Transmissible Gastro Enteritis in Pigs: ఈ వ్యాధి కరోనా వైరస్ ద్వారా పందులలో కలుగుతుంటుంది. ఈ వ్యాధిలో ప్రధానంగా వాంతులు, విరోచనాలు, డీహైడ్రేషన్ లక్షణాలు వుండి పంది పిల్లలు అధికంగా మరణిస్తూ ఉంటాయి. వ్యాధి కారకంతో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వలన ఆరోగ్యంగా వున్న పందులకు ఈ వ్యాధి సోకుతుంటుంది. వ్యాధి నుండి కోల్కోన్న పందులు చాలా రోజుల వరకు ఈ వైరస్ను వాటి ముక్కు స్రావాలు, పాలు, పేడ ద్వారా బయటకు విసర్జిస్తూ ఉంటాయి.
వ్యాధి వ్యాప్తి:- పై మార్గాల ద్వారా వ్యాధి కారక వైరస్ పొట్ట ప్రేగులలో చేరి గ్యాస్ట్రో ఎంటిరైటిస్ని కలిగించుట ద్వారా పందులలో వాంతులు, విరోచనాలు కలిగి డీహైడ్రేషన్ లక్షణాలు ఏర్పడుతుంది. ఈ వైరస్ మూలంగా పంది పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఇ-కొలై వంటి ఇన్ఫెక్షన్లు సెకండరీగా కలుగుతుంటుంది. కొన్ని సందర్భాలలో వైరస్ ఊపిరితిత్తులలో చేరి న్యూమోనియా లక్షణాలను కలుగజేస్తుంది. పంది పిల్లలలో డీహైడ్రేషన్ మరియు అసిడోసిస్ లక్షణాలు కలుగుట వలన ఎక్కువగా చనిపోతూ ఉంటాయి.
Also Read: Swine Fever in Pigs: పందులలో జ్వరం ఎలా వస్తుంది.!
లక్షణాలు:- పంది పిల్లలలో వాంతులు, అరగని పాలతో కూడిన విరోచనాలు వుండి, దుర్వాసన కలిగి వుంటుంది. పంది పిల్లలు నీరసంగా వుండి, బక్క చిక్కి, చర్మం మరియు వెంట్రుకలు పొడిబారి, అసిడోసిస్ లక్షణాలు కలిగి చనిపోతుంటాయి. జ్వరం సాధారణంగా లేదా కొద్దిగా పెరిగి ఉండవచ్చు. పంది పిల్లలలో వ్యాధి లక్షణాలు బయట పడిన 2 నుండి 5 రోజుల లోపు చనిపోతాయి. పెద్ద పందుల్లో ప్రాణాంతకం కానప్పటికీ విరోచనాలు, వాంతులు ఉండి, డీ హైడ్రేషన్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.జీర్ణాశయంలో అరగని గడ్డ కట్టిన పాలను చూడవచ్చు. పొట్ట ప్రేగుల కణజాలంలో శోధం వుండి చిన్న చిన్న హెమరేజన్ని గుర్తించవచ్చు.
రైతు తెలిపే వ్యాధి చరిత్ర ఆధారంగా, పైన వివరించిన వ్యాధి లక్షణములు మరియు వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఈ వ్యాధిని స్వైన్ ఫీవర్, కోలి బాసిల్లోసిస్, ఎపిడెమిక్ డైయేరియా వైరస్ వంటి వ్యాధులతో సరిపోల్చుకోవలసి ఉంటుంది.
చికిత్స:- ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స లేదు. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా సల్ఫనమైడ్ అంటిబయోటిక్స్ లేదా సిప్రోఫ్లాక్సిన్ అంటీబయోటిక్స్ వంటివి ఇవ్వవచ్చు. హైపో గ్లైసీమియా మరియు డీ హైడ్రేషన్ని సరివేయుటకు అవసరమైన సెలైన్స్ (DNS, Rintose, Ringers lactate) ద్రావణములను ఇవ్వవలసి ఉంటుంది.
నివారణ:- వ్యాధి వచ్చిన పందులను వేరు చేసి వద చేయుట ఉత్తమం. కొత్తగా కొనుగోలు చేసిన పందులను వెంటనే మందలోకి కలపరాదు. మనుషులు, వాహనములు ఇతర పశువుల రాకపోకలను నియంత్రించాలి. బాహ్య పరాన్న జీవులను ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ ఉండాలి. పంది పిల్లలకు పుట్టిన వెంటనే జున్ను పాలు త్రాగించాలి. ఈ వ్యాధికి టీకా కలదు. ఈ టీకాను పందులు ఈనే 2-10 వారాల ముందు ఇచినట్లైతే, ఈ వ్యాధి పంది పిల్లల్లో ప్రమాదం కాకుండా చూడవచ్చు.
Also Read: Japanese Encephalitis in Pigs: పందుల లో జపనీస్-బి ఎన్ సెఫలైటిస్ వ్యాధి ని ఇలా నయం చెయ్యండి.!