పశుపోషణ

పశువులపై సాధారణముగా క్షేత్రస్థాయిలో రైతులు అడుగుతున్న ప్రశ్నలు – జవాబులు

0

1.ఆవులలో (తరుపులలో) యుక్తవయస్సు ఎంతకాలము? 

జవాబు. 12 – 18 నెలలు 

  1. ఎనుములలో (పడ్డలలో) యుక్తవయస్సు ఎంత కాలము? 

జవాబు. 30 – 36 నెలలు 

3.ఆవులలో ఎద ఎన్నిరోజులకు ఒక్కమారు వచ్చును? 

జవాబు. ప్రతి 19 రోజులకు 

4.ఆవులలో చూలుకట్టిన తరువాత ఎంతకాలమునకు ఈనును? 

జవాబు. 9 నెలల 9 రోజులకు 

5.ఎనుములలో ఎద ఎన్ని రోజులకు ఒక్కమారు వచ్చును? 

జవాబు. ప్రతి 21 రోజులకు 

  1. ఎనుములలోచూలు కట్టిన తరువాత ఎంతకాలమునకు ఈనును? 

జవాబు. 10 నెలల 10 రోజులు 

7.పశువు ఈనిన తరువాత ఎంతకాలమునకు ఎదకు వచ్చును? 

జవాబు. 45 రోజులకు 

8.ఆవులలో ఎదకు వచ్చినచో ఎన్నిగంటలు వుండును? 

జవాబు.12 – 36 గంటలు 

9.ఎనుములలో ఎద వచ్చినచో ఎన్ని గంటలు వుండును? 

జవాబు. 24 గంటల నుండి 48 గంటలు  

10.ఎదకు వచ్చిన పశువుకు ఎప్పుడు ఎద సూది వేయించాలి?

జవాబు. ఉదయం ఎదకు వచ్చినట్టైతే సాయంత్రం లేక సాయంత్రం ఎదకు వస్తే మరుసటిరోజు 

 ఉదయం అనగా 12 గంటల నుండి 36 గంటలలో ఎద సూది వేయించవలెను. 

  1. అయ్యా మా పశువుకు5 – 6 మార్లు ఎద సూది వేయించినను చూలు నిలుచుట లేదు కారణము తెలుపుము?  

జవాబు.   

  • సాధారణముగా 100 పశువులకు శాస్త్రీయముగా ఎద సూదులు వేస్తే 25 నుండి 30 పశువులు మాత్రమే ఈనును. 
  • పశువుయొక్క ఆరోగ్యము సక్రమముగా వుండవలెను. 
  • ఎదకు వచ్చిన పశువు ఎద సూది వేసిన వైద్యులు మరియు కృత్తిమ గర్భధారణ పరికరములు పరిశుభ్రముగా వుండవలెను. 
  • పశువులు బెదరక వుండి భీతి లేకుండా శాంతముగా వుండవలెను. 
  • సరియైన ఎద లక్షణములు గుర్తించి మధ్యనుండి చివరి ఎదలో కృత్రిమ గర్భధారణ చేయించవలెను. 
  • ఎదకు వచ్చిన పశువును డాక్టర్ గారు పరీక్షించి సరియైన సమయము సూచించినచో ఆ ప్రకారము ఎద సూది వేయించవలెను. 
  • ఎద సూది వేయు వైద్యులు సరియైన గర్భాశయ ప్రదేశములో ఎద సూది వేయవలెను. 
  • మొదటిసారి మరియు రెండవసారి కృత్రిమ గర్బాధారణ చేయించిననూ చూలు నిలువని యెడల పశువైద్యునిచే గర్భాశయమును పరీక్షింపజేసి తగిన చికిత్స చేయించుకోవలెను. 
  • 12. అయ్యా! మా పశువు5 సం! వయస్సు దాటినది అయినప్పటికి ఇంతవరకు ఎదకు రావడములేదు కారణము తెలుపుము?  

జవాబు.   

