Azolla Cultivation: ఎరువులు, పురుగుమందుల రాకతో తొలినాళ్లలో కళ్లు చెదిరే దిగుబడులు వచ్చాయి. కానీ కాలక్రమంలో తిరిగి సేంద్రియ విధానంలో సంప్రదాయ వంగడాల వైపు రైతు ఆలోచిస్తున్నాడు. రైతులు అజోల్లా సాగు చేపట్టి వరి పొలంలో వేసుకోవడం, పాడిపశువులకు, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలకు దాణాగా అందించడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చు.
అజొల్లా అంటే ఏమిటి?
అజోఫ్లేసీ అనబడే పుష్పించని ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందిన మొక్క ఇది. అజోల్లా… నీటి మీద తేలూతూ పెరిగే నాచులాగా ఉంటుంది. పంట సాగులో పచ్చిరొట్టగా, జీవన ఎరువులుగా ఉపయోగపడుతుంది
అజొల్లా ప్రాముఖ్యత :
దీనిలో మాంసకృత్తులు శాతం అధికం. శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలున్నాయి. విటమిన్ ‘ఎ’ విటమిన్ బి12లు, బీటా కేరోటిన్లు పెరుగుదలకు ఉపయోగపడే కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఇనుము, రాగి, మెగ్నీషియం వంటివి తగు పాళ్ళలో దీనిలో ఉన్నాయి. ఎండబెట్టిన అజొల్లా పొడిలో 25-35 శాతం మాంసకృత్తులు, 10-15 శాతం మినరల్స్, 7-10 శాతం అమినో ఆమ్లాలు, బయోపాలిమర్లు ఉన్నాయి. దీనిలో క్రొవ్వు పదార్ధం, పిండి పదార్థాల శాతం బాగా తక్కువ. అజొల్లాలోని ఈ అంశాలన్నీ దానిని ఖర్చు తక్కువతో అధిక ఫలితాలు నిచ్చే ప్రత్యమ్నాయ పశువుల దాణాగా వాడుతున్నారు. అధికంగా మాంసకృత్తులు, తక్కువగా లిగ్నిన్ ఉండటం వలన పశువులు దానిని తేలికగా జీర్ణం చేసుకుంటాయి. 1.5 నుండి 2 కిలోల అజొల్లాను రోజూ పశువుల దాణాతో కలిపి పాడి పశువులకు పెడితే పాల ఉత్పత్తులలో 15-20% వృద్ధి కనిపిస్తుంది. వేరుశనగ వంటి వాటికి బదులు అదే పరిమాణంలో అజొల్లాను వాడినచో పాల ఉత్పత్తి మీద ఎటువంటి ప్రభావం ఉండదు. దీనితో పాటు అజొల్లా వాడకం పాల నాణ్యతను పెంచడమే గాక పశువుల ఆరోగ్యాన్ని పెంచి పశువు జీవితకాలాన్ని పొడిగిస్తుంది.
Also Read: అజొల్ల తయారీలో మెళుకువలు
అజొల్లా ఉత్పత్తి :
అజొల్లా పెంచడానికి చెట్ల నీడలో గోతులు తవ్వాలి. బయట నుండి ఎటువంటి వేళ్ళులోనికి రాకుండా ప్లాస్టిక్ సంచులను గోతి లోపల పరచాలి. దానిమీద సిఫాలిన్ షీట్ వేసి నీరు నిలువ ఉంచే కృత్రిమ తొట్టి లాగా తయారుచేయాలి. 10-15 కిలోల భూసారం గల మట్టిని జల్లెడ పట్టాలి. మెత్తని మట్టిని షీట్ మీద గోతిలో ఒకే విధంగా ఉండేలా పరవాలి. 2 కిలోల పేడ, 30 గ్రాముల సూపర్ పాస్పేట్లు 10 లీటర్లు నీటిలో కలపి గుజ్జుగా తయారుచేసి ఆ మట్టి మీద పోయాలి. 10 సెం.మీ. నీటి మట్టం ఉండేలా చూడాలి. దాని కొరకు మరింత నీటిని కలపాలి. 500 గ్రాముల నుండి 1 కి.లో గ్రా వరకూ కలుపులేని తాజా అజొల్లా కల్చరు ఈ బెడ్ మీద సమానంగా పడేలా చల్లాలి. అలా చేయడం ద్వారా అజొల్లా త్వరగా పెరుగుతుంది. గొయ్యి మొత్తాన్ని ఆక్రమిస్తుంది. 10-15 రోజుల తరువాత రోజుకి 500 నుండి 600 గ్రాముల ఉత్పత్తిని పొందవచ్చు.
అజొల్లా పశువుల దాణాగా తయారుచేయడం :
1 చ.సెం.మీ. వెడల్పయిన రంధ్రాలు గల ప్లాస్టిక్ ట్రేలో సేకరించిన అజొల్లాను ఉంచి నీరు వడకట్టాలి. సగం నీరు నిండిన బకెట్లలో ఆ ట్రేను ఉంచి పై నుండి నీటిని పోసి ఆ పేడ వాసన పోయేలా కడగాలి. చిన్న అజొల్లా మెలకలు కూడా రంధ్రాలు ద్వారా బకెట్లోనికి వెళ్తాయి. ఆ నీటిని మరలా గోతిలో అజొల్లా బెడ్ మీద పోయవచ్చు. కడిగి శుభ్రమైన తాజా అజొల్లాను 1:1 నిష్పత్తిలో పశుదాణాలో కలిపి వాడవచ్చును.
పెంపకంలో జాగ్రత్తలు : తగినంత సూర్యకాంతి లభించే చెట్లనీడలో అజొల్లా ఉత్పత్తిని చేపట్టాలి. నేరుగా సూర్యకాంతి పడే పరిస్థితి మాత్రం ఉండకూడదు. గోతిలో నీటి మట్టం ఒకేలా ఉండేలా చూడాలి.
Also Read: పోర్టబుల్ కంటైనర్‌లో అజోల్లా పెంపకం యొక్క ప్రయోజనాలు