పశుపోషణ

నల్ల కోళ్ల పెంపకం.. రైతు లాభం

0

పోషకాల గనిగా ఎంతో ప్రాచుర్యం పొందిన నల్లకోడి  రైతులకు లాభాలను తెచ్చే “బంగారు బాతు“గా మారింది. ముక్క లేనిదే ముద్ద దిగని మాంసప్రియుల ఆరోగ్యానికి దివ్యౌషధమైంది. ఫలితంగా మార్కెట్లో నాటుకోళ్లకు దీటుగా అమ్ముడుపోతుంది. వ్యవసాయరంగానికి అనుబంధంగా సన్న, చిన్నకారు రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయవనరుగా నిలుస్తున్నది.

కోళ్లలో కడక్ నాథ్ కోడి వేరయా అంటున్నారు చికెన్ ప్రియులు. ఇన్నాళ్లూ నాటుకోడి, ఫారం కోడి మాంసాన్నే తిన్నవారు ఇప్పుడు కడక్ నాథ్ కోడికి ఫిదా అవుతున్నారు. ఒకప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకే పరిమితమైన నల్లకోళ్ళు, ఇప్పుడు తెలంగాణలోనూ విరివిగా ఎదుగుతున్నాయి. సాధారణ ఫారం కోళ్లు తెల్లగా, నాటుకోళ్లు ఎరుపు, ఇతర రంగుల్లో ఉంటాయి. కానీ కడక్ నాథ్ కోడి పూర్తిగా నల్లగా ఉంటుంది. కాలిగోర్లు మొదలు ఈకలదాకా.. రక్తం, మాంసంకూడా నలుపు రంగులోనే. అదే ఈ కోడి  చూసేందుకు నల్లగానే ఉన్నా ఇందులో ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీంతో జనం క్రమంగా కడక్ నాథ్ చికెన్ తినేందుకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్ లో నల్లకోడి మాంసానికి డిమాండ్ పెరుగుతున్నది. పలువురు రైతులు వ్యవసాయానికి అనుబంధంగా కడక్ నాథ్ కోళ్ల పెంపకం పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు. కడక్ నాథ్ కోడి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అక్కడి నుంచి క్రమంగా దేశమంతా వ్యాపించింది. స్థానికంగా కడక్ నాథ్ కోళ్లను పెంచే రైతులు మధ్యప్రదేశ్ నుంచే ఎక్కువగా పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో పిల్ల ధర రూ. 60 – రూ. 80 వరకు పలుకుతున్నది. ఒక్కరోజు వయస్సు వున్న పిల్లలను కొనుగోలు చేసి పెరటి కోళ్ల మాదిరిగానే పెంచుకోవచ్చు. ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొంటాయి. అందుకే మధ్యప్రదేశ్ లో మూలాలున్నా.. మన తెలంగాణ వాతావరణంలో బాగానే పెరుగుతున్నాయి.

బాయిలర్ కోళ్లతో పోలిస్తే కడక్ నాథ్ కోళ్ల పెంపకం సమయం ఎక్కువ. చేతికి వచ్చే అందుకు కనీసం 120  సమయం పడుతుంది. అప్పటికి ఒక్కో కోడి 1.5 కేజీల బరువు పెరుగుతుంది. అదే పుంజు అయితే రెండు కేజీల వరకూ వస్తుంది. ఇంకా ఎక్కువ రోజులుంచితే అంతకంటే ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తూకం పెరిగినకొద్దీ ధర పెరుగుతుంది. కడక్ నాథ్ కోళ్ల పెంపకం రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని అందిస్తున్నది. వీటి మాంసానికి మార్కెట్లో డిమాండ్ ఉంది. కిలో రూ. 1200 నుంచి రూ. 1400 వరకూ పలుకుతున్నది. అదే విధంగా లైవ్ కోడి ధరకూడా కిలో రూ. 600 నుంచి రూ. 800 వరకూ ఉన్నది. అంటే ఒక రైతు 120 రోజులపాటు ఈ కోళ్లను పెంచితే సుమారు 1.5 కేజీల బరువు వస్తాయి. ఒక కోడి పెంపకానికి రూ. 200 నుంచి రూ. 250 వరకూ ఖర్చవుతుంది. ఈ లెక్కన అన్ని వ్యయాలూ పోను ఒక్కో కోడిపై కనీసం రూ. 700 నుంచి వందకోళ్లను పెంచినట్లయితే రూ. 2 వేలు ఖర్చు అవుతుంది. అదే ఆదాయాన్ని పరిశీలిస్తే రైతుకు నికరంగా రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకూ ఆదాయం సమకూరుతుంది.

