పశుపోషణ

Dairy Cattle Calendar 2023: పాడి పశు క్యాలెండర్‌ 2023

0
Dairy Cattle Calendar
Dairy Cattle Calendar

Dairy Cattle Calendar 2023: సంవత్సరం పొడవునా వివిధ మాసాల్లో రైతులాచరించవలసిన పద్దతులు నెలవారీగా కింద పేర్కొనబడ్డాయి. పశుపోషక రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు, పరిస్థితులకు అనుకూలంగా పాటించగలరు.

జనవరి :
ఆవులు, గేదెలు చాలా వరకు ఈని పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కొన్ని డెయిరీలు పాల సేకరణ తగ్గించడం, సేకరణ ధర తగ్గించడం చేస్తున్నాయి. అయితే ఈ నెలలో ఈ సమస్య దానంతట అదే సమసిపోయి పాల ఉత్పత్తి మళ్ళీ మామూలు స్థితికి చేరుకుంటుంది. అప్పుడు డెయిరీలు ఒకదానికొకటి పోటీ పడి పాలు సేకరిస్తాయి. ఈ నెలలో చలి ఎక్కువ గాబట్టి పాలు త్వరగా చెడిపోవు. పుట్టిన దూడల్ని బాగా పోషించాలి. చలి, తేమ, గాలి ఎక్కువగా ఉంటే న్యుమోనియా, డయేరియాకు లోనవుతాయి. అందుకని షెడ్డులో పరిశుభ్రమైన వాతావరణం చాలా ముఖ్యం. అలాగే ఆవులు, గేదెలు ఈనిన తరువాత రెండు, మూడు నెలకల్లా చూడి కట్టించాలి. దీనికి మేలైన ఆబోతులు, దున్నలు ఘనీభవించిన వీర్యాన్ని ఉపయోగించాలి. గాలికుంటు వ్యాధి నివారణ టీకాలివ్వడానికి ఇది అనువైన సమయం. ఆరు నెలలకొకసారి ఈ టీకాలివ్వాలి. దూడల్లో గజ్జి సోకకుండా చూడాలి.

ఫిబ్రవరి :
ఆవులు సంవత్సరం పొడవునా చూడి కడుతూ, ఈనుతూ, పాలిస్తూ ఉంటాయి. అదే గేదెలు ఎక్కువగా జూలై నుండి అక్టోబరు వరకు ఈనుతాయి. ఈనిన రెండు, మూడు నెలలకల్లా చూడి కట్టించాలి. ఇలా చేస్తే 13, 14 నెలల కల్లా మళ్ళీ ఈనుతాయి. ఈతల మధ్యకాలం ఎక్కువ ఉంటే, వట్టిపోయి ఉండే కాలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పాడి పశువులను వృధాగా మేపాల్సొస్తుంది. ఇది పాడి పరిశ్రమకు నష్టదాయకం. దీన్ని చూసుకుని ఈ నెలలో చేయాల్సిన కార్యక్రమాలు చేపట్టాలి. దూడలకు మూడు నెలలు నిండగానే పాలు మాన్పించాలి. దాణా, పచ్చిమేత, ఎండు మేత ఎక్కువగా మేపాలి. అప్పుడే అవి త్వరగా పెరుగుతాయి. ఫిబ్రవరి నెల చలికాలం కిందే లెక్క చలి నుండి పశువుల్ని కాపాడాలి. పరిశుభ్రమైన నీరు పశువులకు ఎల్లవేళలా లభించేలా చూడాలి.

