పశుపోషణ

Cattle Management Calendar: పశు గ్రాస పంచాంగము

2
Calendar of cattle management

Cattle Management Calendar: సంవత్సరం పొడవునా వివిధ మాసాల్లో రైతులు ఆచరించవలసిన పద్ధతులు నెలవారీగా కింద పేర్కొనబడ్డాయి. పశుపోషక రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు, పరిస్థితులకు అనుకూలంగా పాటించగలరు.

 

Calendar of Cattle Management

Calendar of Cattle Management

జనవరి:
దాణా తగ్గించి, పచ్చిమేత ఎక్కువగా మేపితే పోషణ ఖర్చు తగ్గుతుంది. ఈ మాసంలో పచ్చిమేత పుష్కలంగా ఉంటుంది. దాణా, ఎండుమేత తగ్గించి పచ్చిమేత ఎక్కువగా మేపాలి. ఇంకా మిగిలిన పచ్చిమేతను సైలేజిగా నిలువ చేసుకుంటే, పచ్చిమేత తక్కువగా లభించే వేసవిలో మేపవచ్చు. అలాగే జొన్న ఇప్పుడు విత్తవచ్చు మంచు మీద పెరిగి ఒకటిన్నర నెలకల్లా మొదటి కోత, తరువాత నెలకొక కోత వస్తుంది. రకాన్ని బట్టి రెండు, మూడు కోతలు వస్తాయి. వరి కోసిన తరువాత అదే తేమ మీద పిల్లిపెసర, జనుము, అలసంద వేసుకోవచ్చు. ఇలాంటి కాయ రకం మేతలు గడ్డి రకం కంటే అధిక ప్రోటీన్లతో విలువైనవి. రెండు నెలల కల్లా కోతకొస్తాయి. జనుము ఎండుమేతగా మంచి పోషకాహారం.

ఫిబ్రవరి:
ఈ నెలలో మంచు బాగా కురుస్తుంది. వరి, ఇతర పంటలు కోసిన తరువాత భూమిలో ఉన్న తేమ మీద పిల్లిపెసర, అలసంద, జనుము మొదలగు పంటల్ని వేసుకోవచ్చు. అవి రెండు నెలలకల్లా కోతకొచ్చి మంచి మేతనిస్తాయి. జనుమును ఎండెబట్టి వామిగా గాని, షెడ్డులోగాని, నిలువ చేసుకుని మేత తక్కువగా ఉన్నప్పుడు మేపొచ్చు. వరిగడ్డి, జనపకట్ట కలిపి వామిగా వేసుకుని రెండూ కలిపి మేపడం మన రైతులకలవాటే. దాని వలన పశువులకు కడుపు నిండటమే గాక పోషకాలు కూడా అందుతాయి. అలాగే పచ్చిమేత ఎక్కువగా ఉంటే, ఎండు మేతగా తయారు చేసుకోవడానికి ఇది అనువైన సమయం.

మార్చి: 
ఈ నెలలో వేసవి మొదలవుతుంది. నీటి సదుపాయం గల చోట్ల జొన్న, మొక్కజొన్న వేసుకోవచ్చు. జొన్నలో ఎస్‌ఎస్జి, ఎం.పి. చారి, హైబ్రిడ్‌ రకాలున్నాయి. కొన్ని రకాలు గింజలు తీశాక ఎండుమేతను ఇస్తాయి. ఇవి దాణా తయారీకి, పశువుల మేతకు రెంటికీ పనికొస్తాయి. ఆయా ప్రాంతాల్లో, ఆయా నేలల్లో అనువైన రకాల్ని విత్తుకోవాలి. దీనికి పశువైద్యుల సలహా తీసుకోవచ్చు. పొలాలగట్లు మొదలగు చోట్ల సుబాబుల్‌, అవిశ లాంటి చెట్లు నాటవచ్చు. వీటి కొమ్మలు, ఆకులు పశువులకు, దూడలకు, జీవాలకు మంచి మేతగా పనికొస్తాయి. పండ్ల తోటల్లో మధ్య పశువుల మేతకు పనికొచ్చే గడ్డి రకాల్ని విత్తుకోవచ్చు. ఇలాంటి చోట్ల గొర్రెల్ని మేపితే వాటికి మేత లభిస్తుంది. వాటి ఎరువుతో భూమి సారవంతమౌతుంది. సైలేజి గుంటను ఈ నెలలో తెరచి పశువులకు సైలేజిని మేపవచ్చు.

