Goat and Sheep Transport: కావాల్సిన జీవాలను నిర్దేశిత ప్రామాణికాల ప్రకారం ఎంపిక చేసుకున్న తర్వాత కొనుగోలు ప్రాంతం నుండి వాటిని ఫారం పెట్టే ప్రాంతానికి ఎలాంటి నష్టం జరగకుండా తీసుకురావడం చాలా ముఖ్యం. ముఖ్యముగా దారిలో అవి చనిపోకుండా పలుజాగ్రత్తలు తీసుకోవాలి. కొనుగోలు ప్రాంతం దూరాన్ని బట్టి, కొనుగోలు చేసిన జీవాల సంఖ్యను బట్టి వాటిని ఎలా రవాణా చేసుకోవాలో నిర్ణయించుకోవాలి. జీవాలను తరలించే పద్దతులు మూడు రకాలు.
1. కాలినడక ద్వారా : జీవాల కొనుగోలు ప్రాంతం 5`30 కిలోమీటర్ల లోపు ఉన్నట్లయితే వాటిని కాలినడక ద్వారా దారిలో మేపుకుంటూ తీసుకురావడం సులువైన పద్ధతి. రవాణా ఖర్చు కూడా మిగులుతుంది. జంతు హింస నిరోధక చట్టం, 1960 లోని రవాణా నిబంధనలననుసరించి పెద్దజీవాలను ఒక్కరోజులో 30 కిలోమీటర్ల దూరం వరకు లేదా గంటకి నాలుగు కిలోమీటర్ల నడక మించకుండా రోజుకి 8 గంటల వరకు నడిపించవచ్చు. అయితే వాటికి ప్రతీ రెండు గంటలకొకసారి త్రాగునీరు, ప్రతీ నాలుగు గంటలకొకసారి మేత అందించవలసి ఉంటుంది. జీవాల వయస్సు ఒక సంవత్సరం లోపు ఉన్నట్లయితే వాటిని గంటకు 2.5 కిలోమీటర్ల చొప్పున రోజుకు 6 గంటలు మాత్రమే నడిపించాలి. వీటికి కూడా ప్రతీ గంటన్నరకి త్రాగునీరు, ప్రతీ మూడు గంటలకొకసారి మేత అందించాల్సి ఉంటుంది.
2. రైలుమార్గం ద్వారా : రోడ్డు రవాణాతో పోలిస్తే సుదూర ప్రాంతాలకు జీవాలను రవాణా చేయడానికి ఈ పద్ధతి చాలా సురక్షితమైనది. ఈ పద్ధతిలో కూడా జీవాలకు కావాల్సిన మేత, నీరు తప్పనిసరిగ్గా అందుబాటులో ఉంచాలి. కానీ, ఈ పద్ధతిలో ఎక్కువ సంఖ్యలో జీవాలను తరలించలేము. అంతేగాక రైల్వేశాఖ వారి జంతుప్రయాణ రవాణా నిబంధనలను విధిగా పాటించాల్సి ఉంటుంది
3. రోడ్డురవాణా వాహనాల ద్వారా : ఈ పద్దతిలో ఎక్కువ సంఖ్యలో జీవాలని తరలించగలము. కానీ, రవాణా వాహనములో ప్రతీ జీవానికి వాటి శరీర బరువు ప్రకారం క్రింది పటంలో తెలిపిన మాదిరి నిర్దేశిత స్థలం ఉండటం తప్పనిసరి. తక్కువ స్థలంలో ఎక్కువ జీవాలను క్రిక్కిరిసినట్టుగా రవాణా చేయకూడదు.