మార్చి :
మార్చి నుండి వేసవి కాలం మొదలౌతుంది. షెడ్డులో, బయట ఎండ వేడిమి లేకుండా చూడాలి. షెడ్డు చుట్టూరా వేప, దిరిసెన మొదలగు చెట్లుంటే మంచిది. షెడ్డు చుట్టూ ఉన్న యార్డులో పశువులు చెట్టు నీడన ఉండే అవకాశముంది. ఇలా తిరిగే పశువుల్లో ఎద లక్షణాలు కూడా తేలిగ్గా గుర్తించి చూడి కట్టించవచ్చు. పచ్చిమేత తగ్గితే, సైలేజిగా నిల్వ ఉంచిన మేతను ఈ నెలలో ప్రారంభించవచ్చు. మొదట కొద్దికొద్దిగా వేసి తరువాత సరిపడా పెంచవచు. పాలు పిండే ముందు

ఏప్రిల్‌ :
ఈ నెలలో ఎండ ఎక్కువగా ఉంటుంది. పచ్చిమేత తక్కువగా ఉంటుంది. సైలేజి, ఎండుమేత, దాణాతోపాటు పాడి పశువులకు సరిపడా మేపాలి. మేత సరిపడా ఉంటే పశువులు బాగా పాలిస్తాయి. షెడ్డులో చల్లని వాతావరణం ఉండేలా చూడాలి. దానికి షెడ్డుపైన గడ్డి కప్పాలి. షెడ్డు ప్రక్కన గోనె పట్టాల్ని కాని, తడికలను కాని కట్టి వాటిపై నీళ్ళు చల్లాలి. పశువులపై కూడా మధ్యాహ్నం పూట ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు రోజూ రెండు మూడుసార్లు నీళ్ళు చల్లితే మంచిది. ముఖ్యంగా సాయంత్రం పాలు పిండే ముందు పశువును మొత్తం, పొదుగునూ చల్లటి నీటితో కడిగితే మంచిది. అలాగే పశువులు తాగటానికి పరిశుభ్రమైన చల్లని నీరు ఎల్లవేళలా లభ్యమయ్యేలా చూడాలి. షెడ్డు పొడవు తూర్పు పడమరల వైపుండాలి. అప్పుడు ఉదయం, సాయంత్రం షెడ్డులోకి ఎండరాక షెడ్డు వేడెక్కదు. ఈగలు, దోమలు, పిడుదులు, గోమార్లు లేకుండా చూడాలి.

Also Read: Fertilizer Management in Coconut: కొబ్బరిలో ఎరువుల యాజమాన్యం.!

Dairy Cattle Calendar 2023

Dairy Cattle Calendar 2023

మే :
మే నెలలో ఎండలెక్కువగా ఉంటాయి. వడగాలులు కూడా వీస్తాయి. వాటి నుంచి పశువులను రక్షించాలి. పచ్చిమేత సరిపడా లేకపోతే సైలేజి, ఎండుమేత పెట్టాలి. అవసరమైతే దాణా పెంచాలి. షెడ్డుపైన స్ప్రింక్లర్లు పెడితే షెడ్డులోపల చల్లగా ఉంటుంది. షెడ్డులో ఫ్యాన్లు కూడా ఉండాలి. మధ్యాహ్నం పూట కూలర్లు కూడా అమర్చవచ్చు. వేసవిలో పాలధరలెక్కువగా ఉంటాయి. అందువలన ఈ సమయంలో పాల ఉత్పత్తి అధికంగా ఉంటే పాడి పరిశ్రమ చాలా లాభదాయకం. ఈనెల చివరలో గొంతువాపు వ్యాధికి టీకాలివ్వాలి. వర్షాకాలం మొదట్లో కల్లా పశువుల్లో ఈ వ్యాధికి నిరోధక శక్తి ఏర్పడుతుంది.

