పశుపోషణ

వేసవిలో పశువుల గృహ వసతి నిర్వహణ..

0

వేసవిలో పశువులను ఎండ తీవ్రత నుండి రక్షించడానికి అనుకూలంగా ఉండే గృహవసతిని కల్పించాలి. పాకలలో గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించడానికి వీలుగా పాకల ఎత్తు సుమారుగా 12 అడుగులు ఉండాలి. సూర్యరశ్మి నేరుగా పడకుండా దీర్ఘ అక్షం తూర్పుపడమరలుగా నిర్మించుకోవాలి. పాకలకు ఇరువైపులా ఉండే పక్కగోడలను పూర్తిగా కట్టకుండా 4-6 అడుగుల ఎత్తు వరకు నిర్మించాలి. పాకలకు ఇరుపక్కలలో నీడనిచ్చే చెట్లను పెంచాలి. సుబాబుల్, అవిసె మొదలగు పశుగ్రాసపు చెట్లను పెంచినట్లయితే నీడనివ్వడమే కాకుండా ఎండాకాలంలో పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి. పశువుల పాకలలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే తట్టుకోలేవు కాబట్టి పాకలలో శీతల స్థితి ఉండేటట్లు తగు ఏర్పాట్లు చేసుకోవాలి. పాకలలో ఉష్ణోగ్రతలను తగ్గించడానికి పాకలను ఇరువైపులా గోనె పట్టాలను వేలాడదీసి నీటితో రెండు మూడు సార్లు తడపాలి. పాకలలో గాలి పంకాలను, కూలర్లను అమర్చడం ద్వారా పాకలలో ఎండవేడిని తగ్గించవచ్చు. వీలైతే పాకలలో నీటి షవర్స్, స్ప్రింక్లర్లు మొదలగు వాటిని అమర్చి నీటి తుంపరలు పశువుల శరీరంపై పడేటట్లు చేసినట్లయితే పాకలలో ఉష్ణోగ్రతను తగ్గించి శీతలస్థితిని కల్పించడం ద్వారా పశువులకు సౌకర్యవంతంగా ఉంటుంది. పాకలపై కప్పుభాగాన్ని తాటి ఆకులతో లేదా గడ్డితో కప్పినట్లయితే పాకలలో ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు. పైకప్పుభాగం రేకులతో ఉన్నట్లయితే ఎండాకాలంలో రేకులపై 8-10 సెం.మీ. మందంతో గడ్డిని పరచి మధ్యాహ్నం వేళల్లో రోజుకు రెండుమూడు సార్లు నీటితో తడుపుతుండాలి. రైతు ఆర్దిక స్థోమత మరియు పశువుల సంఖ్యను బట్టి పాకల్లో ఫ్యాన్లను లేదా తుంపర్లను వెదజల్లే యంత్రాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కప్పుపై భాగంపై తెల్లని రంగు వేయించడం వల్ల సూర్యకిరణాలు పరివర్తనం చెందుతాయి. పాకలలో వడగాడ్పుల తీవ్రతను తగ్గించడానికి పాకకు ఇరువైపులా పరదాలను కట్టి నీటితో తడుపుతుండాలి. పశువులను ప్రతిరోజు రెండుసార్లు శుభ్రమైన చల్లటి నీటితో కడగాలి. శుభ్రమైన చల్లని త్రాగునీటిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి. 

Leave Your Comments

గల్ఫ్ బాట వీడి.. కూరగాయల సాగు

Previous article

వ్యవసాయ పద్దుపై శాసనసభలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Next article

You may also like