Sweet Potato Vines as Fodder: మన దేశంలో పశుగ్రాసం మరియు దాణా యొక్క లభ్యత ఆందోళన కల్గించే ప్రధాన ఆంశంగా మిగిలిపోయింది. భారతదేశంలో దాని యొక్క డిమాండ్. సరఫరా మధ్య చాల అంతరం ఉంది. నివేదికల ప్రకారం 23.4 శాతం ఎండుమేత, 32 శాతం పచ్చిమేత మరియు 36 శాతం దాణా కొరత ఉంది. పెరుగుతున్న జనాభా, పారిశ్రామీకరణ, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల రానున్న కాలంలో ఈ మేత కొరత ఇంకా పెరిగే అవకాశం ఉంది.
దీని వలన పశువులకు సరైన పోషణ లభించక వాటి యొక్క ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. కావున రైతులు ఈ పశుగ్రాస కొరతను అధిగమించాడనికి ప్రత్యామ్నాయ పంటలపై ఆధారపడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చిలగడ దుంప తీగలని ఒక ప్రత్యామ్నాయ పశుగ్రాసంగా పరిగణించవచ్చు.
చిలగడ దుంప అనేది వార్షిక పంట దీని తీగలని అద్భుతంగా పాడి పశువులకు, గొర్రెలకు, మేకలకు, పందులకు మరియు కుందేళ్ళకు మేతగా వినియోగించవచ్చు. చిలగడ దుంప పశుగ్రాసం వినియోగం వల్ల పశువుల యొక్క పెరుగుదల, పాల ఉత్పత్తి మరియు మాంస ఉత్పత్తి పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు.
Also Read: storing potatoes: ఇకనుంచి బంగాళాదుంపలను ఎనిమిది నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు.!
ఈ చిలగడ దుంప పశుగ్రాసంలో మిగతా పశుగ్రాసాలతో పోలిస్తే అధిక మాంసకృత్తులు కల్గి ఉండి వాటి అరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.అంతే కాకుండా దీనిలో ఎలాంటి హానికారక పదార్ధాలు ఉండవు. ఈ చిలగడ దుంప పశుగ్రాసాన్ని తక్కువ పాల దిగుబడినిచ్చే పాడిపశువులకు దాణాకి బదులుగా అందించవచ్చు. ఇది చిన్నకారు రైతులకి ఉత్పత్తి ఖర్చును ఆదా చేయడంలో సహాయపడుతుంది. చిలగడ దుంప తీగల యొక్క పోషక విలువలు .
చిలగడ దుంప తీగలను మాంసకృత్తులను ఇచ్చే వనరులుగా చెప్పుకోవచ్చు. వీటిలో 15 నుండి 30 శాతం ఘన పదార్థం ఉంటుంది. ప్రోటీన్ శాతము 3.02 నుండి 7.38 వరకు ఉంటుంది మరియు వీటి యొక్క అరుగుదల 65 శాతం వరకు ఉంటుంది. ప్రోటీన్ శాతం ఆకులతో పోలిస్తే కాండంలో తక్కువగా ఉంటుంది.ఈ తీగలలో ఇతర పప్పుజాతి పశుగ్రాసాలలో ఉండే హానికారక పదార్ధాలు ఉండవు.ఈ చిలగడ దుంప తీగలను తక్కువ పోషక విలువలు కల్గిన పశుగ్రాసంపై పెంచే పశువులకు ప్రొటీన్ సప్లిమెంట్‌గా అందించవచ్చు. దీనిని ఒక పశువుకు ఒక రోజుకు 30 నుండి 50 కిలోల వరకు ఇవ్వవచ్చును.అంతేకాకుండా ఈ పశుగ్రాసాన్ని గొర్రెలకు మేతగా అందిచ్చినట్లయితే ఒక కిలో మాంసం ఉత్పత్తికి అయ్యే ఖర్చు తగ్గడమే కాకుండా అవి త్వరితగతిన బరువు పెరుగుతాయి.
చిలగడ దుంప రకాలు, సాగు చేయు విధానం : చిలగడ దుంప ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా తట్టుకొని జీవిస్తుంది. వేరే పశుగ్రాసాలతో పోలిస్తే ఒక యూనిట్ ప్రాంతానికి అధిక దిగుబడిని ఇస్తుంది. ఒక హెక్టార్‌కి 30 నుండి 35 టన్నుల దిగుబడి వస్తుంది. వీటిలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో సిఒ-3, సిఒసిఐపి -1, శ్రీ నందిని, శ్రీవర్ధిని, శ్రీ భద్ర, గౌరీ మరియు శంకర్ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. చిలగడ దుంప సాగుకు జూన్-జులై మరియు సెప్టెంబర్ అనువైన కాలం. చిలగడ దుంప పంట తీగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒక మోస్తరు లేతగా ఉన్న తీగలను నాటడానికి ఉపయోగించాలి.
సుమారు 30 సెం.మీ. పొడవు, 3 నుండి 4 కణుపులు, మరియు 5-6 ఆకులు ఉన్న తీగలను నాటడానికి ఎంచుకోవాలి. ప్రతి ఎకరం భూమికి 25,000 నుండి 30,000 తీగలు అవసరం అవుతాయి. పొలంలో 60 సెం. మీటర్ల దూరంలో బోదెలు చేసుకోవాలి. ఒక తీగకు ఇంకో తీగకు మధ్య దూరం 20 సెం.మీ.ఉండాలి. ఈ విధంగా నాటిన తీగలు 30-45 రోజుల్లో వ్యాప్తి చెందుతాయి. ఈ విధంగా తయారైన తీగలను పశుగ్రాసంగా వాడుకోవచ్చు.
సరైన ఆకు మరియు కాండం ఉత్పత్తి కోసం, 20 రోజుల వ్యవధిలో తీగలను కత్తిరించుకోవాలి. ఒక సీజన్లో, తీగలు మరియు ఆకులను మూడు లేదా నాలుగు సార్లు కోయవచ్చు ఈ తీగలను అదే విధంగా కానీ లేదా ఎండబెట్టి కానీ లేదా సైలేజ్‌గా కానీ తయారీ చేసుకొని ఇవ్వవచ్చు.
సైలేజ్ తయారీ విధానం : కోత తర్వాత తీగలను 0.2-0.5 సెం.మీ పొడవుకు కత్తిరించి, ఎండలో 1-4 గం. వరకు ఉంచాలి, తద్వారా తేమ 40-45 శాతం తగ్గుతుంది. ఈ విధంగా ఎండబెట్టిన వాటిని 10 శాతం తవుడు మరియు 0.5 శాతం ఉప్పు కల్పి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ప్లాస్టిక్ సంచులలో ఏ మాత్రం గాలి లేకుండా వొత్తి పట్టి నింపాలి మరియు ఎలాంటి గాలి చొరబడకుండా సంచులను గట్టిగ కట్టాలి. ఇది ఒక నెలలో సైలేజ్ తయారవుతుంది. తరువాత దీనిని పశువులకు మేతగా వాడుకోవచ్చు.
పైన చెప్పిన విధంగా రైతులు చిలగడ దుంప తీగలను పశుగ్రాసంగా వినియోగించినట్లయితే దాణా ఖర్చు తగ్గిచ్చుకొని తద్వారా ఆశించదగ్గ రాబడి పొందవచ్చు.
Also Read: Diseases of potato: బంగాళదుంప పంటలో తెగుళ్లు మరియు వాటి నివారణ చర్యలు.!