Dairy Cattle Vaccination: వర్షాకాలం అంటే వ్యాధుల కాలం. ఇప్పటిదాకా సెగలు పుట్టించిన ఎండలతో మూగ జీవాలు అల్లాడిపోయి ఉంటాయి. ఎండలు తర్వాత పడే తొలకరి జల్లులు, ఏర్పడే వాతావరణ వ్యత్యాసాల వలన పశువులలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. అంతే కాక క్రొత్త నీరు, క్రొత్త పచ్చిక రోగాలకు కారణం అవుతాయి. ఈగలు, దోమలు, కొట్టాలలో ఆరని తేమ వంటివి వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతున్నాయి. వర్షాకాలంలో పశువులలో గొంతు వాపు, జబ్బ వాపు, పొదుగు వాపు, గురక రోగం వంటి వ్యాదులు వచ్చే అవకాశం కలదు.
చికిత్స కన్నా నివారణ మేలు, ఇది అందరికీ తెలిసిన విషయమే. వ్యాధి సోకాక వేలు ధారపోసి వైద్యం చేయించే కన్నా రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు వేయించడం మంచిది.నివారణ కన్నా నిరోధం ముఖ్యం కాబట్టి పశు శాలలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు , ముందు జాగ్రత్తగా టీకాలు వేయించడం కూడా చాలా ముఖ్యం.
ఈ తొలకరిలో ముఖ్యమైన సమస్య ఏమిటి అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అలాగే ఉష్ణోగ్రత తో పాటు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉష్ణోగ్రత ఎక్కువగా వుండి అలాగే ఉష్ణోగ్రత తో పాటు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పశువులు ఒత్తిడికి గురై కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు పడగానే సాధారణంగా క్రొత్త గడ్డి వస్తది ఈ గడ్డి పెరగటంతో పాటు దోమలు, జోర్రు ఈగలు సంతతి కూడా పెరుగుతుంది. ఈ దోమలు, జోర్రు ఈగలు ద్వారా కొన్ని రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఈ సమయంలో పాడి రైతులు బ్యూటాక్స్ లాంటివి పశువుల షెడ్ లో పిచికారి చేయాలి, అలాగే హైటెక్ లాంటి ఇంజెక్షన్ ఇప్పించడం ద్వారా
వీటిని నివారించవచ్చు.
Also Read: Okra Ladies Finger Farming: వర్షాకాలం బెండ సాగులో మెళకువలు.!
తొలకరి వర్షాలు పడినప్పుడు పశువుల కోట్టాలలో నీరు నిల్వ ఉండటం వలన ఆ నీళ్ళల్లో నట్టలు గ్రుడ్లు ఉండే అవకాశం ఉంటది. తొలకరిలో నెమటోడ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటది కాబట్టి వీటి వలన పశువులలో రక్తహీనత, అలాగే పారుకోవటం వంటివి ఉంటాయి కాబట్టి పశువులకు ఈ నట్టల నివారణ మందును కూడా తాగించాలి. తరువాత ఈ తొలకరి వర్షాలలో హీట్ స్ట్రెస్ , హ్యుమిడిటి స్ట్రెస్ కారణంగా కొన్ని బాక్టీరియా రోగాలు కూడా వచ్చే అవకాశం కలదు. వీటిలో ముఖ్యమైనవి గొంతు వాపు, జబ్బ వాపు, గురక రోగం వచ్చే అవకాశం కలదు, ఎక్కువగా పెద్ద పశువులలో నల్ల పశువులకు వచ్చే అవకాశం కలదు కాబట్టి తొలకరికి ముందే HS టీకాలు, BQ టీకాలు వేయించాలి.
తొలకరికి ముందే రైతులు షెడ్స్ కురవకుండ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మురుగు నీరు నిల్వ వుండే గుంటలు ఉంటే వాటిని మట్టితో కప్పాలి.షేడ్ హై లెవెల్ నుండి లొ లెవెల్ ఉండేలా చూసుకుంటే ఒకవేళ వర్షం నీరు పడిన నిల్వ వుండకుండా క్రిందికి పోతాయి మరియు క్రిందికి పోయేలా మురుగు కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ద్వారా రోగాలు రాకుండా చూసుకోవచ్చు. హీట్ స్ట్రెస్,హ్యుమిడిటి స్ట్రెస్ ఉంటది కాబట్టి సమతుల్య ఆహారం అంటే పచ్చి మేత, ఎండు గడ్డి, దాణా, ఖనిజ లవణాలు ఇవ్వడం ద్వారా తొలకరిలో వచ్చే స్ట్రెస్ ని అధిగమించవచ్చు.పశువుల కొట్టాలోలో ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రదేశం లో పొడి సున్నం చల్లుకోవాలి.
టీకాలు వేయించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
• టీకాలు వాతావరణం చల్లగా ఉన్నపపుడు అనగా ఉదయం గాని, సాయంత్రం గాని వేయించాలి.
• వ్యాధిగ్రస్తమైన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు, కేవలం ఆరోగ్యవంతమైన పశువులకు మాత్రమే వేయించాలి.
• ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.