Cattles

Cattles

ఏప్రిల్‌:
ఈ నెలలో పచ్చిమేత లభ్యత తగ్గుతుంది. నీటి సదుపాయం కల నేలల్లో దీర్ఘకాలిక పంటలైన హైబ్రిడ్‌ నేపియర్‌, ఏపిబిఎన్‌ 1, కో1, కో2, కో3, కో4 మొదలగునవి వేసుకుంటే సంవత్సరం పొడవునా అయిదారు సంవత్సరాలు మేత దొరుకుతుంది. ప్రతి 25 రోజులకొక కోతవస్తుంది. కోత అవగానే పేడ నీరు చల్లి నీరు పెడితే, మళ్ళీ 25 రోజులకల్లా పచ్చిమేత తయారుగా ఉంటుంది. నీటి సద్వినియోగానికి స్ప్రింక్లర్లు అమర్చవచ్చు. అప్పుడు ఎక్కువ ఎకరాలకు నీటి సదుపాయం లభిస్తుంది. వర్షాకాలం, శీతాకాలంలో తయారు చేసుకున్న సైలేజిని వేసవికాలంలో వినియోగించవచ్చు.

మే:
వర్షాధార పంటలైన జొన్న, మొక్కజొన్న రకాలను విత్తేముందు పొలాల్ని దున్ని పెట్టుకోవటానికి ఇది అనువైన సమయం. అలా చేస్తే కలుపు మొక్కలు లేకుండా పచ్చిమేత బాగా లభిస్తుంది. అలాగే వర్షాలు కురిసే ముందే విత్తనాన్ని పొలంలో వేసినా, వర్షాలు కురవగానే మొలకెత్తి పచ్చిమేత త్వరగా లభిస్తుంది. నిలువ ఉన్న సైలేజిని ఈనెలలో పచ్చిమేతకు బదులుగా వినియోగించుకోవచ్చు. సుబాబుల్‌, అవిశ, వేప మొదలగు చెట్ల ఆకుల్ని పశువులకు, ముఖ్యంగా గొర్రెలు, మేకలు, వాటి పిల్లలకు మేపొచ్చు.

జూన్‌:
ఈ నెలలో నైరుతీ రుతుపవనాలు మొదలై వర్షాలు కురుస్తాయి. వర్షాధార పంటలైన జొన్న, మొక్కజొన్న రకాల్ని విత్తుకునేందుకిది అనువైన సమయం. మొక్కజొన్నలో ఆఫ్రికన్‌ టాల్‌ రకం పచ్చిమేత ఎక్కువగా ఇస్తుంది. అలాగే దీర్ఘకాలికమైన ఏపిబిఎన్‌1, కో1. కో2 కో3 మొదలగు పంటలు వర్షాలకు బాగా పెరిగి మేతెక్కువిస్తాయి. పాడి పశువులకు పచ్చిమేత ఎక్కువగా మేపి దాణా తగ్గించుకోవడం లాభదాయకం. దీర్ఘకాలికమైన హైబ్రిడ్‌ నేపియర్‌ వంటి రకాల కణుపుల్ని భూమిలో పాతి నాటుకోవడానికిది మంచి సమయం. వర్షాల వలన కణుపులు ఎక్కువగా బతికి భూమిలో బాగా నిలదొక్కుకుంటాయి. కణుపులెండిపోయిన చోట్ల మళ్ళీ పాతాలి.