  • పశువు యుక్తవయస్సు (కట్టు ప్రాయము) ఆవులలో 12 – 18 నెలలుఎనుములలో 30 – 36 నెలలు శరీర బరువు కనీసము 250 కే.జి.లు వుండవలెను.  
  • తరుపులు లేక పెయ్యలు పుట్టిన 2 1/2 నెలల నుండి దూడల దాణాను తినిపించక లవణ మిశ్రమముతోకూడిన పౌష్టిక ఆహారము యివ్వకపోవుట వలన.  
  • పుట్టిన నెల నుండి కనీసము 6 నెలల వరకు నట్టల నివారణ మందులు త్రాగించక పోవుట వలన 
  • విటమినులుశార్క్ లివర్ ఆయిల్ ఆహారములో లోపించుటవలన. 
  • సైన తెలిపిన విషయములు పాటించక పోవుట వలన గర్భాశయము శరీర బరువుతో పాటు సక్రమముగా అభివృద్ధి జరుగకపోవుట వలన ఎదకు రాదు. 
  • అందుకుగాను వెంటనే పశువైద్యునితో సంప్రదించి గర్భాశయము యొక్క పునరుత్పత్తి పరిస్థితిని పరిశీలించవలెను. ప్రతిదినము 30 గ్రా ఎముకల పొడి, 1/4 కే.జి. ఉలవలుగానిపెసలుగానిశనగలుకాని మొలక కట్టి ఉదయంసాయంత్రం దాణాలో పెట్టవలెను. మిటమిన్లుసూదులు కనీసము 8 దినములు వేయించవలెను. 
  • 13. అయ్యా! మా ఎనుముకు కావలసినంత మేపు, దాణ పెట్టినకూడా 2 1/2 – 3 లీటర్ల పాలు మాత్రమే యిచ్చును, పాలు అభివృద్ధి కావలెనంటే ఏమి చెయ్యాలి? 

జవాబు.   

సాధారణముగా మనజిల్లాలో ఎక్కువ శాతము దేశవాళి పశువులుగలిగియున్నాము. నాటు ఎనుములు 2 – 3 లీ పాలు మాత్రమే యిచ్చును. ఈ దేశవాళి పశువుకు అధిక దిగుబడినిచ్చే పాలసార గలిగిన ఆబోతుయొక్క వీర్యముతో కృత్తిమ గర్భాధారణ చేయించినట్లైతే దానికి పుట్టిన సంకరజాతి పెయ్య 30 – 36 నెలలో అనగా మూడు సంవత్సరములలో ఎదకు వచ్చును. దానికి కృత్రిమ గర్భాధారణ చేయించినట్లైతే 10 నెలలకు ఈనును. దానికి 8 – 10 లీ పాలు దిగుబడి జరుగును. ఈ విధముగా అన్నీ దేశవాలి గేదెలకు ముర్రాజాతి ఆంబోతు వీర్యముతో కృత్రిమ గర్భాధారణ చేయించుకొంటే 4-5 సంవత్సరములలో పాల వెల్లువ జరుగును. 

14. అయ్యా! మా గ్రామము పశువైద్యశాలకు10-15 కి.మీ. దూరములో వున్నది. మా పశువులు ఎదకు వచ్చునవుడు ఆసుపత్రికి తీసుకొచ్చి ఎదసూది వేయించాలన్నా చాలా యిబ్బందికరంగా వున్నది. పశువులకు రోగాలు వచ్చిన యిబ్బందిగా వున్నది. దానికి పరస్కారమార్గము చూపించండి. 

జవాబు.   

ఇందుకొరకై మారుమూల గ్రామములు అనగా పశువైద్యశాలకు 10-15 కి.మీ. దూరములో వున్న గ్రామాలలో వున్న 10వ తరగతి పాసైన నిరుద్యోగ యువకులను సర్పంచి ద్వారా ఎంపికచేసి వారికి నెలలు కృత్రిమ గర్భాధారణలోప్రాధమిక చికిత్సలోనూ విశాఖపట్నంకాకినాడగన్నవరంరెడ్డిపల్లె మొదలగు ప్రాంతీయ శిక్షణాకేంద్రములలో ప్రభుత్వ ఖర్చులతో శిక్షణ యివ్వబడుతుంది. వీరిని “గోపాలమిత్రులు” అందురు. ప్రతి 4, 5 గ్రామలకు ఒక గోపాలమిత్ర పశుగణాభివృద్ధి సంస్థద్వారా నియమించబడును. గోపాలమిత్రులు స్వయం ఉపాధితో పశుసేవ చేసి రైతులనుండి తగు ఆర్థిక సహాయము పొందవలెను. రైతులు కృత్రిమ గర్భాధారణ గోపాలమిత్రునిచే చేయించుకొన్నట్టైతే ప్రతి ఎద సూదికి రూ 40/- చొప్పున రుసుము చెల్లించవలసియుండును. 

