ఆంధ్రా వ్యవసాయం

తమలపాకు పంటలో సస్య రక్షణ – నివారణ చర్యలు

0

తమలపాకులను ప్రతిశుభ, అశుభ కార్యాల్లోనూ తప్పని సరిగా వాడతారు. గతంలో గ్రామీణా ప్రాంతాల్లో పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు తాంబూలం తీసుకోనిదే అతిథులను వదిలేవారు కాదు. కానీ నేటి ఫ్యాషన్ యుగంలో అది కాస్తా పాన్ బీడాగా మారింది. కడప జిల్లాలోని తమలపాకులు చెన్నూరు, వేంపల్లె, కమలాపురం ప్రాంతాలు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో పండిన తమలపాకులు చాలా రుచికరంగా ఉంటాయని పొగరు రాష్ట్రాల మార్కెట్ల వారు విశ్వసిస్తారు. అందువల్ల వీటికి ఆయా మార్కెట్లలో గిరాకీ ఉంటుంది. అయితే ఈ తోటలకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రైతులకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం ఆకుతోటలకు అగ్గితెగులు, బర్మాపురుగు, ఎండుతెగులు, మొదలు కుళ్ళు తెగులు, పొగాకు లద్దె పురుగు, తెల్లనల్లి, ఎర్ర నల్లి, బ్యాక్టీరీయా ఆకుమచ్చ తెగులు, కొలటోట్రైకం ఆకు మచ్చ తెగులు ఆశిస్తున్నాయి. ఈ దశలో తక్కువ నీటి తడులు , మెరుగైన యాజమాన్య పద్ధతులు అవలంభిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. జిల్లాలో 1500 హెక్టార్లలో తమలపాకు తోటలు సాగవుతున్నాయి. చెన్నూరు, వేంపల్లె, ఓబులవారిపల్లె, ఖాజీ పేట, చింతకొమ్మదిన్నె, మైదుకూరు, రైల్వే కోడూరు, కమలాపురం మండలాల్లో అధిక విస్తీర్ణం లోనూ, మిగతా మండలాల్లో తక్కువ విస్తీర్ణంలోనూ రైతులు సాగు చేశారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ ఆకుతోటలకు తెగుళ్లు ఆశిస్తున్నాయి.
ఎరువుల యాజమాన్యం:
తీగలను ఎగబాకించిన తరువాత రెండు నెలలకు యూరియా, వేప పిండి కలిపి 40 కిలోల చొప్పున కలిపి తీగల వద్ద వేయాలి. ఇలా చేస్తే చాలా వరకు తెగుళ్లు తగ్గుతాయి. ఎరువులు కూడా తీగలకు బాగా అందుతాయి.
అగ్గితెగులు:
ఆకుల నుంచి రసం పీల్చడం వల్ల కాలిన మచ్చల మాదిరిగా మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగుల ఉధృతి అధికంగా ఉంటే ఆకులు కుళ్లిపోతాయి. అగ్గి పురుగు నివారణకు కార్బరిల్ 50 శాతం పొడి మందును రెండు గ్రాములు తీసుకుని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
బర్మా పురుగు:
కాండం లోపల భాగాన్ని తొలిచేయడం వల్ల బలహీనపడి మొక్కలు విరిగిపోతాయి. ఈ పురుగు తీగలకు ఆశించిన వెంటనే తీగల తలలను విరిచేస్తే వీటి ప్రభావం తగ్గుతుంది.
ఎండుతెగులు, మొదలు కుళ్ళు తెగులు:
ఆకులపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు ఏర్పడి నల్లగా మారతాయి. తెగులు తీగ మొదట్లో ఆశించినప్పుడు వేరు గోధుమ రంగులోకి మారి తరువాత నల్లగా మారి కుళ్లిపోతాయి. ఈ దశలో తీగపై ఆకులు లక్షణాలు ఉన్న ఆకులను, తీగలను ఎప్పటికప్పుడు తీసి వేయాలి. అప్పటి నుంచి ఫిబ్రవరి నెల వరకు నెలకోసారి 0.5 శాతం బోర్డోపేస్టు మిశ్రమాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
బ్యాక్టీరీయా ఆకుమచ్చ తెగులు:
తమలపాకుల అడుగు బాగాన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవై నలుపు రంగుకు మారి ఆకులు కుళ్లిపోతాయి. ఇవి తీగ, కాండంకు ఆశించినప్పుడు అవి పగుళ్లు ఏర్పడడం, నలుపు మచ్చలు ఏర్పడడం వంటివి జరుగుతున్నాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల నీటిలో పిచికారీ చేయాలి.
పొగాకు లద్దె పురుగు:
తమలపాకు తోటలపై పొగాకు లద్దె పురుగు ఆశించి ఆకులను తీవ్రంగా నష్ట పరుస్తాయి. లద్దె పురుగు ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. దీంతో ఆకులు అందవిహీనంగా కనిపించడంతో పాటు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించదు. ఈ పురుగుల నివారణకు 5 మిల్లీ లీటర్ల వేపనూనెను తప్పనిసరిగా పిచికారీ చేయాలి.
కొలటోట్రైకం ఆకుమచ్చ తెగులు:

ఈ తెగులు ఆశించిన ఆకులపై భాగంలో గుండ్రని గోధుమ రంగుతో కూడిన పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపి నల్లబడి ఆకు అంతా వ్యాపిస్తాయి. ఈ తెగులు ఆశించిన ఆకులు పూర్తిగా నాణ్యత కోల్పోతాయి. దీని నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తగ్గిపోతుంది.
`

Leave Your Comments

పప్పు దినుసుల ప్రయోజనాలు..

Previous article

మునగాకు ఉపయోగాలు..

Next article

You may also like