ఆంధ్రప్రదేశ్పశుపోషణ

జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకము

0

బ్రూసెల్లోసిస్‌ వ్యాధిని నిర్మూలిద్దా`ఆర్ధిక ప్రగతిని సాధిద్దాం పశువుల నుండి మనుషులకు సోకే స్వభావం ఉన్న వ్యాధుల్లో బ్రూసెల్లోసిస్‌ అతి ప్రమాదకరమైనది. ‘‘బ్రూసెల్లా అబార్టస్‌’’ అనే బాక్టీరియా వల్ల పశువుల్లో సోకే ఈ అంటువ్యాధిని ‘బ్యాంగ్స్‌’ వ్యాధి అని కూడా అంటారు. బ్రూసెల్లా సూక్ష్యజీవులు ఎక్కువగా పశువుల జననేంద్రియాలను, పొదుగును ఆశించి  వ్యాధిగ్రస్తం చేస్తాయి. తద్వారా చూలి పశువుల్లో గర్భస్రావాలు, కోడెలు మరియు దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం సంభవిస్తుంది. ఈ వ్యాధి పశువులకు, గొర్రెలకు, మేకలకు, పందులకు మరియు మనుషులకు సోకుతుంది.

వ్యాధి వ్యాప్తి :
వ్యాధిగ్రస్తమైన పశువుల్లో గర్భస్రావం సంభవించినప్పుడు పిండం ద్వారా, గర్భకోశ స్రవాల ద్వారా సూక్ష్మజీవులు మేతను, నీటిని కలుషితం చేస్తాయి. ఈ మేతను, నీటిని మిగిలిన పశువులు తీసికోవడం ద్వారా వాటికి సోకుతుంది. ఈసుకొనిపోయిన పశువులు, ఇతర పశువులు, చెరువుల్లో, నీటి కుంటల్లో పొర్లినప్పుడు గర్భకోశ స్రవాలు నీటిని కలుషితం చేయడం ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన కోడెలు, దున్నలు, ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. పాలు, వెన్న, మాంసోత్పత్తులు, శరీరంపై గాయాలు మరియు కంటిపొర ద్వారా సూక్ష్మజీవులు మనుషుల్లో వ్యాధిని కలుగచేస్తాయి. సూక్ష్మజీవులతో కలుషితమైన కృత్రిమగర్భోత్పత్తి పరికరాల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు :
చూడి పశువుల్లో గర్భస్రావాలు సాధారణంగా చూడి ఆఖరి దశలో సంభవించడం వ్యాధి ప్రధాన లక్షణం చూడి మోపగానే సూక్ష్మజీవులు మాయను, గర్భకోశాన్ని ఆశించి, వ్యాధిగ్రస్తం చేస్తాయి. కాటిలెడెన్సు కుళ్ళిపోవడం వల్ల పిండం మరణించి, గర్భస్రావమవుతుంది. గర్భస్రావాలు ఈవిధంగా 2-3 ఈతల్లో సంభవిస్తాయి. ఈసుకొనిపోయిన పశువుల మాయను సరిగ్గా వేయవు. తద్వారా పశువుల గర్భకోశంలో చీముచేరి వంధత్వానికి దారి తీస్తుంది. పశువుల్లో పునరుత్పత్తి ప్రక్రియ దెబ్బ తింటుంది. దూడలు ఒక వేళ పుట్టినా, చాలా బలహీనంగా ఉండి, కొద్ది గంటల్లో మరణిస్తాయి. ఆబోతు, దున్నల్లో వృషణాల వాపు కలుగుతుంది. వ్యాధిగ్రస్తమైన పశువుల వీర్యంలో సూక్ష్మజీవులుంటాయి. వీర్యంలో చనిపోయిన వీర్యకణాలు గమనించవచ్చు. పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. కాలేయం దెబ్బతింటుంది. మెడ ప్రాంతంలోని వినాళ (లింపు) గ్రంధులు వాచిపోతాయి. పశువులు కీళ్ళనొప్పులతో బాధపడుతూ, సరిగ్గా నడవలేకపోతాయి