కడక్ నాథ్ కోడి మాంసానికే కాదు గుడ్లకూ కూడా భారీ డిమాండ్ ఉంది. ఒక్కో గుడ్డు రూ. 40 నుంచి రూ. 50 వరకూ పలుకుతున్నది. కోడి ఆరునుంచి ఏడు నెలల్లో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. సంవత్సరంలో ఒక కోడి సుమారు 100 నుంచి 120 గుడ్లు పెడుతుంది. వీటిని విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. అయితే కడక్ నాథ్ కోళ్లు గుడ్లను పొదగలేవు. కాబట్టి నాటు కోళ్ల ద్వారా వీటి గుడ్లను పొడగాల్సి ఉంటుంది. లేదంటే ప్రత్యేక ఇంక్యుబేటర్ల ద్వారా కూడా పొడిగించవచ్చు. దీని వల్ల మళ్ళీ పిల్లల్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా పిల్లల్ని అమ్మడం ద్వారా రైతు మరింత ఆదాయాన్ని పొందవచ్చు. రైతులు పంటలపైనే  పూర్తిగా ఆధారపడకుండా వ్యవసాయాన్ని అనుబంధంగా కడక్ నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టవచ్చు. సేద్యంలో అనుకోని నష్టం వచ్చినా కష్టకాలంలో అదనపు ఆదాయం ఆదుకుంటుంది. దీనికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరమేం లేదు. ఉదయం, సాయంత్రం కొన్ని గంటలు సరిపోతుంది. అంతేకాకుండా పెంపకం పెద్ద కష్టమేమి కాదు. ఫారం కోళ్ల మాదిరిగానే కడక్ నాథ్ కోళ్లనూ పెంచుకోవచ్చు. మొదటి నెలరోజులు ఫారం కోళ్లకు ఇచ్చే కొన్నిరకాల వ్యాక్సిన్లు వీటికి అందిస్తే రైతుకు దాణా ఖర్చు తగ్గడంతోపాటు కోళ్ళూ ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇక మార్కెటింగ్ కూడా సులువుగా చేసుకొనే అవకాశం ఉన్నది. వీటి ప్రత్యేకత పోషక  విలువలు తెలిసిన వారు స్వయంగా ఫారం వద్దకే వచ్చి బేరమాడకుండానే కొనుగోలు చేస్తుంటారు. నగరాలు, పట్టణాల్లోని పెద్ద పెద్ద చికెన్ సెంటర్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకూ సరఫరా చేసే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లాంటి చోట్ల కడక్ నాథ్ రెస్టారెంట్లు వెలుస్తున్నాయి.

కడక్ నాథ్ కోడి మాంసంలో  ఔషధ గుణాలున్నాయని పరిశోధనల్లో తేలింది. బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఆస్తమా, ఊబకాయం తదితర వ్యాధులకు ఇది చక్కని ఔషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి. విటమిన్ – బి1, బి2, బి6, బి12, విటమిన్ – సితోపాటు అనేక రకాల ప్రోటీన్లు ఉన్నట్లు నిర్ధారించారు. కడక్ నాథ్ కోడి మాంసంలో కొవ్వు 0 నుంచి 1 శాతం మాత్రమే ఉంటుంది. ఇలా అనేక ఔషధ గుణాలతో మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తున్నది కడక్ నాథ్  కోడి అదనంగా జిహ్వకు కూడా విందే.

Leave Your Comments

మల్లె సాగులో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు..

Previous article

ప్రొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వలన కలిగే ఆరోగ్య లాభాలు..

Next article

You may also like