జూన్‌ :
జూన్‌ మాసంలో నైరుతీ రుతుపవనాలతో వరాలు మొదలౌతాయి. షెడ్డులో తేమ లేకుండా చూడాలి. లేదా పశువులకు వ్యాధులు సోకుతాయి. గొంతువాపుకు టీకాలివ్వకపోతే ఈ నెలలో ఇవ్వాలి. అలాగే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలిచ్చి ఆరు నెలలయితే మళ్ళీ ఇవ్వాలి. పచ్చిమేత లభించడం ఈకాలంలో మొదలవుతుంది. పశువులకు పచ్చిమేత ఎక్కువగా మేపి దాణా తగ్గిస్తే లాభదాయకం. వాతావరణం చల్లబడడంతో పశువులు ఎక్కువగా ఎదకొస్తాయి. ఉదయాన ఎదకొచ్చిన పశువులను సాయంత్రం, అలాగే సాయంత్రం ఎదకొచ్చిన పశువులకు మరుసటి ఉదయం మేలు జాతి ఆబోతుల వీర్యాన్ని కృత్రిమ గర్భోత్పత్తి ప్రక్రియ ద్వారా ఉపయోగించాలి. సైలేజిని గుంటనించి కాని, పై నుంచి కాని తీస్తే, తీసిన వెంటనే కప్పి వేయాలి లేదా చెడిపోయి మేపుకు పనికిరాదు.

జులై :
ఈ నెలలో వరాలు విస్తారంగా కురుస్తాయి. అయితే ఒక్కోసారి అనావృష్టి పరిస్థితులు వస్తాయి. అది గమనించి పాడి పశువులకు సరైన పోషణ ఇవ్వాలి. పశువులకు పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలా లభ్యమయ్యేలా చూడాలి. వేసవిలో ఈనిన పశువులు ఇప్పుడు ఎదకొస్తాయి. వాటిని చూడి కట్టించాలి. ఈనిన రెండు, మూడు నెలలకు చూడి కట్టిస్తే ఆవుల్లో ప్రతి సంవత్సరం, గేదెల్లో 13, 14 నెలలకు ఈతలుంటాయి. ఇది లాభదాయకమైన పద్ధతి. పాడిపశువు ఈనితేనే పాలివ్వడం మొదలెడుతుంది. పశువుల షెడ్డు పరిశుభ్రంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు పేడ, మూత్రం తొలగించాలి. లేదా పశువులు వాటిపై పడుకుని పొదుగు వాపు వ్యాధికి గురయ్యే అవకాశముంది. ఈనెల నుండి గేదెలు ఎక్కువగా ఈనుతాయి. వాటికి సరిపడా పోషణ ఇవ్వాలి. దూడల్ని పొడి ప్రదేశంలో ఉంచాలి. లేదా డయేరియా, న్యుమోనియా వచ్చే అవకాశం ఉంది. దూడలకు నట్టల నివారణ మందులు తాగించాలి.

ఆగస్టు :
ఈనబోయే గేదెలకు, ఆవులకు ఒకటి రెండు నెలల ముందు నుంచి ఒకటి రెండు కిలోల దాణాను అదనంగా ఇవ్వాలి. అప్పుడు వాటిలో ఈనిన తరువాత పాలెక్కువగా ఇచ్చే శక్తి నిలవలుంటాయి. దూడ కూడా కడుపులో బాగా పెరిగి, పుట్టిన తరువాత ఆరోగ్యం గాను, బలంగాను ఉంటుంది. ఈనెలలో పచ్చిమేత పుష్కలంగా ఉంటుంది. అందువలన పచ్చిమేతను ఎక్కువగా మేపి దాణా, ఎండుమేత తగ్గించవచ్చు. పాడి పరిశ్రమలో మూడిరట రెండొంతుల ఖర్చు మేపు మీదే ఉంటుంది. కొత్తగా ఈనిన పశువులకు, మొదటి, రెండవ ఈతలోని పశువులకు ఒకటి, రెండు కిలోల దాణా అదనంగా పెట్టాలి. మొదటి రెండు ఈతల్లోని పశువులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అందుకని వాటి పోషణావసరాలు ఎక్కువ.

