Dairy Cattle: మంచి పాడి పశువుల ఎంపిక అనేది పాడి పరిశ్రమకు పునాది రాయి వంటిది అన్నారు మన పెద్దలు. మంచి పాడి పశువులను ఎంపిక చేసుకోవాలంటే మనం ఈ క్రింది లక్షణాలను గమనించవలసి ఉంటుంది.
Also Read: Bacillary Haemoglobinurea in Cows: పశువులలో వచ్చే భాసిల్లరీ హిమోగ్లోబిన్యూరియా వ్యాధి లక్షణాలు.!
పాడి పశువుల జాతిని తెలుసుకొని ఎంపిక: ఆవులను ఎంపిక చేసుకోవలెనంటే సంకరజాతి ఆవులైన జెర్సీ, హాల్టెయిన్ ఫ్రీజియన్ ఆవులను, గేదెలలో అయితే ముర్రా, గ్రేడెడ్ ముర్రా వంటి జాతులను ఎన్నుకోవాలి. దేశవాళీ ఆవులను ఎంపిక చేసుకోవలెనంటే షాహివాల్, గిర్, ధారా పార్కర్ వంటి పొడి ఆవుల జాతులను ఎంచుకోవాలి.
పొడి పశువుల వయస్సు మరియు పాల ఉత్పత్తి వివరములు: సంకరజాతి ఆవులు ఈనిన మొదటి మూడు మాసాల్లో రోజుకు 15 లీటర్ల అత్యధిక దిగుబడి ఉంటే, అవి పొడి కాలంలో సగటున రోజుకు 10 లీటర్ల పాలిస్తాయి. అలాగే గేదెలు ఈనిన మొదటి మూడు మాసాల్లో రోజుకు 12 లీటర్ల పాల అత్యధిక దిగుబడి ఉంటే, అవి పాడి కాలంలో సగటున రోజుకు 8 లీటర్ల పాలిస్తాయి.
ఇలాంటి పాల దిగుబడి సామర్థ్యం ఉన్న పాడి పశువుల్ని ఎంపిక చేసుకోవాలి. 2-6 పళ్ళు కలిగిన పాడి పశువులను ఎంపిక చేసుకోవాలి. ఈనిన 15 రోజుల తరువాత లేగ దూడతో సహా, ఒకటి రెండు ఈతల్లోని పాడి పశువులను కొనడం మంచిది. పాడి పశువుల వంశ చరిత్ర, తండ్రి పాలసార, తల్లి పాల దిగుబడి సమాచారం ఫారాల్లోని పశువులకు మాత్రమే లభిస్తుంది. ఇతర పశువులలో ఈ వివరములు లభించవు. కావున రైతులు పాడి పశువుల యొక్క లక్షణాలు, పాల దిగుబడుల ఆధారంగా మాత్రమే శ్రేష్టమైన పాడి పశువులను ఎంపిక చేసుకోవాలి.
పాడి పశువుల శారీరక లక్షణములు: పాడి పశువుల రంగు, ఆకారం, కొమ్ముల లక్షణాలు ఆధారంగా జాతి లక్షణాలు తెలుసుకోవాలి. పాడి పశువులు ఆరోగ్యంగా, చురుకుగా, ఆకర్షణీయంగా ఆడ లక్షణాలతో ఉండాలి. గొంతు వాపు, జబ్బవాపు, దొమ్మరోగం, గాలికుంటు వ్యాధులు, పొదుగు వాపు, బ్రూసెల్లోసిస్, పాలు జ్వరం వంటి వ్యాధులు లేవని నిర్ధారించుకోవాలి. శరీరంలో అన్ని భాగాలు పూర్తిగా తయారై సరైన నిష్పత్తిలో ఉన్నాయో, లేదో గమనించాలి.
పాడి పశువులను ముందు నుండి, ప్రక్క నుండి, వెనుక నుండి గానీ చూస్తే త్రికోణాకారంలో ఉండాలి. దీన్ని బట్టి ఛాతి, పొట్ట, పొదుగు, గర్భాశయం పెద్దగా, భుజం, మెడ చిన్నగా ఉందని తెలుస్తుంది. తల మిగతా శరీర ఆకారం తగు నిష్పత్తిలో ఉండాలి. దవడలు బలిష్టంగా ఉండాలి. ముట్టె వెడల్పుగా ఉండి, తేమతో ఉండాలి. కళ్ళు చురుకుగా మెరుస్తూ విశాలంగా ఉండాలి. జబ్బ శరీరంతో కలిసి వీపు భాగం వెడల్పుగా ఉండాలి. కాళ్ళు బలంగా, సన్నగా, ఎడంగా నిటారుగా ఉండాలి. కాలి గిట్టలు మందమైన అరికాళ్ళతో నేల మీదసమాంతరంగా అని ఉండాలి. మెడ పొట్టిగా, సన్నగా ఉండాలి. ప్రక్కటెముకలు వెడల్పుగా మందంగా, పొడవుగా ఉండాలి. వెనుక నుండి చూస్తే తొడలు ఎడంగా ఉండి మధ్యలో పొదుగుకు ఎక్కువ స్థలం ఉండాలి. ఛాతి విశాలంగా ఉండాలి.
పాడి పశువుల ఎంపికలో పొదుగు నిర్మాణం: పాడి పశువుల ఎంపికలో పొదుగు ప్రధాన పాత్ర వహిస్తుంది. పాదుగు రెండు తొడల మధ్యన బాగా విశాలంగా విస్తరించి, ఉదర భాగానికి అతుక్కొని ఉండాలి. క్షీర గ్రంథులు, కణజాలంతో నిండి ఉండి, పొదుగు వాపు వంటి వ్యాధుల్లేకుండా ఉండాల్వీ పొదుగును చేతితో స్పర్శిస్తే సున్నితంగా, సంకోచ, వ్యాకోచాలు కలిగి, దూదిలాగా మెత్తగా ఉండాలి.
ఎలాంటి కణుతులు లేకుండా ఉండాలి. పాలు తీయగానే పొదుగు ముడతలు పడి కొద్దిగా ముడుచుకుని పోవాలి. పొదుగు పై నాలుగు రొమ్ములు ఒకే పరిమాణంలో ఉండి చతుర స్రాకారంలో అమర్చబడి ఉండాలి. చన్నులు మృధువుగా పొడవుగా ఉండాలి. పాల నరాలు పొదుగుకు ఇరువైపులా బాగా పెద్దగా స్పష్టంగా పైకి ఉబ్బి, శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటే పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
Also Read: 25 Facts about Cow: ఆవు గురించి ఆసక్తికరమైన 25 వాస్తవాలు.!