ప్రస్తుతం ఉన్న పంట దిగుబడిలో ఎక్కువ లాభాలను తెచ్చి పెడుతోంది వక్క తోట. ఐదేళ్ల పాటు జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు.. ఆ తర్వాత సిరుల పంటను కురిపిస్తుంది. ఏటా దీని దిగుపడి పెరగడమే తప్ప తగ్గదు. వీటిికి అవసరమైన నీరు, ఎరువు, సారవంతమైన మట్టిని అందిస్తే చాలు.. పెద్దగా ఖర్చులేని మంచి వ్యవసాయ వ్యాపారం వక్క తోట. ఒక్కసారి సాగు చేస్తే చాలు.. వంద సంవత్సరాల పాటు దిగుబడులు వస్తూనే ఉంటాయి.
అనంతపురంలో ఎక్కువగా వేరుశనగ వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, అక్కడి అతివృష్టి, అనావృష్టి కారణంగా వేసిన పంట చేతికందుతుందనే గ్యారెంటీ ఎవ్వరికీ లేదు. ఈక్రమంలోనే బోరు బావులున్న రైతులు వక్క తోటలపై ఇటీవల కాలంలో మొగ్గు చూపుతున్నారు. జిల్లాల్లోని రొళ్ల, అగళ, మడశిర తదితర మండలాల్లో ఈ తోట సాగు మెండిగా సాగుతోంది. ఒక్క మడశిర నియోజకవర్గంలోనే 5వేలకుపైగా వక్క సాగు వేశారు.
అసలు ఈపంటను ఎలా వేయాలి. వాటిని ఎలా సాగుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట ఎండి ఒలిచిన వక్కను తీసుకొచ్చి నారు పోస్తారు. పాలిథిన్ కవర్లో విత్తనం వేసి నీరు పోస్తారు. పది రోజుల తర్వాత వక్క విత్తనం నుంచి మొక్క మొలుస్తుంది. అలా రెండేళ్ల పాటు జాగ్రత్తగా ఆ మొక్కను తోటలో పెంచుతారు. రెండేళ్లు దాటగానే పొలాల్లో 5 అడుగుల పొడవు, వెడల్పుతో నాటుతారు. అలా ఎకరాకు 400 మొక్కలు నాటొచ్చు. ఇలా సాగు చేసిన ఐదేళ్లకు పంట చేతికందడం మొదలవుతుంది. అలా ఎకరాకు ఆరు క్వింటాళ్ల వరకు వక్కలు వచ్చే అవకాశం ఉంది.
మార్కెట్లోనూ వీటి ధర ఎప్పటికీ నిలకడానే ఉంటోంది. ప్రస్తుతం క్విటా ధర రూ.48వేల నుంచి 52 వేల వరకు పలుకుతుండగా.. కిలో రూ.500 వరకు ఉంటోంది. దీన్ని బట్టి చూస్తే.. ఎకరాకు ఆరు క్వింటాల దిగుబడి వస్తే కనీసం 3 లక్షలకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రైతులకు నమ్మకం కలిగి ఈ పంటవైపే మొగ్గు చూపుతున్నారు.
ఈ పంట కోతను జూలై నెలలో ప్రారంభించి.. డిసెంబరు ఆఖరు వరకు కొనసాగిస్తారు. నెలకు ఒకసారి మాత్రమే ఈ పంట కోత ఉంటుంది. అయతే, ఇందులో ఓ సమస్య కూడా ఉంది. వేసవి కాలంతో బోరు బావుల్లో నీటి మట్టం పడిపోవడంతో వక్క సాగు వేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లక్షలు ఖర్చు చేసి మరీ మరో బోరు వేయించినా.. నీరు పడతాయో లేదో తెలేదు. అయితే, జాగ్రత్తగా చూసుకుంటే.. ఈ పంటలో వచ్చే ఆదాయం మరే పంటలోనూ దొరకదని రైతులు అంటున్నారు. ఈ పంట వేస్తే ఉద్యోగం ఉన్నట్లు అని అంటున్నారు.