సాధారణంగా జీవాలకు వాహనాల మీద ప్రయాణం చేసే అలవాటు గానీ, అవకాశం గానీ ఉండదు కాబట్టి, రవాణా సమయంలో వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ముఖ్యంగా జీవాలు ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలి. వ్యాధినిరోధకశక్తి తక్కువగా ఉండి రవాణా కారణంగా ఒత్తిడికి గురయ్యే జీవాలు త్వరగా రోగాల బారినపడే అవకాశముంటుంది. కాబట్టి జీవాల రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వాటి రవాణా కోసం సరైన వాహనాన్ని ఎంపిక చేసుకోవడం కూడా కీలకమైన అంశం.
వాహన ఎంపిక :
కేంద్ర మోటారు వాహనముల నిబంధనలు, 1989 సెక్షన్ 125`జు ప్రకారం పశురవాణా కోసం ప్రత్యేకముగా రిజిస్ట్రేషన్ చేయించబడిన వాహనాలలో మాత్రమే జీవాల రవాణా చేయాలి.
రవాణా వాహనం నుండి ప్రయాణ సమయంలో జీవాలు బయటకు ఎగిరి దూకకుండా సరయిన ఏర్పాటు ఉండాలి.
రవాణా వాహనంలో జీవాలకు సరిపడేంత గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
అగ్ని ప్రమాద నివారణ ఏర్పాటు కూడా ఉండాలి.
ప్రాథమిక చికిత్సకు అవసరమయ్యే మందులను రవాణా వాహనంలో ఉంచుకోవాలి.
రవాణా వాహనం శుభ్రంగా ఉండాలి. తరుచుగా జీవాల రవాణా చేసే వాహనాలైతే రవాణా చేసిన ప్రతీసారి క్రిమిసంహారక మందులతో వాహనాన్ని శుభ్రం చేయాలి.
రవాణ వాహనంలో వాటి అడుగున కనీసంగా 5 సెం.మీల మందంతో మెత్తటి వరి గడ్డిని లేదా గోధుమ గడ్డిని వేయాలి.
సాధారణ రవాణా నిబంధనలు:
గొర్రెలను, మేకలను విడివిడిగా వేర్వేరు వాహనాల్లో రవాణా చేయాలి. రెండిరటిని కలిపి (గొర్రెలను, మేకలను) ఒకే వాహనంలో రవాణా చేయకూడదు. ఒకవేళ వాటిసంఖ్య (గొర్రెలు లేదా మేకలు) వాహన పరిమితి కన్నా తక్కువగా ఉన్నట్లయితే గొర్రెలను, మేకలను ఒకేవాహనంలో రవాణా చేయవచ్చును. కానీ, ఆ రెండిరటి మధ్య ఒక విభజన ఉండేలా చూసుకోవాలి.
Also Read: Goat & Sheep Farming Guide: మేకలు, గొర్రెల ఫారం పెట్టుకునే వారికి సూచనలు.!
ప్రయాణ సమయంలో ఈనే అవకాశమున్న నిండు చూడి జీవాలను మరియు ఈని మూడు రోజులు కూడా కాని వాటిని రవాణా చేయకూడదు. ఈ నిబంధన అన్ని రకాల రవాణాకు వర్తిస్తుంది.
అత్యంత వేడి సమయాల్లో గానీ, అత్యంత చల్లని సమయాల్లో గానీ, భారీ వర్షంలో గానీ, ఇతర వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో గానీ జీవాల రవాణా చేయకూడదు. ఈ నిబంధన కాలినడక రవాణాకు, రోడ్డు మార్గ రవాణాకు వర్తిస్తుంది.
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా వున్నప్పుడు కూడా రాత్రివేళల మాత్రమే జీవాల రవాణా చేయాలి. ఈ నిబంధన రోడ్డు మార్గ రవాణాకు మాత్రమే వర్తిస్తుంది.
రవాణా మార్గం దూరంను సాధ్యమైనంత మేర తగ్గించుకోవాలి.
వాహనం స్పీడ్ గంటకి 40 కి.మీ లు మించకూడదు.
సడన్ బ్రేకులు వేయరాదు.
