Wildlife Animals: భూగోళంపై వన్యప్రాణులు మనుషులకు ఆర్థికంగా, వాణిజ్యపరంగా, విజ్ఞానపరంగా, వ్యవసాయ పరంగా, సాంస్కృతిక పరంగా దోహదపడుతూ ప్రకృతికి సౌందర్యాన్నిస్తాయి. భూమి, ఆకాశం, నీటిలో ఉన్న ఎన్నోరకాల వన్యప్రాణులు మనచుట్టూ జీవిస్తున్నాయి. అయితే అనేక కారణాల రీత్యా వైవిధ్యమైన వన్యప్రాణులు రోజురోజుకు అంతరించిపోతూ వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని నివేదికలు చెప్తున్నాయి.
నిజమే.. మనుషుల స్వార్థానికి అరణ్యాలకు ఆపద ఏర్పడుతోంది. అరణ్యాలనే ఆవాసం చేసుకున్న అసంఖ్యాకమైన వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. మనుషుల స్వార్థం ఫలితంగానే దాదాపు పది లక్షలకు పైగా జాతులకు చెందిన వన్యప్రాణులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. వన్యప్రాణులు ఒక్కొక్కటే అంతరించిపోతూ పోతే చివరకు మనిషి మనుగడకే ముప్పు తప్పదని కూడా చెబుతున్నాయి.
మానవ చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయిలో అంతరించిపోతున్నాయని ఇటీవల ఐక్యరాజ్య సమితి, పలు అంతర్జాతీయ సంస్థల నివేదికలు చెప్తున్నాయి. అయితే ఈ ముప్పు అంచనాలకు మించి వేగంతో జరుగుతుంది. ద లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి విడుదలవుతుంది. ఇందులో 20 వేలకు పైగా ప్రాణుల స్థితిగతులను అంచనా వేస్తారు. ఆ రిపోర్ట్ లో భాగంగా అన్ని ఖండాల్లోనూ అన్ని రకాల జంతువులు అంతరించిపోతున్నాయని తెలిపింది.
అయితే ఇలా జరగడానికి ముఖ్య కారకాల్లో ఒకటి భారీ స్థాయిలో జరిగే వ్యవసాయం. ఇక అమెజాన్ ఫారెస్ట్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది.అక్కడ నిమిషానికి సగటున ఒక మైదానం మేర విస్తీర్ణంలో నాశనం చేస్తున్నారు. మాంసం కోసం పశువుల్ని మేపేందుకు మైదానాల కోసం అడవులని ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల మోరీశా సముద్రంలో ఒక నౌక ప్రమాదానికి గురవ్వడంతో ట్యాంకర్లోని చమురు నీటిలో కలిసిపోయింది. దీంతో వన్యప్రాణులనే కాకుండా సముద్రంలో నివసించే జీవాలను కూడా నాశనం చేస్తున్నాము. నిజానికి మనుషులు తమ స్వలాభం కోసమే ప్రకృతిని వాడుకుంటున్నారు. పశువుల మేత కోసమో, నిర్మాణాలు చేపట్టడమో చేస్తూ ప్రకృతిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దీంతో మనుషుల కార్యకలాపాల దృష్ప్రభావం ప్రకృతిపై పడుతుంది.
మనం తినేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసే ఆహారంలో మూడవ వంతు వృధా అవుతుంది. అయితే భారీ స్థాయిలో ఆహారోత్పత్తి చేస్తూనే ప్రకృతిని కాపాడటం కూడా సాధ్యమేనంటున్నారు నిపుణులు. మనుషుల కారణంగా వన్యప్రాణులకు జరుగుతున్న నష్టాన్ని ఆపడానికి మనుషుల్లో మార్పు రావాలని WWF తాజా నివేదిక చెప్తుంది. కానీ ఇందుకోసం మన ఆహారోత్పత్తి, ఆహార వినియోగంలో అసాధారణ మార్పులు అవసరమని WWF తెలిపింది.
Also Read: