ఆంధ్రప్రదేశ్పశుపోషణవార్తలు

పశుగణన !……. ప్రాముఖ్యత – విధానం  

0

గ్రామీణ భారతదేశపు జీవనాడి మన dai మొదలైనవన్నీమన రైతుల జీవనోపాధి మాత్రమే కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివి. పశుసంపద రంగం మన దేశ స్థూల ఉత్పత్తి (జి.డి.పి.) లో దాదాపు 4.11 శాతం వాటాను, వ్యవసాయ స్థూల ఉత్పత్తి (జి.డి.పి.)లో 29.35 శాతం వాటాను కలిగి ఉంది. ఈ  రంగం దాదాపు 8.8 శాతం గ్రామీణ కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఇంతటి పాత్ర పోషిస్తున్న పశుసంపదని మనం సరిగ్గా లెక్కించుకుంటున్నామా ? పశుగణన కార్యక్రమం గురించిన వివరాలు చూద్దాం.

పశుగణన అంటే..
పశుగణన అంటే కేవలం పశువులను లెక్కించడం కాదు, మన దేశ భవిష్యత్తును అంచనా వేయడం. పశుగణన అనేది ఒక దేశం లేదా ప్రాంతంలోని పశుసంపద గురించి సమగ్ర సమాచారాన్నిసేకరించే ప్రక్రియ. ఇది పశువులకు సంబంధించి వివిధ వివరాలను కలిగి ఉంటుంది. ఈ సమాచారం జాతీయ ప్రణాళిక, పశుసంపద అభివృద్ధి, వ్యవసాయ రంగానికి అత్యంత ముఖ్యమైనది.

పశుగణన ప్రాముఖ్యత:
జాతీయ సంపద అంచనా: పశుసంపద దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. ఈ గణన ద్వారా సంపదను ఖచ్చితంగా అంచనా వేయవచ్చు.

విధివిధానాల రూపకల్పన: పశుసంపద అభివృద్ధికి సంబంధించిన విధివిధానాలను రూపొందించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది.

ఆరోగ్య నిర్వహణ: పశువుల ఆరోగ్యాన్ని పశుగణన ద్వారా సమగ్రంగా అంచనా వేయవచ్చు. దీని ద్వారా పశువుల ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, టీకాల పంపిణీ వంటి చర్యలను సమర్థంగా చేపట్టవచ్చు.

మౌలిక వసతులు గుర్తించడం: పశుగణన ద్వారా పాడి పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఎక్కడ అవసరమో గుర్తించి, వాటిని సమర్థంగా ఏర్పాటు చేయవచ్చు.

పశువుల సంరక్షణ: పశుగణన ద్వారా పశువుల సంరక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వవచ్చు. పశువుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదా పెరగడం వంటి అంశాలను అంచనా వేసి, వాటిని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చు.

జాతుల సంరక్షణ: అంతరించిపోతున్న జాతుల గుర్తింపు, సంరక్షణకు దోహదపడుతుంది.

ఉత్పాదకత పెంపు: పాల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి వంటి రంగాలలో ఉత్పాదకతను పెంచడానికి సహాయపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడగల సామర్థ్యాన్నిపెంచవచ్చు.

వ్యవసాయ అభివృద్ధికి మార్గదర్శకం: పశుగణన ద్వారా సేకరించిన సమాచారంతో వ్యవసాయ రంగానికి పాడిపశువుల సహకారం ఎటువంటి స్థాయిలో ఉందో అంచనా వేయవచ్చు. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలకు సంబంధించిన పథకాలను రూపొందించవచ్చు.

ప్రభుత్వ పథకాల అమలు: పశుగణన సర్వేలో సేకరించిన వివరాల ఆధారంగా రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు, సబ్సిడీలు వంటి వాటిని సమర్థంగా అమలు చేయవచ్చు.

పశుగణనలో వేటిని లెక్కిస్తారు ?:
ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, కుక్కలు, కోళ్లు, ఇతర పశువులను పశుగణనలో భాగంగా లెక్కిస్తారు.

ఆరు దశల్లో పశుగణన ప్రక్రియ:
పశుగణన ప్రక్రియ సామాన్యంగా ఆరు దశల్లో చేస్తారు. ఆ వివరాలు…

1) ప్రణాళిక దశ: గణన తేదీలు నిర్ణయించడం, గణనకర్తల (ఎన్యూమరేటర్ల)ను  నియమించడం, ప్రశ్నావళి తయారు చేయడం, ప్రాంతాలు విభజించడం చేస్తారు.

2) శిక్షణ దశ: గణనకర్తలకు విస్తృతమైన శిక్షణ ఇచ్చి, ప్రశ్నావళి నింపడం, సమాచార సేకరణ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు.

3) డేటా సేకరణ దశ: ఇది పశుగణన ప్రక్రియలో అత్యంత కీలకమైన దశ. గణనకర్తలు ఇంటింటికి వెళ్లి సమాచారాన్ని సేకరిస్తారు.

