Goat Farming: మేకల పెంపకం చాలా లాభదాయకం. గొర్రెల్లో కంటే రెండింతలు ఆదాయం వస్తుంది. కాని మేక మాంసానికి డిమాండ్ తక్కువ. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మేక మాంసం ఎక్కువగా తింటారు. మేకమాంసం తక్కువ కొవ్వు, ఎక్కువ పోషకాలు కలిగి రుచిగా ఉంటుంది. వ్యవసాయానికి అనువుగా లేని, తక్కువ వర్షపాతం గల ప్రాంతాలు మేకల పెంపకానికి అనుకూలం . మేలుజాతి మేకలు ఈతకు 2-3 పిల్లలనిస్తాయి. వీటిలో అధిక నిరోధిక శక్తి కలిగి, ఆరోగ్య సమస్యలు తక్కువ.
ముఖ్య జాతుల:-
జామునాపరి, బార్బరి, బీటల్, ఉస్మానాబాది, బ్లాక్ బెంగాల్.
పెంపకం:-
గాలి ప్రసరించే ఎత్తయిన ప్రదేశాల్లో మేకల కొట్టాలు నిర్మించాలి. ఒక్కో ఆడ మేకకు ఒక చ. మి., మేక పోతుకు 2 చ. మి., మేక పిల్లకు 0.5 చ. మి. స్థలం ఉండేలా చూడాలి. షెడ్ నాలుగు వైపుల చల్లదనం, మేత నిచ్చే చెట్లు పెంచాలి. పచ్చిమేతకు సుమారు 1 కిలో చెట్టు ఆకులు, 1 కిలో కాయజాతి పచ్చిమేత, 3 కి. ఇతర పశుగ్రాసాలివ్వాలి. స్థానికంగా దొరికే ముడిసరుకులతో దాణా మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. 2 వారాలు దాటగానే 50-100 గ్రా. చొప్పున పిల్లల దాణా ఇవ్వాలి. మేక పిల్లల షెడ్ లో ఉప్పు, లావణ మిశ్రమ ఇటుకలను ఏర్పాటు చేయాలి. షెడ్ లో నేల పై ప్రతి 15 రోజులకోసారి పొడి సున్నం చల్లాలి. మూడు మాసాలు దాటిన పిల్లలకు నట్టల నిర్మూలన మందులు తాగించాలి. ముందు జాగ్రత్తగా ఈటీ, పీపీఆర్ టీకాలు వేయించాలి. పునరుత్పత్తికి ఉపయోగించని మగ పిల్లలకు విత్తులు కొట్టాలి. దీనివల్ల మాంసం నాణ్యత పెరుగుతుంది.
Also Read: Sore Mouth in Goats: మేకలలో ఆర్ఫ్ వ్యాధి ఎలా వస్తుంది.!
పిల్లల దాణాలో:-
28 పాళ్లు మొక్కజొన్నలు, 20 పాళ్లు వేరుశెనగ చెక్క ,10 పాళ్లు గోధుమ పొట్టు, 11 పాళ్లు బియ్యపు తవుడు 18 పాళ్లు బియ్యపు నూక ,10 పాళ్లు జొన్నలు లేదా సజ్జలు, 2 పాళ్లు లవణ మిశ్రమం, ఒక పాలు ఉప్పు కలిపి మిశ్రమ దాణా తయారు చేసుకోవాలి. స్థానికంగా దొరికే దినుసులు, ధరలను బట్టి వీటిని మార్చుకోవచ్చు. మేక పొతులు, పెద్ద మేకలకు వీటి పాళ్లు వరుసగా 20,5,20,20,18,14,2,1 చొప్పున కలిపి మిశ్రమ దాణా చేసుకోవాలి.
మేకలు దాటించే వయస్సు వచ్చేసరికి కనీసం 20 నుంచి 25 కిలోల బరువుండాలి. ఆరోగ్యంగా ఉన్న మేకలు 7-8 నెలల్లో మొదటిసారి ఎదకు వస్తాయి. ఎదను గుర్తించేందుకు వేసక్టమి చేసిన మేక పోతును మందలో వదలాలి. ఎదలో ఉన్న మేకలను వేరుచేసి మంచి జాతిలక్షణాలున్న మేకపోతుతో దాటించాలి. మేకల గర్భధారణ కాలం 150 రోజులు. ఒక మేకపోతు సుమారు 30-35 ఆడమేకలకు సరిపోతుంది.
Also Read: Goat Farming: మేకలలో ‘న్యుమోనియా’ కలవరం