ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతున్న గొర్రె, మేక మాంసం ధరల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో జీవాల పెంపకం రోజురోజుకీి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అందుకు అనుగుణంగా ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశ్యంతో జీరో గ్రేజింగ్ పద్ధతిలో శాస్త్రీయంగా గొర్రెల, మేకల పోషణ చేయాలనుకునేవారికి 10 నుండి 50 లక్షల సబ్సిడీని కూడా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. జీవాల పెంపకంలో రెండు రకాల ఆదాయ మార్గాలు ఉంటాయి. మందలో పుట్టిన పిల్లలను 5 లేదా 6 వయస్సులలో మాంసం కోసం కోతకు అమ్మడం అనేది ఆదాయవనరు. అదే ప్రధాన ఆదాయ వనరు కూడా. మరియు జీవాల నుండి లభించే పేడను ఎరువుగా అమ్మడం ద్వారా కొద్ది మొత్తంలో ఆదాయం లభిస్తుంది. దీనిని రెండవ ఆదాయ వనరుగా పరిగణిస్తారు.
మందలో పుట్టిన పిల్లలలో వాటిజాతి లక్షణాలను బట్టి మొదటి ఆరు నెలల వయస్సులో అత్యధిక పెరుగుదలను గమనించవచ్చును. అంతేకాక మొదటి మూడు నెలలలో రోజువారీ పెరుగుదల తరువాతి మూడు నెలలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు నెల్లూరుజాతి గొర్రె పిల్లలు సరాసరిగా 175 ` 200 ల గ్రాముల రోజువారీ పెరుగుదలకు దోహదపడే జన్యుపరమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. కానీ, పిల్లలలో రోజువారీ పెరుగుదల వాటి జాతిలక్షణాలతో పాటుగా వాటికి లభించే పోషకాహారంపై కూడా ప్రధానంగా ఆధారపడి
ఉంటుంది అన్న విషయాన్ని సాంప్రదాయ గొర్రెల పెంపకందారులతోపాటుగా నూతన జీవాల పెంపకందారులు కూడా తెలిసో తెలియకో విస్మరిస్తారు. దాని కారణంగా వాటిలో సరిగ్గా పెరుగుదల లేక రోగనిరోధక శక్తి తగ్గిపోయి మరణాలు కూడా సంభవిస్తాయి.
మన రాష్ట్రంలో ఉన్న జీవాలలో ఎక్కువ శాతం నెల్లూరు మిశ్రమ జాతి గొర్రెలే. వాటిల్లో 95 శాతానికి పైగా సాంప్రదాయ కులవృత్తివారే పెంచుతుంటారు. అది కూడా విస్తృత మేపు పద్దతిలో. పుట్టిన నెల వయస్సు నుండే పిల్లలను కూడా తల్లులతో పాటుగా మేపుకోసం బయటకు తీసుకువెళుతుంటారు. కానీ, విస్తృత మేపు పద్ధతిలో సరైన సంపూర్ణ పోషకాహారం లభించని కారణంగా పిల్లలలో రోజువారీ పెరుగుదల 100 గ్రాములకు మించడం లేదు. కానీ, ఇవే పిల్లలను మేపు కోసం బయటకు పంపకుండా, పుట్టిన మొదటి రోజునుండి మొదలుకొని 150 రోజుల వయస్సు వచ్చే వరకు సమతుల్యమైన సంపూర్ణ ఆహారమును కావాల్సిన పరిమాణంలో షెడ్లలోనే అందించగలిగితే వాటి నుండి రావాల్సినంత రోజువారీ పెరుగుదలను అంటే కనీసంగా రోజుకి 175 గ్రాములకు తగ్గకుండా పొందవచ్చును.
క్రింద తెలిపిన విధంగా పిల్లలు పుట్టిన మొదటి రోజు నుండి 20 వారాల వయస్సు వచ్చేంత వరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, టి.ఎం.ఆర్‌ను నిర్దేశిత పరిమాణంలో అందించగలిగితే పుట్టిన పిల్లలలో తగినంత పెరుగుదల వస్తుంది. 5 లేదా 6 నెలల వయస్సుల్లోనే పిల్లలు 28 నుండి 30 కిలోల బరువు పెరుగుతాయి. తద్వారా వాటిని త్వరగా కోతకు అమ్ముకోవడం వలన త్వరితంగా ఆదాయం పొందవచ్చును. అంతేకాక వాటిల్లో మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించగలము.