15.అయ్యా! ఎద సూదిద్వారా పుట్టిన దూడలు సైజు పెద్దదిగా వుండుట వలన ఈనేటప్పుడు పశువు కష్టపడును. ఓకవేళ దూడలు ఈన్నప్పటికీ దూడలు చనిపోవుచున్నవి. దీనికి పరిష్కారమేమిటి?  

జవాబు.   

ఎదసూది వేసినతర్వాత 3 నెలలకు చూలు పరీక్ష చేయించిచూలు నిర్ధారణ అయినప్పటినుండి ఈనునంతవరకు పశువుకు మామూలు కంటే రెండింతలు పౌష్టికాహారముతో కూడిన దాణా మరియు ఖనిజలవణములుపచ్చిమేత అందించవలెను. అందువలన పశువు ఈను సమయానికి మక్కి ఎముకలు విశాలముగా పెంచి పెద్దదైన దూడ సులభముగా గర్భము నుండి బయటకు వచ్చును. దూడలు పుట్టిన వెంటనే 4-5 రోజుల వరకు జన్ను పాలు త్రాగించవలెను. జన్ను పాలను త్రాగించుట వలన దూడకు భవిష్యత్తులో వ్యాధినిరోధక శక్తి పెరుగును. మరియు మిటమిన్ ‘ పుష్టిగా వుండుట వలన కంటి జబ్బులు రావుదానితోపాటు దూడలకు గర్భాశయ అభివృద్ధి చెందును. దూడ పుట్టిన 10 రోజులకు తప్పనిసరిగా నట్టల నివారణ మందును త్రాగించవలెను. మరల డాక్టరుగారి సలహాను పొంది నట్టల నివారణ మందు షెడ్యూలు ప్రకారం త్రాగించినట్టైతే కడుపులో వున్నటువంటి పురుగులు నశించి దూడ బలముగా ఆరోగ్యముగా వుండి బలముగా పెరుగును. అదియునుకాక దూడ తొందరగా కట్టు ప్రాయానికి వచ్చును. 

16.దూడల పోషణలో జాగ్రత్తలను మాకు వివరించండి?  

జవాబు.   

  • పశువుకు చూలు నిర్ధారణ జరిగినప్పటినుండి అనగా 3వ నెల నుండి పౌష్టిక ఆహారముఖనిజలవణములుపచ్చిమేత క్రమముగా పశువు ఈనునంతవరకు పశువైద్యుని సలహామేరకు షెడ్యూలు ప్రకారం యిచ్చినట్టైతే దూడ ఆరోగ్యముగాబలముగా పెరుగును.  
  • దూడ తల్లి గర్భమునుండి బయటికి వచ్చిన వెంటనేముక్కు ద్వారము కన్నుల పైనున్నటువంటి మావి పొరలను పొడిగుడ్డతో తుడుచుటవలన దూడ గాలి పీల్చుకొని త్వరగా లేచి నిలబడును. అటుపిమ్మట – బొడ్డును సెంటి మీటర్ల దూరములో దారంతో కట్టిన తర్వాత క్రొత్త బ్లేడుతో కట్చేసే వెంటనే టింక్చర్-అయోడిన్ పూయవలెను.  
  • దాని తర్వాత కాలి గిట్టలు గిల్లవలెను. 
  • దాని తర్వాత వెంటనే అనగా ఈనిన 1/2 గంట లోపలే తల్లి చనులు దూడయొక్క నోటికి అందించి పాలు త్రాపించవలెను. ఈ విధముగా 4-5 రోజుల వరకు తప్పనిసరిగా దూడ తృప్తిగా త్రాగినంతవరకు జన్ను పాలు త్రాగించవలెను.  
  • ఈనిన 10వ రోజు దూడకు నట్టల నివారణ మందును తప్పక త్రాపిపంచవలెను.  
  1. అయ్యా!దూడకు నట్టల నివారణ మందును ఏవిధముగా త్రాపించవలెను. 

జవాబు.   