మూల మలుపులు, స్పీడ్ బ్రేకర్ల వద్ద జీవాలు ఒకదానిపై ఒకటి పడకుండా చూసుకోవాలి. అందుకు గాను జీవాలతోపాటుగా ఒక వ్యక్తి వాహనము లోపలే ఉండి అవి ఒకదానిపై ఒకటి పడకుండా చూసుకోవాలి.
రోడ్డు మార్గం ద్వారా రవాణా చేస్తున్నపుడు రవాణాకి పట్టే సమయాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ప్రతీ 6`8 గంటలకి ఒకసారి జీవాలకు విశ్రాంతిని ఇవ్వాలి లేదా కిందకి దించాలి.
మధ్య మధ్యలో మేత, నీరు అందించే ఏర్పాటు చూసుకోవాలి.
జీవాలని రవాణా చేసే ముందు కింద తెలిపిన సర్టిఫికేట్స్‌ను సంబంధిత అధికారుల నుండి సేకరించుకోవాలి. అది తప్పనిసరి కూడా అని గుర్తుంచుకోవాలి మరియు వాటిని రవాణా వాహనంతో పాటే ఉంచాలి కూడా. అప్పుడే రవాణాలో (ముఖ్యంగా చెక్‌పోస్టుల వద్ద నుండి) ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించగలుగుతాము.
1. జీవాల కొనుగోలు ` అమ్మకం రశీదు: ఈ రశీదును స్థానిక పశువుల సంత నుండి లేదా గ్రామపంచాయతీ నుండి తీసుకోవాలి. ఇందులో అమ్మినవారి, కొన్నవారి పూర్తి వివరాలు, జీవాలను కొన్న తేది మరియు జీవాల పూర్తి వివరాలు ఉండేలా చూసుకోవాలి. జీవాలను ఏ పద్ధతిలో రవాణా చేసినా కూడా ఈ రశీదు తప్పనిసరి.
2. జీవాల వయస్సు, ఆరోగ్యం, విలువ సర్టిఫికేట్ : ఈ సర్టిఫికేట్‌ను జీవాలను కొనుగోలు చేసిన ప్రాంత పశువైద్యాధికారి నుండి నిర్దేశిత నమూనాలో తీసుకోవాలి లేదా జీవాల కొనుగోలు కోసం మన ప్రాంత పశువైద్యాధికారిని అధికారికంగా వెంట తీసుకెళ్ళినట్లైతే మన పశువైద్యాధికారి ద్వారా మాత్రమే ఈ సర్టిఫికేట్‌ను తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్‌లో రవాణా చేయబడుతున్న జీవాల వయస్సు, వాటి ఆరోగ్యస్థితి, వాటి మార్కెట్ విలువతో పాటు ఆయా జీవాలు ప్రయాణానికి శారీరకంగా సరిగ్గా ఉన్నాయనే విషయాన్ని స్షష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. జీవాలను ఏ పద్ధతిలో రవాణా చేసినా కూడా ఈ రశీదు తప్పనిసరి.
3. రవాణా సర్టిఫికెేట్ : ఈ సర్టిఫికేట్‌ను కూడా జీవాలను కొనుగోలు చేసిన ప్రాంత పశువైద్యాధికారి నుండి నిర్దేశిత నమూనాలో తీసుకోవాలి లేదా జీవాల కొనుగోలు కోసం మన ప్రాంత పశువైద్యాధికారిని అధికారికంగా వెంట తీసుకెళ్ళినట్లైతే మన పశువైద్యాధికారి ద్వారా మాత్రమే ఈ సర్టిఫికేట్‌ను తీసుకోవాలి.
