Foot Rot Disease in Cattle: పశువులు, గొర్రెలు, మేకలు మరియు పందులలో స్పీరోఫారస్ నెక్రోఫారస్ అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వలన కలుగు ఒక వ్యాధి. ఈ వ్యాధిలో ప్రధానంగా గిట్టలు వాచి పశువులు నడవ లేకుండా ఉంటాయి.
వ్యాధి కారకం:-
(1) ఇది స్పీర్ఫోరస్ నెక్రోఫారస్ అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వలన కలుగుతుంది.
(2) ఇవి కర్ర ఆకారంలో ఉండి, గాలి రహిత స్థితిలోను పెరిగే గుణం కలిగి యుంటాయి.
(3) ఈ బ్యాక్టీరియాలు 3 రకాల విషపదార్థాలను విడుదల చేస్తాయి.
అవి: (1) EndoToxin (2) ExoToxin (3) Haemolysin
Also Read: Coconut Planting: కొబ్బరిలో నారు పెంచుట మరియు మొక్కలు నాటుటలో మెళుకువలు.!
వ్యాధి బారిన పడు పశువులు:- అన్ని వయస్సు గల ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటాయి. కాని గొర్రెలలో ఈ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువ. సహజంగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా కలుగుతుంటుంది.
వ్యాధి వచ్చు మార్గం:- పగుళ్ళు, గాయాలు వున్న గిట్టలతో పశువులు బురదలో తిరుగుతున్నప్పుడు లేదా. పనిచేయునపుడు లేదా బురద, పేడ, మూత్రముతో కలుషితమైన నీటిలో తిరిగినప్పుడు ఈ బ్యాక్టీరియా గిట్టలలో చేరి వ్యాధి కలిగిస్తుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- పగుళ్ళు గాయాలు వున్న గిట్టలతో బురదలో తిరుగుట వలన బ్యాక్టీరియాలు గిట్టలలోకి చేరి, అక్కడ గాలి రహిత స్థితి ఏర్పడినపుడు పెరిగి, వివిధరకాల విషపదార్థాలను విడుదల చేయుట వలన అక్కడి కణజాలం విచ్చిన్నం అయి రక్తము మరియు చీముతో కూడిన ద్రవాలను వెలువరిస్తుంటుంది. ఫలితంగా పశువులు నడవలేక ఇబ్బంది పడుతుంటాయి.
Also Read: Ongole Cattle: పాడికి మరియు పనికి ఉపయోగపడు దేశవాళీ ఆవులు.!
లక్షణాలు:-
(1) గిట్టలు మెత్తబడి పుండ్లు ఏర్పడి, గిట్టల మధ్య రక్తము, చీము కారుతూ, భరించలేని నొప్పి వుంటుంది.
(2) గిట్టల నుండి దుర్వాసన వస్తూ వుంటుంది.
(3) జబ్బు వున్న కాలుపైన బరువు మోపలేక పశువులు వంకరగా నిలబడి వుంటాయి లేదా క్రింద పడిపోయి వుంటుంది.
4) పై పరిస్థితుల వలన అధికంగా జ్వరం వుండి, కదలలేక పోవటం వలన మేత, నీరు సరిగ్గా తీసుకోలేక పావుట వలన పశువులు నీరసించి, కొన్ని సందర్భాలలో చనిపోవుట జరుగుతుంటుంది.
చికిత్స :-
వ్యాధి కారకాన్ని నిర్మూలించుటకు చేయు చికిత్స:- సోడియం సల్ఫాడిమిడిన్ కి. లో శరీర బరువుకు 100-200 మి.గ్రా లేదా అంపీసిలిన్ కి. లో శరీర బరువుకు 5-10 మి.గ్రా లేదా పెన్సిలిన్స్ కి. లో శరీర బరువుకు 10,000-20,000 యునిట్లు లేదా టెట్రాసైక్లిన్ కి. లో శరీర బరువుకు 5-10 మి.గ్రా. చొప్పున ఏదేని ఒక ఆంటిబయోటిక్ ఔషదములను ఇవ్వవలసి యుంటుంది.
వ్యాధి లక్షణములకు చేయు చికిత్స:- 5% కాపర్ సల్ఫేట్ ద్రావణంలో కాలి గాయాలను బాగా శుభ్ర పరచి, తరువాత లోడాక్సెన్ లేదా విడిన్ అయోడిన్ వంటి ఆయింట్మెంట్లను పూయవలెను. జ్వరంను తగ్గించుటకు అంటటి పైరెటిక్స్, నొప్పిని తగ్గించుటకు అంటే అనాల్జెసిక్ ఔషధములను ఇవ్వవలెను.
ఆధారమును కల్పించు చికిత్స:-
(1) పశువులు భరించలేని కాళ్ళ నొప్పులతో క్రిందపడిపోయి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేని స్థితిలో ఉంటే వాటికి సెలైన్ ద్రావణములను సిరల ద్వారా పెట్టవలెను.
(2) విటమిన్స్, మినరల్స్ కలిగిన ఇంజక్షన్లు వంటివి ఇచ్చినట్లైతే ఫలితం ఉంటుంది.
(3) పశువులకు సులువుగా జీర్ణం అయ్యేటువంటి మంచి పోషక పదార్థాలు కలిగిన గంజి వంటి ఆహారాన్ని ఇవ్వాలి.
నివారణ:–
(1) ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు.
(2) పశువులను బురద, పేడ, మూత్రం నిలువ వున్న ప్రదేశాలలో కట్టి వేయరాదు.
(3) ముఖ్యంగా గిట్టలలో పుండ్లు/గాయాలు వుంటే, వాటిని ఎప్పటి కప్పుడు అంటిసెప్టిక్ ద్రావణంతో శుభ్రం చెయ్యవలెను,
(4) పశువులు క్షేత్రంలో ప్రతి రోజు క్రిమి సంహారక మందులను చల్లి క్షేత్రాన్ని శుభ్రంగా వుంచాలి.
(5) పశువుల యొక్క గిట్టలను నెలకు ఒకసారి ఫార్మాల్టి హైడ్ ద్రావణంలో కొద్దిసేపు వుంచి తీయవలెను.
Also Read: Tomato Diseases: టమాట పంటలో పొగాకు లద్దె, అక్షింతల పురుగుల యాజమాన్యం.!