Reducing Dairy Production Costs: వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తుంది పశుపోషణ. పెరుగుతున్న పాల అవసరాలు, డిమాండ్ కు తగ్గట్టుగా పాడి రైతులు పోషణ చేపట్టి పాల సిరులను కురిపించుకుంటున్నారు. పెరుగుతున్న దాణా ధరలు, పెట్టుబడులను అధికమించడం కోసం వాణిజ్య స్థాయిలో సంకరజాతి పశువులతో పోషణ చేపడుతున్నారు.డైరీ ఫారాలు ఏర్పాటు చేసుకున్న రైతులు పదుల నుంచి వందల సంఖ్యలో గేదెలను పోషిస్తారు. నానాటికీ పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయం, కూలీల కొరత పాడి రైతులకు ప్రధాన అవరోధంగా మారింది. గత కొన్ని ఏడాదులుగా తెలుగు రాష్ట్ర ప్రజలు పాడి పరిశ్రమలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలో కూలీల కొరత మరింత పెరిగింది. మరో పక్క ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ శ్రమతో, కూలీలపై ఎక్కువగా ఆధారపడకుండా డైరీని ఏలా నిర్వహించుకోవాలో తెలుసుకుందాం.
పరిశ్రమ లాభసాటిగా ముందుకు నడవాలి అంటే మేలు జాతి పశువులను ఎంపిక చేసుకోవడం, ఆ పశువుల శరీర సౌష్టవం, పాల దిగబడి సామర్ధ్యం, ఈతల సంఖ్య , పశువుల ఆరోగ్యం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.ప్రస్తుత కాలంలో కూలీల కొరత పాడి పరిశ్రమకు దినదిన గండంగా మారింది.పాకలను శుభ్రం చేయటం మొదలుకొని పాలు పితకడం వరకు పెంపకం దారులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో నిర్వహణ భారాన్ని కొంత వరకు తగ్గించుకునే మార్గాలపై పాడి రైతుల అడుగులు పడుతున్నాయి.
ముందుగా పశువుల సంఖ్య కుదింపు :
•పాలల్లో లాభదాయక స్థాయిలో పాలు ఇచ్చే పశువులను ఉంచి ముసలి, గొడ్డుబోతు, మగ దూడలను ఎప్పటికప్పడు వదిలించుకోవాలి. ఇలాంటి పశువులను సకాలంలో వదిలించుకోవడం ద్వారా ఆదా అయిన వనరులను ఎక్కువ పాల ఉత్పత్తి సామార్ద్యం ఉన్న పశువులకు బదిలీ చేస్తే పాడి పరిశ్రమలో అధిక లాభాలు పొందవచ్చు.
• మగ గేదె దూడలకు మంచి పోషణ అంది రెండు ఏళ్ళ వయస్సుకు బలిష్టంగా అయి మంచి ధర పలుకుతాయి. పని వారు లేకపోవడంతో చాలామంది పాడి రైతులు పాలు పితకడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారు దూడలు, పడ్డలు, చూడి పశువుల పెంపకాన్ని చేపట్టి మేలైన ఆదాయాన్ని పొందవచ్చు. వీటి నిర్వాహణ కోసం వెచ్చించే శ్రమ పాలిచ్చే పశువులతో పోలిస్తే మూడవ వంతు కూడా ఉండదు. అంటే 3 పాలిచ్చే పశువులకి వెచ్చించే శ్రమతో 10 కి పైగా ఒట్టిపోయిన పశువులను తేలికగా పెంచవచ్చు.
•రెండు పూటల పాలు పితికి విక్రయిస్తే వచ్చే ఆదాయం కన్నా దూడలను, పడ్డలను, దున్నకుర్రలను , చూడి పశువులను బాగా పోషించి విక్రయిస్తే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. పట్టణాలకు, నగరాలకు దూరంగా ఉంటూ పాల విక్రయంలో సమస్య వున్న పశు పోషకులకు పాల ఉత్పత్తి కంటే పశువుల పెంపకం లాభదాయకంగా ఉంటుంది.
Also Read: Milking Machines Benefits: పాలు పితికే యంత్రాల వాడకం ప్రయోజనాలు.!
కొట్టాలు, పాకల నిర్మాణం:
పాడి రైతులు ఇంటికి సమీపంలోనే కొట్టాలు, పాకలు నిర్మించుకోవాలి. ఈ కొట్టాలు, పాకలలో నేలను కాంక్రీట్ తో తగినంత వాలుతో ఏర్పాటు చేయాలి. దీంతో మల ముత్రాలు సులువుగా కాల్వలోకి చేరుతాయి. శుభ్రత సులభం అవుతుంది. పశువులు తిరిగేందుకు విశాల ఆవరణం ఉంచుకొని పాకను మాత్రం పరిమిత విస్తీర్ణం నిర్మించుకోవాలి. ఎండ ,చలి, వర్షాలు ఉన్నప్పుడే పశువులను పాకలో ఉంచుతూ మిగతా సమయంలో ఆవరణం తిరుగాడెలా చూడాలి. ఈ ఏర్పాటుతో పాకలను రెండు రోజులకు ఒకసారి శుభ్రం చేసిన సరిపోతుంది.
