Ovine Encephalitis in Sheep: పిడుదుల ద్వారా గొర్రెలలో వ్యాపించు ఒక ప్రాణాంతకమైన వ్యాధి. వీటితో పాటు అన్ని రకముల పశువులలోను మరియు వనుషులలోను కూడా ఈ వ్యాధి అప్పుడప్పుడు కలుగుతుంటుంది.ఈ వ్యాధి టోగా విరిడి కుటుంబానికి చెందిన వివైరస్ వలన కలుగుతుంది.
ఇది ఒక సింగిల్ స్టాండర్డ్ ఆర్.ఎన్.ఏ వైరస్. ఇది సుమారు 30-40 nm పరిమాణం కలిగి ఉంటుంది. ఈ వైరస్ ముఖ్యంగా మెదడు వాపు వ్యాధిని కలుగ జేస్తుంది. అందువలన దీనిని న్యూరోట్రోఫిక్ వైరస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా ఇక్సోడస్ రేసిసస్ అనే పిడుదుల కాటు వలన ఎక్కువగా వస్తుంది. అందువలనే ఈ వ్యాధిని “టిక్బార్న్ ఎన్ సెఫలైటిస్” అని కూడా అంటారు.అన్ని వయస్సు గల గొర్రెలు, గుర్రాలు, ఆవులు, పందులలో ఈ వ్యాధి ప్రబలుతుంటుంది. మనుషులలో అరుదుగా ఈ వ్యాధి వస్తుంటుంది.
Also Read: Castor Threshing: ఆముదం కాయలుఎలా వలుస్తారు.!
వ్యాధి బారిన పడిన పశువులు మరియు క్యారియర్ పందుల నుంచి వెలువడే మల మూత్రాలతో కలుషితం అయిన ఆహారాన్ని తీసుకోవటం వలన కాని లేదా క్యారియర్ పందులకు కుట్టిన ఇక్సోడస్ రేసిసస్ పిడుదుల ద్వారా కాని లేదా వ్యాధి బారిన పడిన పశువుల పాల ద్వారా కాని ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంది.క్సోడస్ రేపిసన్ పిడుదుల కాటు వలన ఈ వైరస్ దగ్గరలో ఉండే లింఫ్ గ్రంథులలోకి చేరి, అక్కడ వుండి లింఫోసైట్స్ కణాలను నాశనం చేసి, రక్తంలో కలిసి వ్రుద్ధి చెంది, రక్తం ద్వారా మెదడుకు చేరి మెదడు కణజాలాలను నాశనం చేయుట వలన ఈ క్రింది లక్షణాలు కలుగుతాయి.
లక్షణాలు
చిన్నవాటిలో:- గొర్రెపిల్లలు ఎటువంటి లక్షణాలు చూపకుండానే చనిపోతుంటాయి.
పెద్దవాటిలో:- మొదటి సారిగా 2-3 రోజుల వరకు అధిక జ్వరం వుండి, తరువాత తగ్గుతుంది. రెండవ సారి జ్వరం వచ్చినప్పుడు ఈ క్రింది లక్షణాలు కనబడుతాయి. మెడ, తొడ కండరాలు ఎక్కువగా కొట్టుకుంటాయి. నడవలేకపోవుట, కాళ్ళు పట్టి నడుచుట, తల ఒక్కప్రక్కకు తిప్పుకొనుట వంటి లక్షణములను గమనించవచ్చు. కొన్ని రోజులకు భూమి మీద పడిపోయి లేవలేక పక్షవాతానికి గురి అయి చివరికి చనిపోతాయి.
ఆవులలో:- ప్రతి చిన్న చర్యకు ఉద్రేకం కలుగుతుంటుంది. కంటి రెప్పలు కొట్టుకుంటాయి. క్రింద పడి కొట్టుకుంటాయి. కాని చనిపోయే అవకాశాలు తక్కువ.
మెదడులో చిన్న చిన్న చీము పట్టని గడ్డలు ఉంటాయి. వ్యాధి చరిత్ర ఆధారంగా, లక్షణాలు, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా, ప్రయోగశాలపరీక్షల ఆధారంగా (CFT, ELISA) ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
చికిత్స:- వ్యాధికా రకంను నిర్మూలించుటకు నిర్ధిష్టమైన చికిత్స లేదు. జ్వరం తగ్గడానికి అంటీ పైరెటిక్స్, శోధము మరియు నొప్పిని తగ్గించడానికి ఆంటి ఇన్ఫ్లమేటరీ, అంటి అనాల్జెసిక్స్ ఔషధములను ఇవ్వాలి .ఉద్రేకం తగ్గడానికి ఎసిటైల్ ప్రామజిన్స్ వంటివి ఇవ్వాలి. పశువుల స్థితిని బట్టి వాటికి సెలైన్స్, విటమిన్స్, మినరల్స్ ఇస్తూ, తగినంత విశ్రాంతిని ఇవ్వాలి. ఈ వ్యాధికి ఎటువంటి టీకాలు లేవు. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుండి వేరుచేయాలి. పశువుల క్షేత్రంలో దోమలు లేకుండా చూసుకోవాలి.