  • దూడ పుట్టిన 10వ రోజులకు పైపరిజిన్ అడిపేటు గ్రా. (లేక) పైపరిజన్ హైడ్రేట్ మి.లీ. త్రాపించవలెను.  
  • దూడ వయస్సు 20వ రోజు మరల 30 వ రోజున పైపరిజన్ అడిపేటు గ్రా (లేక) పైపజన్ హైడ్రేట్ మి.లీ. త్రాపించవలెను. 
  • రెండవ నెలలో అనగా 45 రోజులకు మరియు 60 రోజులకు సార్లు సైపరిజిన్ అడిపేట్ 10 గ్రా (లేక) పైపరిజిన్ హైడ్రేట్ 10 మి.లీ. త్రాపించవలెను.  
  • మూడవ నెల నుండి 5వ నెల వరకు అల్బెండజోల్ 25 గ్రా మాత్రలు నెలకు ఒకసారి యివ్వాలి. 
  • 6వ నెల తర్వాత నెలలకు ఒక మారు ఫెన్బండజోల్స్ గ్రా. సంవత్సరం వయస్సు వరకు యివ్వాలి. 
  • 18.అయ్యా!దూడలకు దాణా షెడ్యూలు గురించి చెప్పండి. 

జవాబు.   

  • దూడ వయస్సు 2 1/2 నెలలో 50 గ్రా దూడల దాణాను తినిపించాలి. రోజుకు ఈ విధముగా 3వ నెల వరకు దాణాను అలవాటుచేస్తూ దూడను తల్లి నుండి వేరుచేసి పాలు త్రాగుట మరిపించవలెను. 
  • 3వ నెల నుండి 4వ నెలవరకు 150 గ్రా చొప్పున ప్రతిరోజు యివ్వాలి.  
  • 4వ నెల నుండి 5వ నెల వరకు 200 గ్రా చొప్పున ప్రతిరోజు యివ్వాలి.  
  • 5వ నెల నుండి 6వ నెల వరకు 250 గ్రా చొప్పున ప్రతిరోజు యివ్వాలి.  
  • 6వ నెల నుండి 7వ నెల వరకు 300 గ్రా చొప్పున ప్రతిరోజు యివ్వాలి.  
  • 7వ నెల నుండి 8వ నెల వరకు 400 గ్రా చొప్పున ప్రతిరోజు యివ్వాలి.  
  • 8వ నెల నుండి 9వ నెల వరకు 450 గ్రా చొప్పున ప్రతిరోజు యివ్వాలి.  
  • 9వ నెల నుండి 10వ నెల వరకు 500 గ్రా చొప్పున ప్రతిరోజు యివ్వాలి.  
  • 10వ నెల నుండి 11వ నెల వరకు 600 గ్రా చొప్పున ప్రతిరోజు యివ్వాలి.  
  • 11వ నెల నుండి 12వ నెల వరకు 750 గ్రా చొప్పున ప్రతిరోజు దాణాతో పాటు విటమిన్ ‘ మరియు ఖనిజ లవణ మిశ్రమాన్ని యివ్వాలి.  
  1. అయ్యా!దూడలకు వ్యాధినిరోధక టీకాలు షెడ్యూలు కార్యక్రమం గురించి చెప్పండి. 

జవాబు.   

  • 2 1/2 నేలల వయస్సులో గాలికుంటు టీకా ను వేయించాలి.  
  • 51/2 నెలల వయస్సులో మరల బూస్టర్ డోసు టీకా వేయాలి.  
  • 6 నెలల వయస్సుపైబడిన తర్వాత గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి.  
  • 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలి. పై విధముగా దూడలను పరిరక్షించగలినపుడు ఈనాటి లేగ దూడలు రేపటి పాడి పశువులుగా అభివృద్ధి చెంది పాలవెల్లువ జరిగి రైతు యొక్క ఆర్థికస్థోమత పెరిగి కరవు కాటకాలను అధిగమించగలడు. 
  1. అయ్యా!పరిశుభ్రమైన పాలు ఉత్పత్తి పద్ధతులు గురించి చెప్పండి.  

జవాబు.   