సెప్టెంబరు :
ఈ నెలలో గేదెలెక్కువగా ఈనుతాయి. ఈనబోయే పశువులకు రోజూ ఒకటి రెండు కిలోల దాణా పెట్టాలి. ఈనేటప్పుడు పరిశుభ్రమైన వసతి కల్పించాలి. కింద వరిగడ్డి, గోనె పట్టాలు వేసి ఉంచాలి. జూలై, ఆగస్టు నెలలలో ఈనిన పశువులు ఈనెలలో ఎదకివస్తాయి. వాటికి చూడి కట్టించాలి. పాడికి చూడే ఆధారం. ఈ నెలలో పాడి పశువులు బాగా పాలిస్తాయి. వాటికి సరిపడా మేపాలి. షెడ్డులో తేమ ఎక్కువగా లేకుండా పొడిగా ఉండేటట్లు చూడాలి. షెడ్డులో వర్షం పడకుండా చూడాలి. పేడ, నీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. ఈగలు, దోమలు, పిడుదులు, గోమార్లు లేకుండా చూడాలి. షెడ్డు పొడిగా ఉంటే పొదుగు వాపు వ్యాధి సోకే అవకాశం కూడా తక్కువ. ఇప్పటికే టీకాలివ్వకుంటే గాలికుంటు, గొంతువాపు వ్యాధులకు టీకాలిప్పించాలి. ఈ నెలలో దూడలెక్కువగా పుడతాయి. పుట్టగానే శుభ్రంగా తుడిచి, బొడ్డు కత్తిరించి, టింక్చర్‌ అయోడిన్‌ రాసి, జున్నుపాలు పట్టించాలి. షెడ్డులో ఖనిజలవణ మిశ్రమంగల రాళ్ళను వేలాడదీస్తే, దూడలు వీటిని నాకుతాయి. పశువుల ఫారాన్ని కొత్తగా పెట్టే వారికి ఇది మంచి సమయం.

అక్టోబరు :
ఆవులు సంవత్సరం పొడవునా ఈనుతాయి. గేదెలెక్కువగా జూలై నుండి అక్టోబరు వరకు ఈనుతాయి. అక్టోబరులో ఈనబోయే ఆవులకు, గేదెలకు ఇప్పుడు దాణా రోజూ ఒకటి, రెండు కిలోలివ్వాలి. ఈనబోయే ఒకటి రెండు నెలల ముందుగా వట్టిపోనివ్వాలి. ఈనేటప్పుడు పశువైద్యుని సహాయం తీసుకోవాలి. ఈనగానే తేలిగ్గా జీర్ణమయ్యే జావలాంటిది పెడితే మంచిది. తల్లి నుండి దూడను వేరు చేసే పద్ధతి పాటిస్తే, ఈనిన వెంటనే గాని లేదా మూడు నాలుగు రోజులకు గాని దూడను వేరు చేయవచ్చు. పాలు పిండినప్పుడు దూడ శరీర బరువులో 10 శాతం పాలు తాగించాలి. నేటి దూడలే రేపటి ఆవులు. దూడల్ని బాగా పోషిస్తే త్వరగా పెరిగి, పెద్దవై, చూడికటి ఈనుతాయి. దూడల్ని పొడి వాతావరణంలో ఉంచితే డయేరియా, న్యుమోనియా వంటి వ్యాధులు రావు. జీవభద్రత చర్యలు చేపట్టే వ్యాధులు సోకే అవకాశాలు తగ్గుతాయి.