4) పశుగణన ప్రక్రియ దశ – గణన చేసే విధానం:
గణనకర్త ప్రతి ఇంటిని సందర్శిస్తారు. వారు తమను తాము పరిచయం చేసుకుని, గణన ప్రాముఖ్యతను వివరిస్తారు. తర్వాత గణనకర్త ప్రశ్నావళిలోని ప్రశ్నలను అడుగుతారు.  ప్రశ్నావళిలో…పశువుల సంఖ్య – వివరాలు, వయస్సు – లింగం వివరాలు, జాతి సమాచారం, ఉత్పాదకత వివరాలు (పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి మొదలైనవి), ఆరోగ్య స్థితి, మేత పద్ధతులు, పశుగృహాల స్థితి వగైరా అంశాలు ఉంటాయి. గణనకర్తలు (ఎన్యూమరేటర్లు) సాధ్యమైనంత వరకు పశువులను ప్రత్యక్షంగా చూసి, వాటి స్థితిని నమోదు చేస్తారు.సేకరించిన సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి గణనకర్త అవసరమైతే అదనపు ప్రశ్నలు అడిగి క్రాస్- చెకింగ్ చేసుకుంటారు. కొన్ని సందర్భాలలో గణనకర్తలు ప్రతి ఇంటి జిపిఎస్  కోఆర్డినేట్స్ ను నమోదు చేస్తారు. ఆధునిక పద్ధతుల్లో, గణనకర్తలు స్మార్ట్ ఫోన్లు లేదా ట్యాబులను ఉపయోగించి సమాచారాన్ని నేరుగా డిజిటల్ ఫారమ్ లో నమోదు చేస్తారు. అవసరమైతే గణనకర్తలు యజమాని అనుమతితో పశువుల ఫోటోలను, సమాచారం ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి యజమాని సంతకం తీసుకుంటారు.

5) డేటా ప్రాసెసింగ్ దశ: సేకరించిన సమాచారం కేంద్రీకృత డేటాబేస్‌లోకి ఎంటర్ చేయబడుతుంది. డేటా (సమాచారం) శుద్ధి ప్రక్రియ జరుగుతుంది. అస్థిరమైన లేదా తప్పుడు  డేటాని గుర్తించి సరిచేస్తారు.

6) విశ్లేషణ, నివేదిక తయారీ దశ: శుద్ధి చేసిన డేటాని విశ్లేషించి, వివిధ గణాంకాలు, చార్టులు, గ్రాఫ్ లు తయారు చేసి తుది నివేధిక రూపొందిస్తారు.
పశుగణన అనేది కేవలం సంఖ్యలను లెక్కించే ప్రక్రియ మాత్రమే కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్య భాగమైన పశుసంపద రంగాన్ని అర్థం చేసుకోవడానికి, దాని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనం. సరైన పశుగణన ద్వారా మన దేశ పశుసంపదను మరింత బలోపేతం చేసి, రైతుల సంక్షేమానికి, జాతీయ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడవచ్చు. అందుకే అంటారు “పశు సంపద లెక్కింపు – దేశ సంపద పెంపు” అని.

గమనిక :

పశుగణన ముసుగులో గణనకర్తల (ఎన్యూమరేటర్ల) పేరిట కొంత మంది మోసగాళ్ళు రైతుల బ్యాంకు ఖాతాలు, ఆర్ధిక లావాదేవీల గురించి తెలుసుకోవడం, వారి వేలిముద్రలను తీసుకోవడం లాంటివి చేసే ప్రమాదం ఉంది. పశుగణనలో ఈ విషయాలు భాగం కాదు కాబట్టి గణనకర్తలు ఎప్పుడూ అటువంటి సమాచారాన్ని అడగరని రైతులు గుర్తుంచుకోవాలి.
పశుగణన పేరిట జరిగే ఇటువంటి మోసాలను అరికట్టడానికి గణనకర్తలు సమాచార సేకరణ కోసం వచ్చినప్పుడు తప్పనిసరిగా వారి ప్రభుత్వ గుర్తింపు (ఐ.డి.) కార్డుని చూపించాల్సిందిగా కోరాలి. ఆ గుర్తింపు కార్డుని మీరు పరిశీలించిన తరువాతే అతనికి సమాచారాన్ని అందించాలి.
ఈ వ్యాసం ద్వారా అక్టోబర్ 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు వరకు జరిగే 21 వ అఖిల భారత “పశుగణన” కార్యక్రమంపై రైతులకు  ఉన్నటువంటి సందేహాలు, అపోహలన్నీ తొలగి వారు పశుగణనకు వచ్చే గణనకర్తలకు  సహకరిస్తారని ఆశించుదాం.

డా. జి. మిథున్, పి.హెచ్.డి. విద్యార్థి,
పశువైద్య, పశుసంవర్ధక విస్తరణ విభాగం,
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,
పశువైద్య కళాశాల, తిరుపతి.
ఫోన్: 7799804000.

Leave Your Comments

ఆవాల పంటలో అధిక దిగుబడికి శాస్త్రీయ సాగు సూచనలు  

Previous article

రబీ పంటల్లో విత్తనశుద్ధి ఎలా చేసుకోవాలి ?

Next article

You may also like