వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా రైతుస్థాయిలో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని అవలంభించినప్పుడే సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయంలో నష్టాలు ఏర్పడిన రైతులకు ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది. ప్రత్యేకించి వర్షాధార వ్యవసాయ క్షేత్రాలలో ఉన్న నీటిని సమర్థంగా ఉపయోగించుకునే విధంగా సమగ్ర వ్యవసాయ విధానంలో నీటి కుంటలోచేపలు, కుంటపైన కోళ్ల పెంపకం చేపట్టడం వల్ల వ్యర్ధాలను సమర్థంగా ఉపయోగించుకోవచ్చు.
నీటి కుంటల నిర్మాణం: వ్యవసాయ క్షేత్రంలో నీటి కుంటల నిర్మాణం చేసుకోవడం వల్ల వర్షాకాలంలో నీటిని నిలువ చేసుకోవడంతో పాటు చేపల పెంపకం చేపట్టడం ద్వారా లాభం పొందవచ్చు. ఈ నీటిని వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు జీవతడులిచ్చి కాపాడుకోవచ్చు. వర్షపు నీటిని నిల్వ కోసం 100 నుంచి 300 క్యూబిక్ మీటర్ల పరిమాణం గల నీటి గుంటలను తయారు చేసుకోవాలి. నీటి కుంట పరిమాణం ఆ ప్రాంత వర్షపాతం, నేల ఏటవాలు, పరివాహక ప్రాంతంపైన ఆధారపడి ఉంటుంది. నీటి కుంట పరిమాణం 10 మీ.X10 మీ.X2.5 మీ. నుంచి 15 మీ.X15 మీ.X3.5 మీ. వరకు ఉండవచ్చు. నీటి కుంట ఏటవాలు 1:5:1 ఉండాలి. పూడిక సేకరించే గుంత నీటి గుంట పైభాగాన ఏటవాలుకు అడ్డంగా 0.5 నుంచి ఒక మీటరు లోతు, 1:5:1 పక్క ఏటవాలు ఉండే విధంగా నిర్మించుకోవాలి. వర్షపు నీరు కుంటలో చేరే విధంగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
నీటి కుంటలో చేపల పెంపకం: కుంటలో నీరు చేరిన తర్వాత చేప పిల్లలను వదలడానికి వారం రోజుల ముందు ఎకరాకు రెండు టన్నుల పశువుల ఎరువు వేయాలి. ఈ విధంగా తయారు చేసిన కుంటలో త్వరగా పెరుగుదల చూపించే కట్ల (బొచ్చే), రాహు (రాగండి), కామన్ కార్ప్ (బంగారు తీగ) వంటి రకాల చేప పిల్లలను కుంట విస్తీర్ణాన్నిబట్టి ఎకరాకు 2500 మించకుండా 50 నుంచి 100 గ్రా. సైజు గల చేప పిల్లలను విడుదల చేయాలి.
నీటి కుంటపైన షెడ్డులో కోళ్ల పెంపకం: కోళ్ల రెట్టలో అధిక శాతం నత్రజని, పాస్ఫరస్ ఉండడం వల్ల నీటికుంటల్లోని చేపలకు కావలసిన ఎరువులను సమకూర్చవచ్చు. ఈ విధానంలో కుంటపైన వెదురుతో లేదా బలమైనకర్రలతో లేదా ఇనుప రాడ్లు, రేకులతో శాశ్వత నిర్మాణంలో షెడ్డుని నిర్మించి కోళ్ల పెంపకం చేపట్టవచ్చు. కోళ్లు వదిలేరెట్టను నేరుగా కుంటలో పడే విధంగా చేసి చేపలకు ఆహారంగా అందించవచ్చు. ఈ విధానంలో నాటు కోళ్లను లేదా బ్రాయిలర్ కోళ్లను ఎంచుకున్నట్లయితే రైతుకు తక్కువ కాలంలో అదనపు ఆదాయం చేకూరుతుంది. కోళ్ల పెంపకంలో నీటి పైన నిర్మించిన షెడ్డు సైజు ఆధారంగా 100 నుంచి 200 కోళ్లను పెంచవచ్చు. అదేవిధంగా కుంట సైజును బట్టి 1500 నుంచి 2000 చేప పిల్లలను వదులుకోవాలి. చేప పిల్లల సాంద్రత పెంచినట్లయితే కోడి పిల్లల సాంద్రత కూడా పెంచుకోవచ్చు. చేపల మేతపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా నీటి కుంటలో చేపలు, కుంటపైన కోళ్ల పెంపకం చేపడితే చేపలు, మాంసం, గుడ్ల నుంచి అదనపు ఆదాయం పొందుతూ కుంటలోని నీటి వసతిని వ్యవసాయానికి వాడుకోవచ్చు. చేపలు, కోళ్ల వ్యర్ధాలు కలిసిన నీటిలో అధిక పోషకాలు ఉండటం వల్ల పంటల నుంచి అధిక దిగుబడిని పొందవచ్చు.
