దేశంలోని ఐసిఎఆర్‌తో సహా అనేక సంస్థలు ఆయనను అవార్డులతో సత్కరించాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, పేద ప్రజల పెన్నిదైన పిడికిటి నారాయణ మూర్తి కుమారుడైన ఆజాద్ చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ ఉన్నత చదువులకు వెళ్ళకుండా వ్యవసాయంతోనే తన జీవితాన్ని మమేకం చేసుకొని, పసుపు పంటపై ఉన్న ఆసక్తితో ఆ రంగంలో విశేష కృషి జరుపుతూ, విత్తన రైతుగా మరికొంత మందిని తనతో కలుపుకొని ప్రతిభా రకానికి ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధమైన పసుపు రకాన్ని విడుదల చేసేందుకు శాస్త్రవేత్తలకు సహకరించి ముందుకు వెళుతున్నారు.
ఈ నేపథó్యంలోనే ఇటీవల కేరళకు చెందిన ఐఐయస్‌ఆర్ శాస్త్రజ్ఞులు మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఆదర్శరైతు రాంప్రసాద్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి పసుపు పంట నూతన రకం ప్రగతిని అంచనా వేశారు. ఎసిసి-48, ఎసిసి-79 రకాలను సాగు చేస్తున్న వరంగల్‌కు చెందిన రైతు రఘోత్తమ రెడ్డి, కృష్ణా జిల్లా, కాసరనేనివారిపాలెం గ్రామానికి చెందిన కాసరనేని ప్రభు, గుంటూరు జిల్లా, వడ్డేశ్వరం గ్రామానికి చెందిన సుధాకర్, గుండిమెడకు చెందిన భీమిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ పొలాల్లో పండిన పంట, సస్య స్థితిగతులను అక్కడే పరిశీలించారు. ప్రభు వ్యవసాయ క్షేత్రం నుండి తీసుకువచ్చిన నమూనాలను ఉత్తమమైనవాటిగా భావించి సంతృప్తి పొందారు.
పంట స్థితిగతులను అంచనా వేసుకొని, దిగుబడులను బేరీజువేసుకొని, కుర్కుమిన్ శాతాన్ని పరిగణించి ఈ కింది లక్షణాలను నూతన రకంలో గమనించారు. అవి..
1. గతంలోని రకాలకంటే నూతనంగా సేకరించి ప్రవర్ధనం చేస్తున్న పసుపు రకంలో కుర్కుమిన్ శాతం అధికంగా ఉండడం
2. పంట గుబురుగా మారి, శాఖీయ ఎదుగుదలతో పాటు కింద వేళ్ల వద్ద పుట్టలు, పుట్టలుగా దుంపలు పెరగడాన్ని గమనించారు
3. స్వాభావిక రకమైనందున రసాయన రహిత, సేంద్రియ పశుపు ఉత్పత్తికి అవకాశాలు, తద్వారా ఎగుమతి అవకాశాలున్నట్లు అభిప్రాయం వ్యక్తమైంది
4. వివిధ ప్రాంతాల్లో, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయడం ద్వారా ఫలితాలను విశ్లేషించుకొని, నీటి సదుపాయం గల భూముల్లో విస్తారంగానూ, వర్షాధార భూముల్లో ఒక మోస్తరుగాను దిగుబడులను పొంది, రైతుకు మేలు చేసే అవకాశమున్నట్లు అభిప్రాయం ఏర్పడిరది.
5. సాధారణంగా 275 రోజులు పంట కాలం కాగా, 220 రోజులకు నీటి సదుపాయం గల భూముల్లోనూ, 190 రోజులకు వ్యవసాయాధార భూముల్లోనూ పంట కోతకు వచ్చే అవకాశముందని నిర్థారణకు వచ్చారు.
పసుపు వాణిజ్యంలో కీలకపాత్ర వహించే కుర్కుమిన్, ఓలేరిజిన్ పదార్థాల శాతం మిగిలిన రకాలకంటే అధికంగా ఉండడంతో ఈ నూతనంగా సేకరించిన పసుపు వంగడం తెలుగు రైతుల జీవితంలో కొత్త వెలుగులు నింపనున్నదని భావించవచ్చు. 2012లో 14 కిలోల చొప్పున ఎసిసి-48, ఎసిసి-79 రకాలను నాటిన ఆజాద్ తన తోటి రైతులతో కలసి ప్రస్తుతం 175 టన్నుల పసుపు దుంపలను వచ్చే సీజన్‌కు సరఫరా చేయనున్నామని, ఇది కనీసం 200 ఎకరాలకు సరిపడా ఉత్పత్తి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
భారతదేశంలో తొలిసారిగా దేశ వ్యవసాయ విప్లవానికి నాయకత్వం వహిస్తున్న ఐసిఎఆర్ సంస్థ తొలిసారిగా ఒక రైతు సానుకూల విధానాన్ని అనుసరించడం వల్ల తమకు నూతన రకాన్ని అభివృద్ధి చేసే అవకాశం లభించిందని అజాద్ అగ్రిక్లినిక్ ప్రతినిధితో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ విత్తనం కొరకు, విత్తన సాధికారత కొరకు పోరాటం చేస్తున్న కోట్లాది మంది రైతుల ఆకాంక్షలను మన్నించి తొలిసారిగా విత్తన ప్రవర్ధనంలో తెలుగు రైతులకు భాగస్వామ్యం కల్పించడం, ఈ కృషిలో తమ జట్టు సఫలీకృతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పసుపు పంటను సంక్షోభం నుండి రక్షించడానికి, గిట్టుబాటు ధర లభింపచేయడానికి కృషిచేయవలసిన అవసరం ఉందని, ఒంగోలులో ఉన్న కుర్కుమిన్ సేకరణ కంపెనీ తరహాలో మరిన్ని పసుపు ఆధారిత పరిశ్రమలు రావలసిఉందని ఆజాద్ ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరులోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోను పసుపు వాణిజ్య మండళ్ళను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
కేరళలోని టెక్కాడి, అలెప్పీ, ఇతర అడవుల్లో విస్తారంగా ఉన్న సుగంధ ద్రవ్యాల రకాల నుండి ఇప్పటి వరకూ పసుపు సాగు కొరకు 1200 రకాలపై పరిశోధన జరిగిందని, ఈశాన్య భారతంలోని మేఘాలయ, షిల్లాంగ్ అడవుల్లో సేకరించిన మరో 200 రకాలపై పరిశోధనలు జరిగాయని ఈ పరిశోధనల నుండి చివరివరకు నిలచిన 8 రకాలపై 2010 నుండి ఇప్పటివరకు వచ్చిన పరిశోధనా నివేదికలను ఐఐయస్‌ఆర్ పొందుపరచింది. ఆ నివేదికల సారాన్ని పట్టికల రూపంలో ఇక్కడ పొందుపరుస్తున్నాం.
