Fodder Cultivation: వ్యవసాయ అనుబంద రంగమైన సాడి పరిశ్రమతో ఎంతో మంది ఉపాది పొందుతున్నారు. పాల మీద, పాలతో వచ్చే ఉత్పత్తులు మీద శ్రామికులు ఆధార పడుతున్నారు. కానీ గతేడాదితో పోలిస్తే దేశంలో పాల దిగుబడులు 15శాతం తగ్గాయి. దీని ప్రభావంతో కొనుగోలుదారుడి నుంచి రైతు వరకు అందరి మీద పడుతోంది. దీనికి కారణం వాతావరణ మార్పుల వల్ల మేత కొరత ఏర్పడి పాల దిగుబడులు తగ్గాయి. ఇటివల కాలంలో మేత కొరత అనేది తీవ్రంగా వేధిస్తోంది. పచ్చిక బీళ్లు కూడా కనుమరుగైపోతున్నాయి.
మేతకొరత వల్ల పశువుల్ని పోషించలేక అనేకమంది కబేళాలకు తరలిస్తున్నారు. నిర్వహణ సమస్యల కారణంగా వేలాది ఎకరాల పంట భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగానూ మారిపోతున్నాయి. ఉద్యానపంటలైన మామిడి, జామ, నిమ్మ, సపోట, సీతాఫలం, బత్తాయి, కొబ్బరి వంటి తోటలలో చెట్లకు మధ్య వీలైతే చెట్ల నీడలో కూడా అనేక పశుగ్రాసాలను పెంచవచ్చును. పండ్ల సాగు కంటే పశుగ్రాసాల ద్వారా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ వచ్చే స్థిరమైన నికర ఆదాయం ఎక్కువగా ఉంటాయి.
భూసారాలు పెరుగుతాయి
పశువులు, గొర్రెల వ్యర్థాలతో భూమిలో కార్బన్ మరియు నత్రజని పెరగటమే కాకుండా భూమిలో నీటిని పీల్చుకొనే గుణం కూడా మెరుగుపడుతుంది. లూసర్న్, బెర్సీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి లెగ్యూమ్ జాతి గ్రాసాల వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరిగి, రసాయన ఎరువుల అవసరాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ గ్రాస పైర్ల సాగును 3-4 సంవత్సరాలకు ఒకసారి పంటమార్పిడి చేస్తే చాలు ఈ ప్రయోజనం మరింతగా ఎక్కువగా ఉంటుంది. పారా నేపియర్ వంటి గ్రాసాల వేర్లు భూమిని కోతకు గురికాకుండా పటిష్టంగా ఉంటాయి. చెట్ల మధ్య పెరిగే గ్రాసాల వల్ల తోటలలో జీవవైవిధ్యం పెరుగుట ద్వారా పరాగసంపర్కము మెరుగుపడి ఫలసాయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి.
Also Read: Inspiring Story Woman Organic Farmer: సేంద్రీయ సాగులో మెలకువలు నేర్పుతోన్న మహిళా రైతు.!
మానవ వనరుల సద్వినియోగం
గ్రాసాల సాగుకు అవసరమయ్యే మానవ వనరుల అవసరాలు చాలావరకు తీరగలవు. తోటలలో గ్రాసాల సాగును ప్రారంభించడానికి జూలై-ఆగస్టు నెలలు చాలా అనుకూలమైనవి. ప్రారంభానికి ముందు భూసార పరీక్షలు జరిపించి నేలకు అనుకూలమైన గ్రాసాలను ఎంపిక చేసుకొనుట మరియు భూమిలోని లోపాలను సరిదిద్దగల చర్యల్ని చేపట్టట మంచిది. ప్రస్తుతం చాలా తోటలలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ సదుపాయాలు ఉన్నాయి. వాటినే వినియోగించుకుంటూ గ్రాసాలను సాగు చేస్తే గ్రాసాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. గ్రాసాలను కోసి మేపలేని సందర్భాలలో తోటలో పశువుల్ని, జీవాలను స్వేచ్ఛగా వదిలితే అవే మేస్తాయి. ఇందువల్ల వాటిని మేపవలసిన శ్రమ కూడా తగ్గుతుంది.
సిల్విపాశ్చర్‌కు – ఏఏ గ్రాసాలను ఎలా ఎంచుకోవాలి
నీటి ఎద్దడిని, వేసవి తీవ్రతలను తట్టుకుని, బురద నేలల్లో కూడా నశించకుండా ఉండే రకాలు, పోషక విలువలు ఎక్కువగా ఉండి, దంటు తక్కువగా ఉండే మృదువైన గ్రాసాలు, తక్కువ సూర్యరశ్మిలో చెట్ల నీడలో కూడా పెరగగలిగే రకాలు, ఎక్కువ సాగునిచ్చే రకాలు, విష స్వభావాలు లేని గ్రాసాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. పశువులు, జీవాలు, తొక్కినప్పటికీ నశించని అతివృష్టి, అనావృష్టులను తట్టుకోగల గుణం కూడా ఈ గ్రాసాలలో ఉండాలి. అవిసె, సుబాబుల్, మల్బరీ చెట్లు కూడా చాలా పుష్టివంతమైన గ్రాసాలను అందిస్తాయి. కొబ్బరి, తమలపాకు తోటలు వాటి సాగుకు చాలా శ్రేష్ఠమైనవి. తోట హద్దుల మీద సుబాబుల్, నేపియర్ వంటి ఎత్తుగా పెరిగే గ్రాసాలను ఎంపిక చేసుకోవచ్చు. పారాగాడ్డి, దీనానాధ్ గ్రాసాలు మరియూ అంజన్ గడ్డి, గరిక గడ్డి, లూసర్న్, బెర్సీమ్, జనుము, స్ట్రెలో హమాటా, పిల్లిపెసర, అలసంద, వెల్వెట్ బీన్స్, ఉలవ తదితర గ్రాసాలను సాగు చేస్తే ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేస్తూ ఉండాలి.
తోటలలో చెట్ల మధ్య, గట్ల మీద, చేపల చెరువుల గట్ల మీదకూడా పశుగ్రాసాలను సాగు చేస్తూ పశువులు, జీవాల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఆర్థిక, సాంకేతిక సహకారాలు అందించి ప్రోత్సహిస్తే పాడిపరిశ్రమకు జీవాల పెంపకానికీ రైతాంగానికీ, ఎంతో మేలు చేకూరగలదు.
Also Read: China’s Engagement in Agriculture: యువతా వ్యవసాయం చేసుకో.. అని అంటున్న డ్రాగన్ దేశం