  • పాడి పశువులున్న పాకలు పాలు పితుకుటకు అరగంట ముందుగా పేడ ఎత్తివేసి పరిశుభ్రముగా నీటితో కడుగవలెను.  
  • తర్వాత పాడి పశువులను మంచినీటితో వీపుపైనపొదుగుపైనతలపైనతోక కుచ్చులను శుభ్రముగా కడిగి పొడిగుడ్డతో పొదుగునుచనులను తేమ లేకుండా శుభ్రముగా తుడవవలెను. 
  • పాలు పితుకు వ్యక్తికి జలుబుగానిటి.బి. గాని అనగా మనిషి నుండి పశువులకు – పశువుల నుండి మనుషులకు సోకే వ్యాధులు వుండకూడదు. అనగా ఆరోగ్యవంతముగా వుండవలెనువ్యక్తి స్నానముచేసి పొడి బట్టలు ధరించివుండవలెను  
  • పాలు పితికేటటువంటి పాత్రలు పరిశుభ్రముగా వుండవలెను. ఇందుకుగాను పాత్రలను శుభ్రముగా సోడా పొడితో కడిగి తిరిగి మంచి నీటితో కడిగి పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టవలెను.  
  • ఉదయము పాలు పిండుకొనుటకు వీలుగా ముందురోజు సాయంత్రం పాత్రలను కడిగి శుభ్రంచేసి ఆరబెట్టివుంచవలెను. ఉదయం శుభ్రముచేసి ఆరబెట్టిన పాత్రలను సాయంత్రం పాలు పిండుకొనునపుడు వాడవలెను. 
  • పిండిన పాలను ఒక 1/2 గంట వరకు చల్లని ప్రదేశములో పతలా గుడ్డను కప్పిఉంచవలెను. ఈ విధంగా చల్లబరచినయెడల పాలలోని వెన్న పైభాగంచేరును. పైనున్న పాలను విక్రయించిచో అధిక ధర వచ్చును. అడుగుననున్న పాలను యింటికి వాడుకొనవచ్చును. 
  1. అయ్యా! దేశవాళి పశువుకంటే సంకరజాతి పశువు ఏవిధంగా మెరుగు లేక ఉత్తమం.

జవాబు.   

దేశవాళి పశువులు – ఆవులు  సంకరజాతి పశువులు – ఆవులు 
3 – 4 సంవత్సరము వయస్సులో ఆవులు మొదటిసారి ఎదకు వచ్చును.  12 – 18 నెలలోనే మొదటి సారి ఎదకు వచ్చును. 
4 సంవత్సరముల, 5 సంవత్సరముల వయస్సులో మొదటి ఈత ఈనును.  2  1/2 o లోపల మొదటి ఈత ఈనును 
ఈతకు – ఈతకు మధ్య కాలం 2 సంవత్సరములు  ఈతకు- ఈతకు 12 – 14 నెలలు మాత్రమే మధ్యకాలం వుండును 
ఈతలో 200 రోజులు మాత్రం పాలు యిచ్చును.  305 రోజులు పాల దిగుబడి వుండును. 
సరాసరి 2 లీటర్లు మాత్రం పాల దిగుబడి వుండును.  8 – 10 లీటర్లు పాల దిగుబడి పండును 

 

  1. అయ్యా!పాడి పోషణ లాభసాటిగా వుండాలంటే తగు సూచనలు చెప్పండి  

జవాబు.   

  • మేలుజాతి-పశువులనే ఎంపిక చేసుకోవలెను.  
  • పాడిపశువులు సకాలంలో ఎదకువచ్చి చూలుకట్టెటట్లు – వాటి పునరుత్పత్తి సామర్థ్యం పెంచుకోవడానికి తగిన చర్యలు తీసుకోవలెను.  
  • ప్రతిసంవత్సరములో ఈనేటట్లు పునరుత్పత్తి యాజమాన్యంలో తగు మెళుకువలు పాటించవలెను.  
  • చూలు పశువులలో పోషణలో శ్రద్ధ చూపాలి. 
  • పెయ్య దూడల పోషణలో శాస్త్రీయ పద్ధతులను పాటించి అవి ఆరోగ్యంగాత్వరగా పెరిగేట్లు చూచుకోవలెను. పెయ్యలు సకాలంలో ఎదకు వస్తున్నాయా లేదా గమనించవలెను.  
  • పాడి పశువులకు – వాటి ఉత్పత్తికి తగినట్లుగా మేపు అందించవలెను.  
  • పచ్చిమేతలు సాగుచేసుకొని పశువులకు మేపాలి. మేత వృధా కాకుండా చర్యలు తీసుకోవలెను.  
  • పాల ఉత్పత్తిలో ఖర్చులు తగ్గించి నాణ్యమైన పాల ఉత్పత్తి చేసి గిట్టుబాటు ధరలో అమ్ముకోవలెను. 
  1. అయ్యా! పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి సోకినట్లు ముందుగా గుర్తించడం ఎలా? 

జవాబు.   