నవంబరు :
నవంబరు నాటికి గేదెలు చాలావరకు ఈని ఉంటాయి. ఇవి మళ్ళీ ఎదకొచ్చి కట్టడానికి ఇది మంచి సమయం. అలాగే పాలు కూడా ఇప్పుడు అధికంగా ఇస్తాయి. ఈ పశువుల్లో పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశమెక్కువ. ఈ వ్యాధి నివారణకు షెడ్డులో పారిశుధ్యం చాలా ఆవశ్యకం. షెడ్డులో తేమ లేకుండా చూడాలి. పేడవేసిన వెంటనే తీసివేయాలి. పశువులకు పచ్చిమేత బాగా మేపాలి. అలాగే దాణా కూడా. ఇవి అధిక పాల దిగుబడితో తగ్గిపోయిన శరీర నిలువలు పుంజుకుని పశువులు బరువు కోల్పోకుండా చూస్తాయి. అలా అయితేనే పాలిచ్చే పాడికాలం సరిపడా ఉంటుంది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఈనిన పశువులకు ఈనిన నెలన్నర, రెండు నెలలకు ఈనెలలో చూడి కట్టించాలి. ఈ నెలలో వర్షాల వలన ఈగలు, దోమలు, పిడుదులు, గోమార్లు ఎక్కువగా ఉండి రోగాల్ని కలిగిస్తాయి. వాటిని నివారించాలి. పాలు పిండగానే చనులను టీట్‌ డిప్లో ముంచితే పొదుగువాపు వ్యాధి సోకే అవకాశం తగ్గుతుంది.

డిసెంబరు :
ఈ నెలలో పాడి పశువులు పాలు బాగా ఇస్తాయి. పాల ఉత్పత్తి ఎక్కువ కావటంతో కొన్ని డెయిరీలు పాల సేకరణ తగ్గిస్తుండడం, పాల సేకరణ ధరను తగ్గిస్తుండడం చేస్తుంటాయి. ఇది గమనించి రైతులు ప్రత్యామ్నాయ మార్గాలకై ప్రయత్నించాలి. ఎందుకంటే పాలు రెండు, మూడు గంటల కంటే నిలువ ఉండవు. పాల సేకరణ కేంద్రాలు పాలు చెడి పోయాయని ధర చెల్లించవు. ఒక్కొక్కసారి పాలు తీసుకోవు. వీలైనచోట నేరుగా వినియోగదారులకు, హోటళ్ళకు, మిఠాయి దుకాణాలకు అమ్మటం లాభదాయకం. అలాగే పాలను రైతు ఇంటిదగ్గరే సేకరించే ఏర్పాటు చేసుకోవాలి. రైతే పాలను మరొక చోటుకు సరఫరా చేయాలంటే శ్రమతో కూడుకున్నపని. సరఫరా చేసిన పాలకు సొమ్ము సక్రమంగా వచ్చేటట్లు చూసుకోవాలి.

ఆ సొమ్ముతో దాణాకు, కూలీలకు, ఇతరత్రా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నెలలో చలెక్కువగా ఉంటుంది. పాడి పశువుల్ని, దూడల్ని చలికి, తేమకు గురికాకుండా చూడాలి. పాడి పరిశ్రమలో యంత్రాల వినియోగం ఎక్కువవుతోంది. పాలు పిండే యంత్రాలు, పశుగ్రాసాన్ని ముక్కలుగా కత్తిరించే యంత్రాలు, బల్క్‌ కూలర్లు, నీటి తొట్టెలు, మేత వేసే బండ్లు, మిల్కింగ్‌ పార్లర్లు, షెడ్డును శుభ్రం చేసే యంత్రాలలాంటివెన్నో ఉపయోగిస్తున్నారు. వీటి వలన కూలీల వినియోగం బాగా తగ్గుతుంది. పాలు పరిశుభ్రంగా ఉంటాయి. డెయిరీ ఫారాల్లో సిసి కెమెరాలు, కంప్యూటర్ల వినియోగం కూడా పెరుగుతోంది.

Also Read: Cattle Management in Winter: చలి కాలంలో పాడి పశువుల మరియు దూడల నిర్వహణలో జాగ్రత్తలు.!

Leave Your Comments

Fertilizer Management in Coconut: కొబ్బరిలో ఎరువుల యాజమాన్యం.!

Previous article

‘Sri’ Method Cultivation in Paddy: వరి లో ‘ శ్రీ ‘ పద్దతి సాగు వలన లాభాలు.!

Next article

You may also like