నవంబర్ 27- 29 వరకు హైదరాబాద్ లో అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన
మనదేశంలో గ్రామీణ ఉపాధి, పౌష్టికాహార పంపిణీల్లో పౌల్ట్రీ రంగం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ రంగం ప్రాధాన్యం తెలియజేసేలా హైదరాబాద్ లోని హైటెక్స్ లో నవంబర్ 27 నుంచి 29 వరకు 16వ అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన నిర్వహించబోతున్నారు. పౌల్ట్రీ ఇండియా, భారతీయ పౌల్ట్రీ పరికరాల తయారీదారుల సంఘం (ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరగనుంది. ఇది దక్షిణాసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ ప్రదర్శనగా చెబుతున్నారు.
ఈ సందర్బంగా నవంబర్ 26న నోవాటెల్ (ఎచ్ఐసీసీ) హైదరాబాద్ లో నిర్వహించే సాంకేతిక సెమినార్ లో పౌల్ట్రీ ఉత్పత్తి రంగంలో వస్తున్న కొత్త సాంకేతిక ఆవిష్కరణలు, వ్యాపార అవకాశాలు, దాణా గురించిన పరిజ్ఞానం, కోళ్ల పోషణలో వస్తున్న మార్పులు, పౌల్ట్రీ పరిశ్రమ భవిష్యత్తు వగైరా అంశాలకు సంబంధించిన సమాచారం ఈ ప్రదర్శనలో ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. పౌల్ట్రీ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అండగా నిలవాలని, పరిశ్రమ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని, రుణపరిమితిని పెంచాలని, దేశవ్యాప్తంగా పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్నభోజన పథకంలో గుడ్డును చేర్చాలని శుక్రవారం (నవంబర్ 8 న) హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న పౌల్ట్రీ ఇండియా, ఐసీఈఎంఏ, పౌల్ట్రీ సమాఖ్య, నెక్, వెంకటేశ్వర హేచరీస్ ప్రతినిధులు కోరారు.