Clostridium: గొర్రెల్లో వచ్చే వ్యాధులలో చిటుక వ్యాధి అతి ముఖ్యమైనది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు చిటుక వేసినంత సమయంలో చనిపోవడం వల్ల ఈ వ్యాధికి చిటుక వ్యాధి (Clostridium) అని పేరు వచ్చింది. ఈ వ్యాధి సోకడం వల్ల గొర్రెలు చనిపోతాయి. రైతులు నష్టపోతున్నారు కావున ఈ వ్యాధిపై రైతులందరూ అవగాహన కలిగి ఉండడం ఎంతో ముఖ్యం.
ఈ వ్యాధి బ్యాక్టీరియా వలన సోకుతుంది. దీనిని కలిగించే సూక్ష్మక్రిమి పేరు క్లాస్ట్రీడియం పర్ఫింజన్స్ టైప్`డి. సాధారణంగా ఈ సూక్ష్మ క్రిములు జీవాల పొట్ట నందు సహజీవనం చేస్తూ ఉంటాయి. తేమతోకూడిన పచ్చగడ్డిని గొర్రెలు ఆత్రంగా మితిమీరి తిన్నప్పుడు ఈ సూక్ష్మక్రిములు ఆ గడ్డిలోనే ధాతువులను జీర్ణం చేసుకుని అభివృద్ధి చెంది ఉంటాయి. ఇవి ఎక్కువైన తరువాత మరియు ప్రేగులలో హానికర ‘‘ఎప్సిలాన్ టాక్సిన్’’ అనే విష పదార్ధాన్ని విడుదల చేస్తాయి. తద్వారా ప్రేగులు, మూత్రపిండాలు పాడైపోతాయి. ఎప్సిలాన్ విషపదార్ధం ఎక్కువగా ఉంటే వెంటనే చనిపోతాయి. కొన్ని ప్రాంతాలలో ఈ వ్యాధిని నెత్తి పిడుగు వ్యాధి అని పిలుస్తారు.
Also Read: గొర్రెల రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
లక్షణాలు :
ఈ వ్యాధి సోకిన జీవాలు ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే చనిపోతాయి. కొన్నిసార్లు ఈ వ్యాధి సోకిన గొర్రె పిల్లలు చెంగున గాలిలో ఎగిరి హఠాత్తుగా చనిపోతాయి. పెద్ద గొర్రెలు పారుకూంటూ, సరిగా నడవలేక, మేత తినక, నోటి నుండి సొంగకారుస్తూ, పళ్ళు కొరుకుతూ బిగుసుకొని చనిపోతాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే జ్వరం ఎక్కువగా ఉండి మేత మేయకుండా నీరసపడతాయి.
ఈ వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశు వైద్యుడు సలహాతో మూడు రోజులు సరైన యాంటీబయాటిక్ మందులు ఇంజక్షన్ రూపంలో గాని ద్రావాలుగా గాని తాగించాలి. ఈ వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా మందు నాలుగు నెలలు పైబడిన గొర్రెలకు ప్రతి సంవత్సరం వానా కాలానికి ముందుగా ఇప్పించాలి. ఇచ్చే ముందు కనీసం పదిహేను నుండి ఇరవై రోజుల ముందుగా నట్టల నివారణ మందులు విధిగా తాగించాలి. టీకాలు వేసిన గొర్రెలకు ఒక సంవత్సరం వరకు ఈ వ్యాధి రాదు మరియు ఏవైనా గొర్రెలు ఈ వ్యాధితో చనిపోతే గొర్రెలను 5 నుండి ఆరు అడుగుల లోతు గొయ్యిలో సున్నం వేసి మూత పెట్టాలి.
డా. టి. చంద్రావతి, సహాయ ఆచార్యులు
పాథాలజీ విభాగం, పశువైద్య కళాశాల, హైదరాబాద్, ఫోన్ : 94405 79895
Also Read: మేకల లో పోషక యజమాన్యం