వేసవిలో అపరాల కింద మినుము, పెసర, సోయాచిక్కుడు, గోరు చిక్కుడు, అలసందులు వంటి పంటలను సాగు చేస్తారు. వేసవిలో ముఖ్యమైన పంటగా మినుమును సాగు చేస్తున్నారు.
విత్తే సమయం: వేసవిలో మినుములను ఫిబ్రవరి, మార్చి నెలల్లో విత్తుకోవచ్చు.
విత్తనం: ఎకరాకు 16-18కిలోల విత్తనం సరిపోతుంది.
విత్తనా రకాలు: టి-9,ఎల్.బి.జి-752,ఎల్.బి.జి-645,ఎల్.బి.జి-648,ఎల్.బి.గి-17,ఎల్.బి.జి-685,ఎల్.బి.జి-402,ఎల్.బి.జి-709,పి.బి.జి-107,ఎల్.బి.జి-787,ఎల్.బి.జి-104.
విత్తన శుద్ధి:
వేసవి అపరాలకు పురుగులు, తెగుళ్ళు ఆశిస్తాయి. కాబట్టి వాటి యాజమాన్యం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురుగులు,తెగుళ్ళు ఆశించకుండా ముందుగా విత్తన శుద్ధి చేయాలి. విత్తనా శుద్ధికి గాను ముందుగా 3 గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ వాడి విత్తనశుద్ది చేయాలి. తరువాత 5 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రా. కార్బో సల్ఫాన్ తో విత్తన శుద్ధి చేయాలి. ఎకరా విత్తనానికి 200 గ్రా. రైజోబియం కల్చర్ ను కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవడం వల్ల నత్రజని స్దీరీకరిస్తుంది.
నీటి యాజమాన్యం:
వేసవిలో పండించే మినుము 45-50 రోజుల దశలో ఒకసారి తేలికపాటి తడులిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు. మినుము పైరుకు వర్షాభావ పరిస్దితి ఏర్పడినపుడు 30 రోజుల్లోపు ఒకతడి, 55రోజుల తర్వాత మరొక తడి ఇవ్వాల్సి ఉంటుంది.
అంతర కృషి:
పెండిమిథాలిన్ 30% ద్రావకం ఎకరాకు 1.0 – 1.5 లీటర్లు లేదా అల్లాక్లోర్ 50% ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గానీ మరుసటి రోజుగాని పిచికారీ చేయాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రు తో అంతర కృషి చేయాలి.
పురుగులు:
మినుమును ఆశించే పురుగుల్లో కాండపు ఈగ, తామరపురుగులు, మారుకా మచ్చల పురుగులు ముఖ్యమైనవి.
కాండపు ఈగ: ఈ పురుగు తొలి దశలో సుమారు 30 రోజుల వరకు మాత్రమే ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. కాండపు ఈగ ఆశించిన మొక్కల్లోతల చివరి ఆకులు వడలి పోతాయి. లేత మొక్కల్లో ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు వడలి, ఎండిపోతాయి. భూమికి దగ్గరగా మొక్క మొదలు దగ్గర కాండం ఉబ్బినట్లై, మొక్కలు గిడసబారి ఎండిపోతాయి.కందపు ఈగ నివారణకు విత్తనా శుద్ధి చేయాలి. ఎసిఫేట్ 1గ్రా.లీటరు నీటికి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
తామర పురుగులు:తామర పురుగులు ఆశించిన మొక్కల పెరుగుదల ఆగిపోయి గిడసబారిపోతాయి. తామర పురుగులు ఆకుల నుంచి రసం పీల్చడమే గాక ఆకుముడత అనే వైరస్ వ్యాధిని వ్యాపింపచేస్తాయి. దీని నివారణకు ఎసిఫేట్ 1గ్రా./లీటరు నీటికి లేదా ఫిప్రోనిల్ 1మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించాలి.
మారుకా మచ్చల పురుగు: తల్లి పురుగు పూమొగ్గలపై లేత ఆకులపై పిందెల పై 2-16గుడ్లను సముదాయంగా పెడుతుంది. గుడ్ల నుంచి 4-5 రోగుల్లో పిల్ల పురుగులు వెలుపలికి వస్తాయి. లార్వాలు పురుగు మొగ్గ,పూత,పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడు గా చేసి లోపలి పదార్ధాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు కాయలను దగ్గరకు చేర్చి గూడుగా కట్టి కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినడం వల్ల పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది.