నీటి పైన తెలియాడే పంజరాల్లో కోళ్ల పెంపకం: చేపల చెరువు నీటి ఉపరితలంలో తేలియాడే పంజరాలను (కేజ్) ఏర్పాటు చేసుకొని కోళ్లను పెంచుకోవచ్చు. నీటి కుంట ఉపరితలంపై 8 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు, 4 అడుగుల ఎత్తు ఉండేలా చెక్కతో గాని పైపులతో గాని ఫ్రేములు తయారు చేసి అర అంగుళం సైజు గల ఇనుప మెష్ బిగించి కోళ్లకు రక్షణ కల్పించాలి. ఇలాంటి తేలియాడే కేజ్ లను 1000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల నీటికుంటపై మూడు నుంచి నాలుగు యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కోళ్ల కేజ్ యూనిట్ నీటిలో తేలియాడే విధంగా కింది భాగంలో ప్లాస్టిక్ డ్రమ్ములు లేదా ట్యూబులను ఏర్పాటు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కేజ్ లలో 20 నుంచి 25 కోళ్లను పెంచుకోవచ్చు. తేలియాడుతూ ఉండే ఈ యూనిట్ నీటికుంట గట్ల దగ్గరగా పోకుండా కుంట గట్లపై కర్రలను పాతి ప్లాస్టిక్ వైర్ బిగించాలి. ఇలా చేయడం వల్ల కేజ్ లలోని కోళ్లకు మేత, నీటిని మార్చుకోవడానికి వీలుంటుంది. ఈ కేజ్ లను ఒక వారం రోజులపాటు కొంత ప్రదేశంలో తిరిగేలా, మళ్లీ వారం మరో ప్రదేశంలో కదిలేలా మార్చుతూ ఉండాలి. దీని వల్ల కోళ్ల విసర్జితాలు చెరువు అంతా పడి చేపలకు కావాల్సిన సహజ మేత అందుతుంది. తద్వారా అనుబంధ మేతకయ్యే ఖర్చు తగ్గుతుంది.
నీటి కుంట గట్లపై కోళ్ళు, బాతుల పెంపకం: నీటి కుంట గట్లపైన చెక్కలతో లేదా గట్టి కర్రలతో ఒక షెడ్డును నిర్మించి దాంట్లో కోళ్లను, బాతులను పెంచుకోవచ్చు. కోళ్లను డీప్ లిట్టర్ పద్ధతి ద్వారా చేపట్టవచ్చు. ఈ లిట్టర్ ద్వారా అందించే వ్యర్ధాన్ని నీటిలో వదలడం వల్ల చేపలకు మేతగా ఉపయోగపడుతుంది.
డా.టి.ప్రభాకర్ రెడ్డి, డా.బి.రాజశేఖర్, డా.కె.రామక్రిష్ణ, డా.ఓ శైల, డా. ఆదిశంకర్, డా.ఇ.జ్యోష్ణ, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం, నాగర్ కర్నూల్ జిల్లా .
ఫోటో రైటప్:
కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో నాబార్డ్ ఆర్ధిక సహకారంతో నిర్మించిన సమగ్ర కోళ్ళు, చేపలపెంపకం యూనిట్ ను ఆటారి డైరెక్టర్ షేక్ మీరా, నాబార్డ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల, విస్తరణ సంచాలకులు జమునా రాణి ప్రారంబించారు.