వివిధ దశలలో అందించాల్సిన పోషణ వివరములు
పుట్టిన మొదటి 3 రోజులు
తల్లితోపాటు వెచ్చని వాతావరణంలో ఉంచాలి మరియు పిల్ల శరీర బరువులో 20 శాతం జున్నుపాలు ప్రతీ రోజు అందించాలి.
మొదటి రెండువారాలు
పిల్లలను పూర్తిగా తల్లిపాలమీదనే ఉంచాలి. పుట్టిన పిల్ల శరీర బరువు 3 కిలోలు ఉన్నట్లయితే రోజుకి 600 మిల్లి లీటర్ల పాలు అవసరం అవుతాయి. ఒకవేళ తల్లివద్ద సరిపడనంత పాలు లేనట్లయితే ఆవు లేదా గేదె పాలను అదనంగా తాగిపించాలి. 2
మూడవ వారం నుండి 7 వారాల వయస్సు వరకు
తల్లిపాలతో పాటుగా క్రీపు దాణా అందించాలి. క్రీపు దాణా అంటే అత్యధిక పోషక విలువలు కలిగి (18`20 శాతం మాంసకృత్తులు, 70 శాతం జీర్ణమగు పోషకాలు) సులువుగా జీర్ణమయ్యే సమతుల్య ఆహారము. క్రీపు దాణాను క్రింద తెలిపిన మాదిరిగా గొర్రెల పెంపకందారులే తయారుచేసుకోవచ్చు. క్రీపు దాణాను పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా ప్రతీరోజు అందించాలి. 7 వారాల వయస్సు దాటే సరికి పిల్లలు కనీసంగా 12 కిలోల బరువు తూగుతాయి.
Also Read: అమృతాన్ని తలపించే .. రాజానగరం సీతాఫలం.!
8వ వారం నుండి 20వ వారం వరకు
ఈ వయస్సులో పెరిగే పిల్లల మేతను టి.ఎం.ఆర్ (టోటల్ మిక్స్‌డ్ రేషన్) రూపంలో అందించాలి. ఈ టి.ఎం.ఆర్ ను కూడా గొర్రెల పెంపకందారులు స్వయంగా తయారుచేసుకోవచ్చును. లేదా మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. టి.ఎం.ఆర్ తో పాటుగా ఎల్లవేళల పరిశుభ్రమైన త్రాగునీరు అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం.
క్రీపు దాణా నమూనా ఫార్ములా:
1. నలగగొట్టిన మొక్కజొన్నలు 40 కిలోలు
2. తవుడు 20 కిలోలు
3. నూనె తీసిన చెక్క 30 కిలోలు
4. పప్పులపరం 7 కిలోలు
5. ఉప్పు 1 కిలో
6. లవణ మిశ్రమం 2 కిలోలు
టి.ఎం.ఆర్ (టోటల్ మిక్స్‌డ్ రేషన్) నమూనా ఫార్ములా:
1. నూనె లేదా పప్పుదినుసుల పంటమిగుల్లు , ఉదా: వేరుశెనగచెత్త లేదా మినపచెత్త ` 50 కిలోలు
2. నలగగొట్టిన మొక్కజొన్నలు 20 కిలోలు
3. తవుడు 10 కిలోలు
4. నూనె తీసిన చెక్క 10 కిలోలు
5. పప్పులపరం 7 కిలోలు
6. ఉప్పు 1 కిలో
7. లవణ మిశ్రమం 2 కిలోలు
గమనిక: స్థానిక పశువైద్యాధికారి సలహామేరకు స్థానికంగా చవకగా దొరికే పప్పు లేదా నూనెదినుసుల పంటమిగుళ్లతో మరియు మేతదినుసులతో టి.ఎం.ఆర్ తయారుచేసుకోవాలి.