నివారణ: మారుకా మచ్చల పురుగు నివారణకు పూతకు ముందే 5 శాతం వేపగింజల కషాయం కానీ లేదా లీటరు నీటికి 2.5 మి.లీ.క్లోరిపైరిఫాస్ లేదా 1గ్రా. ఎసిఫేట్ లేదా 2.5 మి.లీ. క్వినాల్ ఫాస్ కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులతో పాటుగా ఊదర స్వభావం కలిగిన డైక్లోరోవాస్ మందును 1 మి.లీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.పురుగు ఉధృతి అధికంగా అనిపించినప్పుడు స్పైనోశాడ్0.4 మి.లీ. లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ ఒ.4 గ్రా. లేదా ప్లుబెండి ఎమైడ్ 0.15 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
తెగుళ్ళు:
వేసవిలో మినుము పొలాల్లో కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు, ఆంత్రక్నోస్, బూడిద, తుప్పుతెగులు, ఆకు ముడత, పల్లాకు తెగుళ్ళు.
కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు: ఈ తెగులు సోకియా ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అనుకూల పరిస్దితుల్లో పెద్ద మచ్చలు వలయాకారంగా ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతాయి.
బూడిద తెగులు: విత్తిన 30-35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నపుడు ముదురు ఆకులపై బూడిద రూపంలో చిన్న చిన్న మచ్చలు గా కనపడి, అవి క్రమేణా పెద్దవైఆకులపైన, కింది భాగాలకు ,కొమ్మ లకు, కాయలకు వ్యాపిస్తుంది.
తుప్పు తెగులు:పైరు పూత దశలో ఈ తెగుల లక్షణాలు కన్పిస్తాయి.ఆకు ఉపరి తలంపైన లేత పసుపు వర్ణం గల గుండ్రని చిన్న మచ్చలు ఉంటాయి. తర్వాత కుంభా కృతి తో కూడిన గుండ్రని మచ్చలు తుప్పు రంగును పోలి ఉంటాయి.
యాజమాన్యం: మాగాణి భూమిలో వేసిన మినుము పైర్లను 35-40 రోజుల దశలో కొరినోస్పోరా ఆకు మచ్చ్ తెగులు,45-50 రోజుల దశలో బూడిద తెగులు, 60-65రోజుల దశలో తుప్పుతెగులు ఆశిస్తాయి. కాబట్టి పైరుపై 30-35 రోజుల దశలో ఒక లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5గ్రా.మాంకోజెబ్, 50 రోజుల దశలో లీటరు నీటికి 3 గ్రా. మాంకోజెబ్ + 1 మి.లీ.డైనోకాప్, 60-65రోజుల దశలో మళ్లి ఈ మందులను గానీ 1 మి.లీ. కాలిక్సిన్ కానీ పిచికారీ చేస్తే ఈ తెగుళ్ళు ను సమర్దంగా అరికట్టవచ్చు.
ఆకు ముడత : వేసవిలో మినుము లో ఆకు ముడత వస్తుంది. ఇది వైరస్ జాతి తెగులు. విత్తనం ద్వారా,పేనుబంక ద్వారా వ్యాపిస్తుంది. దీనినే సీతాఫలం తెగులు లేదా లీఫ్ క్రింకిల్ అని కూడా అంటారు. తెగులు సోకిన మొక్కల ఆకులు ముడతలుగా ఏర్పడి మందంగా పెద్దగా పెరుగుతాయి. మొక్కలు పూత పూయక వెర్రితలలు వేస్తాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి 2 మి.లీ. డైమిధోయేట్ లేదా 1.5 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కలను పీకి తగలు బెట్టాలి. తెగులు సోకని మొక్కల నుంచి విత్తనం తీసుకోవాలి.
పల్లాకు తెగులు: దీనినే ఎల్లో మొజాయిక్ తెగులు అని కూడా అంటారు. ఇది వైరస్ జాతి తెగులు. ఇది తెల్ల దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు, కాయల మీద పసుపు పచ్చ పొడలు ఏర్పడతాయి. ఈ తెగులు నివారణకు తెల్ల దోమల ఉధృతిని అరికట్టాలి. వీటిని నివారించేందుకు లీటరు నీటికి 1.6 మి.లీ.మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. డైమిధోయేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. టి -9, ఎల్.బి.జి-752 వంటి మినుము రకాలను సాగు చేసుకోవాలి.