Nematode Control in Calves: నేటి లేగ దూడలె రేపటి మంచి పాడి పశువులు అన్న విషయంను పాడి రైతులు అందరూ గుర్తుంచుకోవాలి. దూడల పెంపకంలో పాడి రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. పాల ద్వారా వచ్చే ఆదాయంతో పోలిస్తే మన మందలో పుట్టిన దూడ పాడి పశువుగా ఎదిగితే వచ్చే లాభమే అధికం.ఏటా వేలకు వేలు పోసి పాడి పశువులు కొనే కన్నా మందలో పుట్టిన దూడలకు మంచి పోషణ చేపట్టి వాటి ఆరోగ్య పరిరక్షలో జాగ్రత్తలు తీసుకుంటే అవి మంచి పాడి పశువులు గా ఎదిగి, పాడి పరిశ్రమను లాభాల బాటలో పయనించెలా చేస్తాయి. 30% దూడలు పుట్టిన 3 నెలల లోనే మరణిస్తున్నాయి. దీనికి కారణం దూడలు బలహీనంగా పుట్టడం, ఏలికపాములు,వ్యాధుల బారిన పడటమే ఇందుకు కారణం. కాబట్టి లేగ దూడల ఆరోగ్యం పట్ల పాడి రైతులు శ్రద్ధ వహించాలి.
దూడలలో వ్యాధులు వ్యాపించకుండా టీకా మందులే కాదు పొట్టలో ఏలికపాములు రాకుండా ముందులు ఇప్పించాలి. ఏలికపాములు దూడల శరీరంలో పోషకాలను సంగ్రహించడమే కాదు పారుడు వ్యాధిని కూడా కలుగజేస్తాయి. కాబట్టి ఏలికపాములు నివారణకు ఎప్పటికప్పుడు సిఫారసు చేసిన వ్యవధిలో మందులు తాగించాలి.
Also Read: Pregnancy Tests in Cattle: పాడి పశువుల చూడి నిర్ధారణ
దూడల పెంపకంలో అతి ముఖ్యమైనది నట్టల నివారణ. దూడల మరణాలలో 30% మరణాలు ఈ నట్టల వలనే జరుగుతున్నాయి. ఈ నట్టల నివారణ సక్రమంగా చేయడం వలన దూడలను పూర్తీగా ఈ ఏలికపాములు నుండి కాపాడుకునే అవకాశం కలదు. అయితే దూడలకు ఈ నట్టలు ఏలా సోకుతాయి అని రైతులకు అవగాహన ఉండాలి. తల్లి కడుపులో ఉన్నప్పుడు రక్తం ద్వారా ఈ నట్టల గ్రుడ్లు దూడలకు వచ్చే అవకాశం కలదు. వేరే దూడల కడుపులో ఈ నట్టల గ్రుడ్లు ఉన్నప్పుడు అవి విసర్జించిన దానిని వేరే క్రొత్త దూడ నాకినప్పుడు క్రొత్త దూడ శరీరంలోకి ఈ నట్టల గ్రుడ్లు ప్రవేశిస్తాయి. తల్లి కడుపు నుండి దూడలకు సోకుతుంది కాబట్టి డూడలు పుట్టిన 10 రోజులకు తప్పనిసరిగా ఈ నట్టల నివారణ చేయించాలి.
• పుట్టిన 10 రోజులప్పుడు కిలో బరువుకు 200 మిల్లీ గ్రాముల పైపర్ జిన్ ఎడిపేట్ అనే మందును దూడలకు త్రాగించడం వలన ఈ నట్టల గ్రుడ్లు అదేవిధంగా పెద్ద నట్టలు ఉన్నా పూర్తిగా చనిపోవడం జరుగతుంది.
• తరువాత ప్రతి 15 రోజులకు ఒకసారి 3 నెలలు వరకు ఈ నట్టల నివారణ మందులు ఇవ్వాలి. ఈ పైపర్ జిన్ తో పాటు కొన్ని సందర్భాల్లో క్రొత్త రకం మందులైన ఐవర్ మెక్టిన్ అనే మందును చర్మంలోకి 1 ml సబ్ కట్ ఇవ్వడం ద్వారా కూడా నట్టలను పూర్తీగా నిర్మూలించవచ్చు. ఈ ఐవర్ మెక్టిన్ ఇవ్వటం వలన ఏలికపాములు నివారించడమే కాకుండా దూడలలో ఉన్న పేలు, గోమర్లను కూడా ఈ ఐవర్ మెక్టిన్ చంపేస్తుంది.
• 3 నెలలు తరువాత 6 నెలలు వరకు ప్రతి నెలకు ఒకసారి ఈ నట్టల నివారణ మందు తాగించాలి.
• అయితే 3 నెలలు తరువాత దూడలలో బద్దె పురుగులు వచ్చే అవకాశం కూడా కలదు. ఈ బద్దె పురుగులనే టేప్ వార్మ్స్ అని కూడా అంటారు. ఈ బద్దె పురుగులు, ఏలికపాములు దూడ శరిరంలో పోషకాలు తీసుకోవడం వలన, దూడ నీరశించి , శక్తి లేకుడా అయి పారుకుంటుంది. ఏలికపాములోని టాక్సిన్స్ దూడ శరీరంలోకి ఎక్కువగా విడుదల అయితే దూడలలో నరాలకు సంబంధంచిన రోగాలు వచ్చి చనిపోవడం జరుగుతుంది. కొన్ని సార్లు ఎక్కువగా పారి పోషక లోపం తో చనిపోవడం జరుగుతుంది.
• 3 నెలల తరువాత మనం తాపే మందులలో ఆల్ బెండజోల్ గాని,ఆల్ బెండజోల్ + నిక్లోజమైడ్ గాని, పెన్ బెందజోల్ కాంబినేషన్ లో తాపడం వలన ఏలికపాములతో పాటు బద్దె పురుగులను కూడా నివారించవచ్చు.
• 6 నెలల తరువాత ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ నట్టల నివారణ మందులు తాగించడం వలన దూడలు ఆరోగ్యకరంగా పెరుగుతాయి.
Also Read: Role of Fertilizers in Agriculture: నేల జీవం పెంచే జీవన ఎరువుల వాడకం – వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత