పశుపోషణపాలవెల్లువవ్యవసాయ పంటలు

నవంబర్ లో పాడి పశువుల, జీవాల స౦రక్షణ ఇలా ?

0
1. నవంబర్ మాసంలో చలికాలం కారణంగా ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతల నుంచి పశువులను రాత్రివేళల్లోపైకప్పు కలిగిన పాకల్లో లేదా కొట్టాల్లో ఉంచాలి.
2. పశువుల పాకల్లో అడుగున వేసిన ఎండుగడ్డి (బెడ్డింగ్) ని తడిగా లేకుండా పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి. అవసరమైతే ప్రతిరోజు మార్చుకోవాలి.
3. పశువులకు, జీవాలకు ఇప్పటివరకు గాలికు౦టు వ్యాధి, హెమరేజిక్ సెప్టిసీమియా, నల్ల జాడ్య౦, ఎంటిరోటాక్సీమియా వంటి రోగాలకు టీకాలు వేయకుంటే ఈ నెలలో తప్పక వేయించాలి.
4. పశువుల్లో పొదుగు వ్యాధి రాకుండా జాగ్రత్తలు వహించాలి. పాల మొదటి ధారలలో సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి కనుక వాటిని బయటకు పిండివేయాలి. మొదటి ధార పాలను స్ట్రిప్ కప్ లోకి పిండి పరీక్షించడం వల్ల పొదుగువాపు వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించవచ్చు. పాలు పిండిన తర్వాత చన్నులను అయోడిన్ ద్రావణంలో ముంచాలి. ఇలా చేయడం వల్ల చనురంధ్రాలు వెంటనే మూసుకుపోతాయి. బయటనుంచి సూక్ష్మక్రిములు లోపలికి చేరకుండా ఉంటాయి. తద్వారా పొదుగువాపు వ్యాధిని నివారించవచ్చు.
5. పరాన్నజీవుల నిర్మూలనకు వాడే మందుల వల్ల పశువులను, జీవాలను రోగాలనుంచి కాపాడటమే గాక అవి పశువుకు అందించే ఆహార వినియోగ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. దానితో వాటి ఉత్పాదకత శక్తి కూడా పెరుగుతుంది..
6.ప్రతి పశువుకు రోజుకు 80 గ్రాములు ఆవశ్యక లవణాలు లేదా స్థానిక నిర్ధిష్ట మినరల్ పొడిని అందివ్వాలి.
7. వేసవి కాలంలో పచ్చిగడ్డి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఇప్పుడు పచ్చిగడ్డిని ‘సైలేజ్’ లేదా ‘హే’ రూపంలో తయారుచేసుకొని నిల్వ ఉంచుకోవాలి. పశుగ్రాస కొరత వేసవిలో దీనిని వాడుకోవచ్చు.
8. బహు వార్షిక గడ్డి రకాలను ఈ నెలలో కోసుకోవాలి. చలికాలంలో ఇవి సుప్తావస్తలోకి వెళ్ళి మళ్లీ ఫిబ్రవరి – ఏప్రిల్ మాసాల్లో మాత్రమే కోతకు వస్తాయి.
9. నవంబర్ నెల మొదటి పక్షంలోగా బర్సీము, ఆల్ఫా ఆల్ఫా వంటి గడ్డి రకాలకు విత్తుకోవాలి.
10. గొర్రెలలో ప్లేగు, మేకలలో పొదుగు వ్యాధి నివారణకు మూడు సంవత్సరాలకు ఒకసారి వేసే టీకాలు వేయించాలి.
11. గొర్రెలలో ఉన్ని కత్తిరించిన 21 రోజుల తర్వాత వాటి శరీరాలను బాహ్య పరాన్న జీవులనుంచి కాపాడడానికి క్రిమిసంహారక మందులతో తడపాలి.
12. ఓట్ పంటను పండించే వారు అధిక లాభం పొందడానికి అభివృద్ధి పరచిన (సిర్సా ఓట్- 6, సిర్సా ఓట్- 9, జె హెచ్ ఓ- 822, జె హెచ్ ఓ- 851) రకాలను అక్టోబరు రెండవ పక్షం నుంచి విత్తుకోవాలి.

డా. ఎం. హరణి, డా. వి. యుగంధర్,
డా. ఎం. మల్లికార్జున్, డా. ఈ . శిరీష,
కె. బాలాజీ నాయక్, డా. ఈ. చెండ్రాయుడు,  
శ్రీ శ్రీమతి లక్ష్మీ దేవి కృషి విజ్ఞాన కేంద్రం, కళ్యాణదుర్గం.
ఫోన్: 9492514516

Leave Your Comments

సోయాబీన్ మార్కెటింగ్ లో విలువ జోడింపు కీలకం !

Previous article

కొబ్బరి చిప్స్ తయారీ చిన్నతరహా పరిశ్రమలకు అత్యంత అనుకూలం

Next article

You may also like