పాకల శుభ్రత :
చేతులు, చీపుర్లు, బకెట్లు, మగ్గులు, తట్టల స్థానంలో రబ్బరు దంతెలు, రబ్బరు మాట్స్ , బలమైన నీటి ధారను ఇచ్చే జెట్ నాజిల్స్ కలిగిన రబ్బరు పైపులు, నీటి పంపులను వినియోగించి పశువులను, పాకలను వేగంగా, సులువుగా శుభ్రపరవచ్చు. పశువుల మేతలు, దాణాలు, వ్యర్థాలు ట్రాలిలతో సులువుగా తరలించేలా ఆవరణలో మెట్లు, ఇతర అడ్డంకులు లేకుండా చేస్తే నిర్వహణ సులువు అవుతుంది.
గడ్డి కోత యంత్రాల వాడకం:
గడ్డి కోత యంత్రాల వాడకంతో పశుగ్రాసాలను చిన్న, చిన్న ముక్కలుగా కత్తిరించి మేపితే గ్రాసం వృథా కాదు. పశువులు మంచిగా తిని జీర్ణించుకుంటాయి. రెండు నుండి ఎనిమిది పశువులు కలిగిన రైతులు సైతం విద్యుత్ తో నడిచే గడ్డి కోత యంత్రాలను వినియోగించాలి.
పాలు పిండే యాంత్రాల వాడకం :
పాడి పశువుల నుండి పాలు మిల్కింగ్ మిషన్స్ ద్వారా తీయటం వలన పాలు శుభ్రంగా ఉంటాయి. పేడ తీసే యంత్రాలు కూడా ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి.
సంయుక్త టీకాల వినియోగం:
గురక, జబ్బవాపు, గాలికుంటు వంటి అంటు వ్యాధులకు నివారణకు వేరు, వేరు టీకాలు వేయించి పశువులను ఒత్తిడి, చిరాకుకు గురిచేయడం కంటే రెండు, మూడు వ్యాధులను ఏక కాలంలో నివారించగల సంయుక్త టీకాలను ఒక ప్రాంతంలో ఎక్కువ పశువులకు వేయించి ఖర్చును తగ్గించుకోవచ్చు.
అజోల్లా, హైడ్రోపొనిక్ గ్రాసాల సాగు:
పచ్చి మేతల కొరతను తీర్చేందుకు సాధారణంగా రైతులు దాణాలపై ఆధార పడుతూ ఉంటారు. దీంతో మేత ఖర్చులు పెరిగిపోతాయి. అజోల్లా అనే ఆకుతో పచ్చి మేతలను భర్తీ చేసే అవకాశం కలదు.అజోల్లాను రైతులు సులువుగా, కొద్దిపాటి స్థలంలోనే తమ ఇంటి దగ్గరే పెంచ్చుకోవచ్చు. అలాగే హైడ్రోపొనిక్ గ్రాసాన్ని రైతులు ఇంటి ఆవరణలో లేదా డాబాలపై పెంచ్చుకోవచ్చు. కేవలం 500-1000 చదరపు అడుగుల స్థలంలో అరలలో అమర్చిన ప్లాస్టిక్ ట్రై లలో 7-10 రోజులలో పెంచవచ్చు.
8-10 అంగుళాల ఎత్తు పెరిగిన శుభ్రమైన, పుష్టికరమైన మొక్కజొన్న మొలకలను రోజుక 8-10 కిలోలు ఒక్కొక్క పశువుకు వరిగడ్డితో పాటు మేపితె రైతుకు సమయం, శ్రమ ఆదా అవుతుంది. cc కేమెరాలను వినియోగించి యజమానులు తమ ఇంటి నుంచే షేడ్స్ లోని పశువుల కదలికను గమనించవచ్చు. దూరంగా ఉన్న పశు వైద్యునికి స్మార్ట్ ఫోన్ ద్వారా పశువును చూపించి అవసరమైన సేవలను క్షణాల్లో పొందవచ్చు.
ఇలాంటి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని పాడి రైతులు ఉపయోగించుకుంటే తక్కువ శ్రమతో ఇప్పటికన్నా రెండు, మూడు పశువులను కూలీల అవసరం లేకుండానే చేపట్టవచ్చు.
Also Read: List of Banned Pesticides: భారత దేశంలో నిషేధించబడిన క్రిమిసంహారక మరియు శిలీంద్ర నాశక మందులు