రైతులు ఆహార ఉత్పత్తి పంటల సాగులో ఎంత మక్కువ చూపిస్తున్నారో పశుగ్రాస పంటల సాగు కోసం అదే తరహాలో ఆసక్తి చూపుతున్నారు. పశుగ్రాస పంటలతో పాడిగేదెలకు పచ్చిమేత లభిస్తుండటంతో పాల ఉత్పత్తిని సాధించుకుంటున్నారు. పశుపోషణకు మేత అత్యవసరం కావడంతో కొద్దిపాటి వ్యవసాయ పొలాల్లో పశుగ్రాస పంటలను సాగు చేస్తున్నారు. కొద్దిపాటి నీటి వసతి కలిగిన చోట పశుపోషణకు పశుగ్రాస పంటలను పెంచడం ప్రయోజనకరం. జీవాలకు మేతగా ఉపయోగించే పంటల్లో పప్పు జాతి, ధాన్యపు జాతి. గడ్డి జాతి పంటలు చాలా ముఖ్యమైనవి. గడ్డి జాతుల్లో ఏకవార్షిక, బహు వార్షిక అనే గడ్డి రకాలున్నాయి. పండిస్తే అన్ని కాలాల్లో పశువులకు పచ్చి గడ్డి అందుబాటులో ఉంటుందన్నారు.
పశుగ్రాస పంటల సాగులో ఏక వార్షిక, బహు వార్షిక పంటలు ప్రధానమైనవి. ఏక వార్షిక పశు గ్రాసాలు పంట కాలంలో ఒకేసారి కోతకు వస్తాయి. బహు వార్షిక పంట పశుగ్రాసాలు ఏడాదిలో 7 నుంచి 8 సార్లు కోతకు వస్తాయి. వీటిలో ధాన్యపుజాతి, పప్పు జాతి, గడ్డిజాతి పశుగ్రాస పంటలు ఉన్నాయి.
ఏక వార్షిక పశుగ్రాసాలు:
సజ్జ, మొక్కజొన్న, జొన్న, ఓట్స్, బర్సిం, జనుము, పిల్లిపెసర, అలసందలు
బహు వార్షిక పశుగ్రాసాలు:
హైబ్రిడ్ నేపియర్, పారా గడ్డి, గినీ గడ్డి, లూసర్న్ గడ్డి.
నేలలు:
బహు వార్షిక పశుగ్రాసాలకు కొద్దిపాటి నీటి వసతి కలిగిన ఒండ్రు నేలలు, మధ్య రకం భూములు అనుకూలంగా ఉంటాయి. ఎకరానికి 12 వేల హైబ్రిడ్ నేపియర్ వంటి కాండపు మొక్కలు ( రెండు కణుపులు కలిగిన కాండపు మొక్కలు) అవసరం పడతాయి. కాండపు ముక్కలను 60 సెం.మీ. దూరంలో బోదెలను ఏటవాలుగా ఒక కణుపు మునిగేలా భూమిలో నాటుకోవాలి. ఒక కణుపు మధ్యలో ఉన్న కణుపు పైకి కనిపించేలా జాగ్రత్తలు పాటించాలి.
ఎరువులు:
ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ ఎరువులను దుక్కిలో వేసి కలియదున్నాలి. నాటిన 40 రోజులకు 20 కిలోల నత్రజని ఎరువులను వేయాలి. ప్రతి కోల తర్వాత 25 కిలోల చొప్పున నత్రజని ఎరువులను వేయాలి. నీటి యాజమాన్యం పద్దతులలో భాగంగా 15 రోజులకు ఒకసారి నీటి తడి సరిపోతుంది.
కలుపు నివారణ:
పాదుల్లో ఉన్న కలుపు మొక్కల నివారణకు సాళ్ల మధ్య దున్నుకోవాలి.
పంట కోత:
మొదటి దశలో 75 రోజులకు తదుపరి ప్రతి 45 రోజులకు కోతలు కోసుకోవాలి. కోతకు వచ్చిన పచ్చిగడ్డిని పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. ఒకసారి నాటిన బహు వార్షిక పశుగ్రాస పంటలు 7 నుంచి 8 కోతలు వరకు వస్తుంది. ఏడాదిలో 120 టన్నుల గడ్డి దిగుబడి వస్తుంది.
నాణ్యత కలిగిన పశుగ్రాసాలను కోయాలంటే 50 శాతం పూత దశలో ఉన్నప్పుడే పంట గ్రాసాన్ని కోయాలి. పాడి పశువులకు మూడు వంతుల గడ్డి జాతి, ఒక వంతు పప్పు జాతి గ్రాసాన్ని మేతగా ఇవ్వడం వల్ల పాల ఉత్పత్తి అధికంగా సాధించవచ్చు. పశుగ్రాసాన్ని చాఫ్ కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి మేతగా అందించడం వల్ల పశువులకు ఎక్కువ గ్రాసం మేసే అవకాశం ఉంది.
అనువైన కాలంలో సాగు చేసిన మొక్కజొన్న వంటి పశుగ్రాసాలను నిల్వ చేసుకోవడం వల్ల పశుమేత కొరత ఏర్పడకుండా వేసవి వరకు నిలువ చేసుకోవచ్చు. గడ్డి జాతి, ధాన్యపు జాతి, పప్పు జాతి, గడ్డి పంటలను పూత దశలో కోసి ఎండబెట్టుకోవాలి. తర్వాత పశువులకు మేతగా వేసుకోవాలి. ఆకుపచ్చ రంగులో ఉన్న పశుగ్రాసాన్ని నిల్వ చేసే ముందు ఆకుల్లోని తేమ ఆరిపోయే వరకు బూజు పట్టకుండా పులియకుండా జాగ్రత్తలు పాటించాలి.
పశుగ్రాస పంటల సాగులో పాటించవలసిన జాగ్రత్తలు..
Leave Your Comments