Infectious Bursal Disease in Chickens: ఈ వ్యాధిని గంబోరో వ్యాధి అని కూడా పిలుస్తుంటారు. బ్రూడింగ్ మరియు గ్రోయర్ కోళ్ళలో వైరస్ మూలంగా కలుగు ఒక తీవ్రమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఫారములోని అన్ని కోళ్ళకు వ్యాపించే గుణం ఉన్నప్పటికీ, మోర్టాలిటీ తక్కువగా ఉంటుంది. ఈ వ్యాధిలో బర్సా అవయవము మొదట్లో పెరిగి ఉండి, తరువాత పూర్తిగా కుషించుకొని పోయి ఉంటుంది.ఈ వ్యాధి ప్రపంచంలోని చాలా దేశాలలో విస్తరించి ఉంది. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాలలో ఈ వ్యాధిని గుర్తించుట జరిగినది. ఈ వ్యాధి ఎక్కువగా 3-6 వారాల లోపు వయస్సు గల పక్షులలో వస్తుంది.
ఈ వ్యాధి బిర్నా విరిడే కుటుంబానికి చెందిన బిర్నా వైరస్ వలన కలుగుతుంది. ఇది ఒక ఆర్.ఎన్.ఏ. డబుల్ స్టాండర్డ్ వైరస్.యుక్త వయస్సులో వున్న కోడి పిల్లలు అంటే 2-3 వారాల లోపు గల కోడి పిల్లలు, బ్రాయిలర్స్ మరియు లేయర్ కోళ్ళు ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటాయి. ఈ వ్యాధి గినీ కోళ్ళు, కౌజులు మరియు పావురాలలో కూడా అప్పుడప్పుడు కలుగుతుంటుంది.ఈ వ్యాధి ఒక సారి వచ్చినట్లైతే, వ్యాధి కారక వైరస్ చాలా రోజుల వరకు ఫారములలో నిలువ ఉంటుంది. వ్యాధి కారక క్రిమితో కలుషితమైన ఆహారాన్ని ఆరోగ్యవంతమైన పక్షులు నోటితో తీసుకోవడం ద్వారా లేదా కోళ్ళు ఒకదానికి ఒకటి తాకడం ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. క్యారియర్ పక్షుల ద్వారా కూడా ఈ వ్యాధివ్యాపిస్తుంటుంది.
వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- వైరస్ తో కలుషితమైన ఆహారాన్ని ఆరోగ్యంగా ఉన్న కోళ్ళు తీసుకోవడం ద్వారా, వైరస్ ఆరోగ్యవంతమైన కోడి పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ బర్సాలోని లింఫాయిడ్ కణాలను (బి లింఫోసైట్ మరియు టి లింఫోసైట్ కణాలు) అధికంగా విచ్చిన్నం చేయుట వలన, వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా ఈ కోళ్ళలో టీకాలు పనిచేయకపోవడం, ఇతర వ్యాధుల బారిన సులువుగా పడటం జరుగుతుంది. ఈ కోళ్ళలో పెరుగుదల మరియు ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వ్యాధిలో క్లాటింగ్ ప్యాక్టర్స్లో లోపాలు ఏర్పడి, రక్తం గడ్డకట్టకపోవుట వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి.
Also Read: Sprinkler Irrigation: స్ప్రింక్లర్ పద్ధతి తో కరువు ప్రాంతాల్లో నీటి ఆదా

Infectious Bursal Disease in Chickens
వ్యాధి లక్షణాలు:- ఫారమ్ లోని కోళ్ళు ఉన్నట్టుండి చనిపోతుంటాయి. కోళ్ళు చాలా నీరసంగా ఉంటాయి. నడకలో తడబాటు ఉంటుంది. డయేరియా ఉంటుంది. మోర్టాలిటీ సుమారు 20-30 శాతం వరకు ఉండవచ్చు. కోళ్ళ పెరుగుదలలో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యాధి మూలంగా వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా కోళ్ళు సులువుగా ఇతర వ్యాధుల బారిన పడుతుంటాయి.వ్యాధి మొదటి దశలో క్లోయేకల్ బర్సా పరిమాణం పెరిగి, ఎడిమాటస్ , పసుపు వర్ణంలో ఉంటుంది.
కొన్ని సార్లు బర్సా ఫాలికల్లో రక్తపు చారలు కూడా ఉంటాయి. వ్యాధి గడిచే కొలది బర్సా పరిమాణం తగ్గుతూ, చివరకు పూర్తిగా కుషించుకొని పోయి ఉంటుంది. పెక్టోరల్, తొడ మరియు కాలి కండరాలలో కంటేషన్ మరియు హిమోరేజేస్ ఉండుట ఈ వ్యాధి ప్రత్యేకత. గిజ్జర్డ్ మరియు ప్రావెంట్రిక్యులస్ ప్రాంతములో ప్యాచి హిమోరేజెస్ను గుర్తించవచ్చు. మూత్ర పిండాల పరిమాణం పెరిగి, యూరేట్ క్రిస్టల్స్‌తో నిండి ఉంటాయి. వ్యాధి చరిత్ర, పైన వివరించిన లక్షణాలు, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా ఈ వ్యాధిని కొంత వరకు ఊహించవచ్చు. ఆగారెల్ డిఫ్యూజన్ పరీక్ష, ఎలిసా పరీక్ష, వైరస్ న్యూటలైజేషన్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఈ వ్యాధిని ఐ.బి, ఐ.బి.హెచ్, విటమిన్ ఏ లోపం, విజరల్ గౌట్ వంటి వ్యాధులతో సరిపోల్చుకొనవలసి ఉంటుంది.
చికిత్స:- ఇది ఒక వైరల్ వ్యాధి కనుక, ఈ వ్యాధికి ఎటువంటి చికిత్సా లేదు. డీ హైడ్రేషన్ సరిచేయుటకు ఎలక్ట్రాల్ పౌడర్స్‌ను నీటి ద్వారా అందించవలసి ఉంటుంది. సేకండరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏదేని ఒక అంటీ బయోటిక్ ఔషధమును నీటి ద్వారా ఇవ్వవలసి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు విటమిన్ ఇ, సెలినియం, విటమిన్ ఏ, విటమిన్ సి వంటివి ఇవ్వవలసి ఉంటుంది.ఫారమ్‌లో బయోసెక్యూరిటీ ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి. ఫారమ్ పరిశుభ్రత విషయములో రాజీ. పడకూడదు. వ్యాధి బారిన పడిన కోళ్ళను గుర్తించి, ఎప్పటికప్పుడు వధించి, పూడ్చిపెట్టాలి. లిట్టర్ యాజమాన్యం బాగా ఉండాలి.
Also Read: Infectious Bronchitis in Chickens: కోళ్ళలో ఇన్ ఫెక్ష్యూయస్ బ్రాంకైటిస్ వ్యాధి ఎలా వస్తుంది.!