ఈ సర్టిఫికేట్‌లో ఏ వాహనంలో ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి ఎవరికి చెందిన జీవాలను రవాణా చేస్తున్నారో స్పష్టంగా రాయాలి. వాహనం రిజిష్ట్రేషన్ నెంబరు, జీవాల విలువతో పాటుగా రవాణా చేయబడుతున్న ఆడజీవాల సంఖ్యని, మగజీవాల సంఖ్యని, వాటి జాతిని మరియు ఇతర గుర్తింపు లక్షణాలని కూడా రాయాలి. కాలినడకన జీవాలను తీసుకెళ్ళేవారు కూడా అందుకు అనుగుణంగా ఈ సర్టిఫికేట్‌ను తీసుకోవాలి.
రవాణా భీమా మరియు జీవాల జీవిత భీమా : జీవాలను సుదూరప్రాంతాల నుండి రవాణా చేయాల్సి వస్తే (ఉదా : రాజస్థాన్ నుండి తెలుగు రాష్ట్రాలకి), అనుకోకుండా దారిలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆర్ధికనష్టం జరగకుండా రవాణా భీమా చేయించుకోవడం మంచిది. రవాణా భీమాతో పాటుగా జీవాలకు జీవిత భీమా కూడా చేయించుకున్నట్లయితే సాంఘిక భద్రత ఉంటుంది. అటువంటి సందర్భంలో జీవాలను రవాణా వాహనంలోకి ఎక్కించే ముందే జీవాల చెవులకు గుర్తింపు బిళ్లలను వేయించుకోవాలి. చెవులకు గుర్తింపు బిళ్లలను వేయడం వలన ధనుర్వాతము సోకే ప్రమాదముంటుంది. కాబట్టి, ఆ జీవాలకు గుర్తింపు బిళ్లలు వేసే సమయంలో టెటనస్ యాంటీటాక్సిన్ ఇప్పించుకోవాలి. ఇది తప్పనిసరి కూడా.
జంతుసంక్షేమ చట్టాలు, నిబంధనలు: రవాణా పద్ధతి ఏదైనా కూడా వాటి ప్రయాణ దూరము 5 కిలోమీటర్లు మించినట్లయితే లేదా ప్రయాణ సమయము 6 గంటలు మించితే జంతు సంక్షేమ చట్టాలను, సంబంధిత నిబంధనలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. లేనట్లయితే దారిలో అంతర రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి జిల్లా పశువైద్యాధికారి నుండి ఒక ధృవీకరణ పత్రం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఇతర వివరాలను స్థానిక పశువైద్యాధికారి నుండి ముందుగానే సేకరించుకోవాలి.
జీవాలను రవాణా వాహనంలోకి ఎక్కించడానికి తగు ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా జీవాలు గమ్యస్థానం చేరాక వాటిని జాగ్రత్తగా కిందికి దించడానికి కావాల్సిన ఏర్పాట్లు సరిగ్గా లేనట్లయితే గాయాలు అవ్వడం లేదా కాళ్లు విరగడం లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
ముఖ్య గమనిక : జీవాలకు షిప్పింగ్ ఫీవర్ (ప్రయాణ జ్వరము) రాకుండా తగు నివారణ మందులను జీవాల రవాణాకు ముందు మరియు తరువాత (జీవాలు ఫారంకి రాగానే) జీవాలకు అందించాలి. లేనట్లయితే దూరప్రాంతాల నుండి రెండు అంతకంటే ఎక్కువ రోజుల ప్రయాణంతో వచ్చే జీవాలు, అవి వచ్చిన వారం తరువాత నుండి షిప్పింగ్ ఫీవర్‌తో బాధపడతాయి. ఈ వ్యాధితో ఎక్కువ సంఖ్యలో జీవాలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి స్థానిక పశువైద్యాధికారి సలహా, సూచనలు తీసుకోవాలి.
ఈ విషయంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల జీవాలను తీసుకువచ్చిన 7`28 రోజుల లోపు సగానికి పైగా జీవాలు చనిపోయి భారీగా నష్టపోయినవారి సంఖ్య కూడా ఎక్కువే.
Also Read: Sheep Farming: గొర్రెల పెంపకం.!