వ్యాధి నిర్ధారణ :
పశువుల్లో చూడి ఆఖరు దశల్లో అకస్మాత్తుగా అనేక గర్భ స్రావాలు సంభవించడం, మాయ పూర్తిగా వేయకపోవడం మొదలైన లక్షణాల ద్వారా వ్యాధిని గుర్తించవచ్చు. ఈసుకొనిపోయిన పశువు యొక్క రక్తం, పిండ రక్తం, పాలు, గర్భాశయపు మట్టు మొదలైన పదార్ధాలను ప్రయోగశాలలో పరీక్షిస్తే సూక్షజీవులు కనబడతాయి. పాడి పశువులలో ‘‘మిల్క్‌ రింగ్‌ టెస్ట్‌’’ ద్వారా, ఇతర పశువుల్లో అగ్లుటినేషన్‌ టెస్ట్‌ ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు.

చికిత్స మరియు నివారణ :
ఈ వ్యాధికి చికిత్స వల్ల ప్రయోజనం లేదు. పై పరీక్షల ద్వారా వ్యాధినిర్ధారితమయిన పశువులను  మంద నుండి తీసివేయాలి. ఈసుకొనిపోయిన పశువులను పశువైద్యునిచే శాస్త్రీయ పద్దతుల్లో చికిత్స చేయించాలి. గర్భకోశంలో చీము, రక్తం నిలువ ఉండకుండా, వంధత్వానికి దారి తీయకుండా చికిత్స చేయించాలి. చికిత్స అనంతరం తగు విశ్రాంతినివ్వాలి. వ్యాధిచికిత్స పూర్తయ్యి వ్యాధి పూర్తిగా నిర్మూలనయ్యాకే పశువులను పునరుత్పత్తికి వాడాలి. వ్యాధిగ్రస్తమైన పశువులు మిగిల్చిన మేతను, గర్భకోశ మట్టును, మాయను, పిండాన్ని కాల్చివేయాలి. పశువుల కొట్టాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. మట్టువేసే పశువులను మంద నుండి వేరు చేసి, ప్రత్యేకంగా చికిత్స చేయించాలి. వ్యాధిగ్రస్తమైన కోడెలను మరియు దున్నలను పునరుత్పత్తికి వినియోగించకూడదు. పునరుత్పత్తికి వాడే పశువులను సంవత్సరానికొకసారి వైద్యునిచే పరీక్ష చేయించి, ఆరోగ్యకరమైన వాటినే వినియోగించాలి. కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా ఈ వ్యాధి చాలా అరుదుగా సోకుతుంది. కాబట్టి ఈ పద్దతిని అనుసరించడం మంచిది. వ్యాధిగ్రస్తమైన పాలను వినియోగించకూడదు. పశువైద్యులు, పశుపోషకులు మాయ తీసిన తరువాత, పాలు పితికిన తరువాత చేతులను శుభ్రపరుచుకోవాలి. చేతులకు ఎటువంటి గాయాలున్నా జాగ్రత్తపడాలి. పాలు తీసే ముందు పశువుల పొదుగును, తోకను, ఇతర భాగాల్ని ఎటువంటి మట్టు, మురికి లేకుండా శుభ్రం చేయాలి. టీకాలు చేసే వ్యక్తి తగు జాగ్రత్తలు పాటించాలి, దూడలకు 4-8 మాసాల వయస్సులో లైవ్‌ అటెన్యుయెటెడ్‌ కాటన్‌ స్ట్రేయిన్‌- 19 టీకాలను చేయిస్తే, వ్యాధి నిరోధక శక్తి వాటికి పూర్తి జీవితకాలం ఉంటుంది.

పశుసంవర్ధకశాఖ, ఆంధ్రప్రదేశ్‌.            
పశు ఆరోగ్యమే.. రైతుకు మహా భాగ్యం…   

Leave Your Comments

జీడిమామిడి పూత, కోత దశలో సస్యరక్షణ

Previous article

బయోఎంజైమ్ల స్థిరీకరణతో మట్టిలో నిల్వ నాణ్యతను పెంపొందించడం పరిచయం

Next article

You may also like