అనుమానం వున్నప్పుడు స్ట్రిప్  కప్పులను వాడాలి. అంటే ఒక చిన్న కప్పులాంటి గిన్నెకు నల్లటి బట్ట కట్టి దానిపై ముందుగా రెండుమూడు ధారల పాలు పిండితే ఆ పాలల్లో వుండే అసాధారణమైన పదార్థాలను గుర్తించవచ్చును. ఈ విధముగా నాలుగు సన్నులలో వచ్చే పాలను పరీక్షించాలి. ఏ విధమైన కలుషితాలువున్నా ఆ పాలను మంచి పాలలో కలుపరాదు. ఒకవేళ కలిపితే మొత్తంపాలు చెడిపోయే ప్రమాదముంది. నల్లటిబట్టపైన కనబడే అపరిశుభ్రాలు మరియు అసాధారణ పదార్థాలు ముఖ్యంగా గడ్డలు కట్టిన పాలుచీమురక్తపు చారులు కల్గిన పాలు ఈ నల్లటి బట్టపై పిండిప్పుడు సులభంగా గుర్తించవచ్చు. దీనినిబట్టిపశువు అనారోగ్యముతోమపొదుగు వాపు వ్యాధితో వుందని గుర్తించాలి. అలాంటి పశువుల పాలను మిగతా పాeతో కలుపరాదు. అనారోగ్యపాలను పారబోయాలి. దూడలకు తాపటంకూడా చేయరాదు. 

  1. అయ్యా! పొదుగువాపు కు సంబందించి ఇంటి దగ్గర చేసుకునే పరీక్షలు ఏమైన ఉన్నాయ?

చేయు విధానము: (ఇళ్ళలో వాడుకునే సర్ఫ్ తో పరీక్ష చేయుట )  

  • ముందుగా సర్ఫ్ ఎక్సెల్ 5-6 చెంచాలు తీసుకొని అర లీటరు నీటిలో కలపాలి. ఈ నీటిని ఒక ప్లాస్టిక్ సీసాలో బద్ర పరచుకోవచ్చును. 3 నెలల వరకూ నిలువ వుంచుకొనవచ్చును. సీసాను వెలుతురు  తగలని చోట జాగ్రత్త చేయాలి.  
  • పరీక్ష చేయవలసిన పాడిపశువు నుండి పాలను సేకరించాలి. నాలుగు చనుకట్లనుండి  పాలను విడివిడిగా సేకరించాలి. ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాసులో 10 మి.లీ పాలను తీసుకొని 10 మి.లీ. సర్ఫ్ నీళ్ళను  కలపాలి. 10 సెకండ్ల సేపు నెమ్మదిగా ఆ మిశ్రమాన్ని కలపాలి. పొదుగు వాపు వ్యాధి ఉన్నట్లయితే ఆ మిశ్రమము ముద్దగా అయిపోతుంది. వ్యాధిలేనట్లయితే ఏమి మార్పు రాదు.  

దీనిని కనీసం వారానికి ఒక సారి అయినా చేస్తూ ఉన్నట్లయితే పొదుగు వాపు వ్యాధిని ఆదిలోనే గుర్తించి సరి అయిన సమయంలో చికిత్స చేసుకోవచ్చును, మనయొక్క పాడి పశువులను ఈ వ్యాధి బారి నుండి కాపాడుకోవచ్చును.  

  1. అయ్యా!పాలలో వెన్నశాతము పెరగాలంటే ఏమి చేయాలి? 
  • ముందుగా మనము పచ్చిమేతను అందించాలి 
  • మరల పోషక విలువలు ఉండే దాణాను వాడాలి  
  • ఎముకల పొడిని అగ్గిపెట్టె మూతలో సరిపడా ఉదయము, సాయంత్రము ఇవ్వాలి. 
  • వేరుశనగ కేకు మరియు ప్రత్తి గింజలకేకులను 250 గ్రాముల చొప్పున వారముపాటు ఉపయోగించాలి.  

                                                                                        డాక్టర్. గానుగపెంట రాంబాబు, 

                                                                                  పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, 

                                                                                     కడప,వై.యస్.ఆర్. జిల్లా 516001.

Leave Your Comments

ధాన్యం కొనుగోళ్లు, ఇబ్బందులు, కరోనా నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలపై అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు

Previous article

వివిధ పంటల సమగ్ర సస్యరక్షణకు – రైతులకు అందుబాటులో ఉన్న మొబైల్ యాప్స్

Next article

You may also like