Also Read: చలికాలం… జీవాలు జాగ్రత్త
జూలై:
జూలై నెలలో వర్షాలు ఎక్కువగా వుంటాయి. ఈ పాటికే జొన్న మొక్కజొన్న రకాల విత్తనాలతో పొలం ప్రారంభించకపోతే ఇప్పుడు విత్తుకోవచ్చు. అయితే ఒక్కొక్కప్పుడు అనావృష్టి సంభవించి మొలకలు రాకపోవచ్చు. వర్షాలు పడగానే తిరిగి విత్తనం వాడవచ్చు. ప్రతిరైతూ తన పొలంలో కొంతమేర పచ్చిమేత పండిరచి పశువులకు మేపితే పాలు బాగా వస్తాయి. రైతుకు ఆదాయం సమకూరుతుంది. ఒక్కొక్క సమయంలో పాడిపరిశ్రమే రైతునాదుకుంటుంది. అలాగే పొలంగట్లపైన, షెడ్ల దగ్గర సుబాబుల్‌, అవిశ వంటి చెట్టు నాటితే ఇప్పుడు బాగా నిలదొక్కుకుని వేసవిలో మంచి మేతనిస్తాయి.

ఆగస్టు:
పచ్చిమేత అవసరానికి మించి ఉంటే సైలేజి తయారు చేసుకోవడానికిది మంచి సమయం. అయితే రెండు మూడు రోజులు వర్షాలు లేని సమయం చూసి జొన్న మొక్కజొన్న హైబ్రీడ్‌ నేపియర్‌ మొదలగు పశుగ్రాసాల్ని కోసి నేల మీద కొంతమేర ఆరనిచ్చి సైలేజి తయారు చేస్తే మంచి సైలేజి తయారవుతుంది. మామూలుగా పచ్చిమేతలో 20-25 శాతం ఘనపదార్థం, తక్కింది నీరు ఉంటుంది. కాని సైలేజి తయారీకి ఉపయోగించే పచ్చిమేతలో 30 శాతం ఘనపదార్ధముండాలి. ఈ పచ్చిమేతను అరంగుళం సైజు ముక్కలుగా చాఫ్‌కట్టర్‌తో కత్తిరించి సైలేజి గుంటలో వేసి గాలి సారకుండా గట్టిగా అదిమి మూసివేయాలి. సైలేజి తయారు చేసే పనిని ఒకటి, రెండు రోజుల్లో పూర్తి చేయాలి.

సెప్టెంబరు:
పశుపోషణలో మేత ఖర్చు 60 నుండి 70 శాతం వరకు ఉంటుంది. నీటి లభ్యత పుష్కలంగా ఉండే ఈ మాసంలో జొన్న, మొక్కజొన్న, పిల్లిపెసర, అలసంద, లూసెర్ను మొదలగు విత్తనాల్ని నాటి అక్టోబరు, నవంబరు కల్లా పచ్చిమేతను పొందవచ్చు. అలాగే బహువార్శికాలైన హైబ్రిడ్‌ నేపియర్‌, ఏపిబియన్‌1, కో1, కో2 కో 3, కో4 మొదలగునవి నాటుకోవచ్చు. అయితే వీటికి సంవత్సరం పొడవునా నీటి వసతి ఉండాలి. ఒకసారి నాటితే అయిదారు సంవత్సరాలు పచ్చిమేతగా, సైలేజిగా, ఎండు. మేతగా వాడుకోవచ్చు. అలాగే పొలాల వెంబడి సుబాబుల్‌, సెస్బేనియా లాంటి చెట్లను కూడా నాటవచ్చు. మేత తక్కువగా ఉండే వేసవిలో ఇవి పనికొస్తాయి. పచ్చిమేతను చాప్కట్టర్తో చిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి. అప్పుడు మేత వృధాగాదు.