వ్యవసాయం చేపట్టి పసుపు, మినుము, అరటి పంటలను తన 8 ఎకరాల భూమిలో సాగు చేస్తున్నారు. 2007 -2008 లో ఉద్యానశాఖ నిజామాబాద్ జిల్లా వారికి 12 టన్నులు, 2008-2009లో ఆదిలాబాద్ జిల్లా వారికి 30 టన్నులు, రంగారెడ్డి జిల్లా వారికి 12 టన్నులు, గుంటూరు జిల్లాలో అనేక మంది రైతులకు ప్రతిభ విత్తన దుంపలను సరఫరా చేశారు.
2010-11లో ఈ రకాన్ని 2.75 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో అతి తక్కువ రసాయనాలను ఉపయోగించి సాగు చేశారు. సరైన సమయంలో పంట యాజమాన్య పద్ధతులను ఆచరించడమే తన విజయరహస్యమంటున్నారు ఆజాద్. ప్రతిభా రకం ఆవిర్భవించి సుదీర్ఘకాలం గడచినందున, సహజంగా హైబ్రీడ్ రకాలు క్రమేణ తమ స్వాభావికతను కోల్పోయే అవకాశమున్నందున, అడవుల్లో సేకరించిన స్వాభావిక, దేశీయ పసుపు రకాన్ని అభివృద్ధి చేయడానికి ఐసిఎఆర్ మద్దతుతో రైతులు ప్రత్యామ్నాయంగా ఎసిసి-48, ఎసిసి-79 రకాల కొరకు ఎదురు చూస్తున్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ 2013 -14లో ప్రతిభతో పాటు ఎసిసి-48, ఎసిసి-79, ఎసిసి-849 అనే అధిక దిగుబడి రకాలను అనేక ప్రాంతాల్లో ప్రయోగాలు (మల్టి లొకేషనల్ టెస్టింగ్) జరిపారు. 1. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఆజాద్ స్వగ్రామం గుండిమెడ. 2. కేరళలోని పెరువన్నముజి. 3. కర్ణాటకలోని అప్పంగల. 4. తమిళనాడులోని ఈరోడ్ వారి సమక్షంలో 14 కిలోల నూతన రకాన్ని, 2.8 సెంట్లలో జూన్ 12, 2013న నాటారు. వీటిలో ఎసిసి 849 దీర్ఘకాలిక (270 రోజులు) అధిక దిగుబడినిచ్చే రకం. కాని ఇది ఎగుమతికి పనికిరాదు. ఎసిసి-48, ఎసిసి-79 అధిక దిగుబడినిచ్చే మధ్యకాలిక (220 రోజులు) రకాలు. ఇవి ఎగుమతికి అనుకూలమైన రకాలు.
నివేదికలను బట్టి ఎసిసి-48, ఎసిసి-79 గత ఆరు సంవత్సరాలుగా సాధించిన మెరుగైన దిగుబడుల ఫలితాలను ఈ పట్టికల ద్వారా పాఠకులముందుంచుతున్నాం.
పంట పరిశోధనా రంగంలో తమ వంతు పాత్రను నిర్వహిస్తూ, పసుపు పంటలో స్వజాతి, స్వాభావిక రకానికి పురుడుపోస్తున్న రైతు శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న పిడికిటి చంద్రశేఖర్ ఆజాద్ అగ్రిక్లినిక్‌తో మాట్లాడుతూ జనవరిలో పంట కోత సందర్భంగా ఈ నూతన రకానికి ఐఎయస్‌ఆర్ ఆధ్వర్యంలో నామకరణం జరపనున్నట్లు తెలిపారు. తన పర్యవేక్షణలో అనేక వందల ఎకరాల్లో ఈ నూతన పసుపు రకం తెలుగు రైతులకు వెలుగు నివ్వనున్నదని వివరించారు.
ఉత్తమ వాణిజ్య విలువ, బెట్టను, తెగుళ్ళను తట్టుకొనే సహజ పసుపు రకాలకు గుర్తింపుతెస్తున్న రైతు శాస్త్రవేత్తలు
Leave Your Comments