అక్టోబరు:
పాడికి, పశువుల పెరుగుదలకు మేతే ఆధారం. అక్టోబరులో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వలన వర్షాలు బాగా కురుస్తాయి. పచ్చిమేత ఎక్కువగా ఉన్నప్పుడు సైలేజిగా నిలువ చేసుకుని మేత తక్కువగా ఉండే వేసవికాలంలో మేపొచ్చు జొన్న, మొక్కజొన్న ఇప్పుడు విత్తుకుంటే నవంబరులో కోతకొస్తాయి. జొన్నలో ఎస్‌ఎస్జి, ఎంపిచారి రకాలను వాడితే రెండు మూడు కోతలొస్తాయి. అలాగే దీర్ఘకాలిక రకాలైన ఎపిబియన్‌1, కో2 కో3, కో4 రకాల్ని ఇప్పుడు నాటుకుంటే బాగా బతికి అయిదారు సంవత్సరాల వరకు మంచి పచ్చిమేతనిస్తాయి. జనుము, పిల్లిపెసర, అలసంద మొదలగు పంటల్ని వరి కోసిన తరువాత ఖాళీగా ఉండే భూముల్లో పండిరచవచ్చు. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉండడం వలన దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు. మామూలుగా మేపే పచ్చిమేతలో మూడిరట రెండొంతులు గడ్డి రకం, ఒక్క వంతు కాయధాన్యపు రకం ఉంటే లాభదాయకం.

Goats

Goats

నవంబరు: 
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెలలో వర్షాలు బాగా కురుస్తాయి. తుఫానులు కూడా సంభవిస్తాయి. ఇదే అదునుగా జొన్న, మొక్కజొన్న, అలసంద, పిల్లిపెసర, జనుము మొదలగునవి విత్తితే రెండు, మూడు నెలల వరకు నాణ్యమైన మేత పుష్కలంగా లభిస్తుంది. పచ్చిమేత ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా మేపి దాణా, ఎండుమేత తగ్గిచవచ్చు. అలా చేస్తే మేత ఖర్చు తగ్గుతుంది. అలాగే పచ్చిమేత ఎక్కువగా ఉన్నప్పుడు సైలేజిగా తయారు చేసి నిలువ చేసుకోవచ్చు. దీన్ని వేసవి కాలంలో మేపవచ్చు. అప్పుడు సంవత్సరం పొడవునా పచ్చిమేత మేపినట్లవుతుంది. మేత ఖర్చు తగ్గి పాల ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది. అలాగే వరి కోసిన తరువాత భూముల్ని ఖాళీగా ఉంచే బదులు ఆ తేమ మీద పిల్లిపెసర, అలసంద, జనుము మొదలగునవి పండిరచవచ్చు. అప్పుడు పశువులకు అధిక ప్రోటీన్లు గల మేలైన మేత దొరకడమే గాక భూమి కూడా అధిక నత్రజనితో సారవంతమవుతుంది.

డిసెంబరు:
ఈ నెలలో శీతాకాలం మొదలవుతుంది. వరి మొదలగు పంటలు కోతకొస్తాయి. అలాంటి పంటలు కోసిన తరువాత భూమిని ఖాళీగా ఉంచే బదులు ఆ తేమ మీద పిల్లిపెసర, అలసంద, జనుము మొదలగు పంటలు వేస్తే పశువులకు మంచి మేత లభిస్తుంది. నేల కూడా నత్రజనికారక బ్యాక్టీరియాతో సారవంతమౌతుంది. జనుము ఫిబ్రవరిలో కోతకొస్తే ఎండుమేతగా వేసవిలో వినియోగించవచ్చు. ఈ కాయధాన్యపు మేతలలో మాంసకృత్తులు ఎక్కువగా ఉండి పశువుల ఆరోగ్యానికి, దూడల పెరుగుదలకు, పాడి పశువులు పాలెక్కువగా ఇవ్వడానికి ఉపయోగిస్తాయి. అలాగే లూసెర్ను పంట వేయడానికిది అనువైన సమయం. చలికాలంలో బాగా పెరుగుతుంది.

Also Read: రైతుల ఆదాయం పెంచేందుకు బడా కంపెనీలు

డా.జి.రాంబాబు, పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు,
డా.యన్‌.కృష్ణ ప్రియ, సహాయ ఆచార్యులు, అగ్రి పాలిటెక్నిక్‌, ఊటుకూర్‌, కడప, , ఫోన్‌ : 9494588885

Leave Your Comments

డిసెంబరులో ఉద్యాన పంటలు… సేద్యపు పనులు

Previous article

Vermi Compost: వర్మీ కంపోస్టును ఎలా తయారు చేసుకోవాలి..!

Next article

You may also like