Crop Insurance: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగినప్పుడు రైతుల్ని ఆర్ధికంగా ఆదుకోవడానికి పంటల బీమాపథకాన్ని ప్రవేశపెట్టారు. 2019 ఖరీఫ్ నుంచి డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఇది ఏపీ వరకు మాత్రమే పరిమితం. పంటల బీమా పథకానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఉచిత పంటల బీమా రైతుల్లో ధీమా పెంచింది. రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రధాన పంటలన్నింటికీ ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించింది.
రుణాలు తీసుకునే రైతులైనా, తీసుకోని వారైనా పంటల బీమా కింద ఒక రూపాయి చెల్లించి తాము పండిరచే పంటను బీమా చెల్లించుకోవచ్చు. రైతు భరోసా కేంద్రాల్లోని గ్రామీణ వ్యవసాయ సహాయకుడు ఇ-పంటను నమోదు చేసే సమయంలోనే రైతు తన పేరును నమోదు చేయించుకోవచ్చు. దీంతో రైతులు పెద్దఎత్తున తమ పంటల్ని బీమా చేయించుకుంటున్నారు. 2018తో పోల్చుకుంటే 2021 బీమా చేయించుకున్న రైతుల సంఖ్య రెట్టింపు అయింది.
2018లో 16.69 లక్షల మందిగా ఉన్న రైతుల సంఖ్య ఇప్పుడు సుమారు 35 లక్షలు దాటినట్టు వ్యవసాయ శాఖ అంచనా. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడానికి నెల ముందు ప్రభుత్వం పంటల బీమా ప్రకటన ఇస్తుంది. ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభమైనందున రైతులు విధిగా పంటల బీమా చేయించుకోవాలని విజ్ఞప్తి చేసింది.
పంట అనివార్యం…
ఇ-పంటలో నమోదు చేసుకోవడం అనివార్యం. రైతు భరోసా కేంద్రాల్లో చేయించుకోవాలి. దీనికి ఆధార్ కార్డు కావాలి. సాగుదారుడి వివరాలు కావాలి. నోటిఫైడ్ ప్రాంతంలో నోటిఫై చేసిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు మాత్రమే పంటల బీమా వర్తిస్తుంది. సాగుదారులందరూ గ్రామ సచివాలయంలోని వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏ, వీఆర్వో ద్వారా ఇ-పంటలో తమ పంటల్ని నమోదు చేయించుకోవాలి. కచ్చితమైన సమాచారం కోసం, ఏ పంటను సాగు చేశారో, ఎంత చేశారో తెలుసుకోవడానికి ఇది కచ్చితంగా ఉండాలని వ్యవసాయ శాఖ ప్రకటించింది.
పెరుగుతున్న విస్తీర్ణం…
ఉచిత పంటల బీమా అమలుతో బీమా చేయించుకునే విస్తీర్ణం కూడా పెరిగింది. 2018 లో 18.57 లక్షల హెక్టార్లుగా ఉన్న బీమా విస్తీర్ణం 2019 నాటికి 30.98 లక్షల హెక్టార్లకు చేరింది. అంటే దాదాపు 168 శాతానికి పైగా పెరిగింది. 2021లో సుమారు 35 లక్షల హెక్టార్లకుపైగా ఉంది. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసే పంటలకు విడివిడిగా నోటిఫికేషన్లు ఉంటాయి. పంటల బీమా బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరించి వ్యవసాయ శాఖను నోడల్ డిపార్ట్మెంట్‌గా నియమించింది.
Also Read: Crops Importance in Agriculture: వ్యవసాయంలో ఎర పంటలు, కంచె పంటల ప్రాముఖ్యత
దిగుబడి ఆధారంగా గుర్తించిన పంటలు (2021-2022లో)
వరి, జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన, మినుము, పెసర, కంది, వేరుశనగ (వర్షాధారం, వర్షాధారితం కానిది), పొద్దు తిరుగుడు, ఆముదం, చెరకు, పత్తి, మిరప, పసుపు, కొర్ర, ఉల్లి
వాతావరణం ఆధారంగా గుర్తించిన పంటలు- పత్తి, అరటి, పసుపు, ఎర్ర మిరప, దానిమ్మ, వేరుశనగ, టమాటా, బత్తాయి, దాక్ష.
రెండు రకాల బీమాలు..
రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా, పునర్ వ్యవస్థీకరించిన వాతావారణ ఆధారిత పంటల బీమా పథకాన్ని సవరించి రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ పథకంగా అమలు చేస్తోంది.
రెండు రకాల బీమాలు దిగుబడి ఆధారిత, వాతావరణ బీమాలు అమల్లో ఉన్నాయి.
జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (జీసీఇఎస్) నిబంధనల ప్రకారం దిగుబడి ఆధారిత పంటల బీమా క్లెయిమ్స్‌ను, వాతావరణ ఆధారిత బీమా క్లెయిమ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేసే వాతావరణ డేటా ప్రకారం పరిష్కరిస్తారు. క్లెయిమ్స్ పరిష్కారానికి బీమా కంపెనీలపై ఆధార పడకుండా త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.
పంట కోత ప్రయోగాలతో నిర్దారణ- పంట కోత ప్రయోగాల ద్వారా వచ్చే దిగుబడి ఆధారంగా పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం చెల్లిస్తారు. అకాల వర్షాలు, తుపానులు, వడగండ్ల వానల వల్ల జరిగే పంట నష్టాలకు, పంట కోసిన తర్వాత 14 రోజుల లోపు పొలంలో ఆరబెట్టిన పంటకు అంటే పనల మీద లేదా చిన్న చిన్న కట్టలుగా కళ్లాల్లో ఉన్నప్పుడు పంట నష్టం జరిగితే 72 గంటల్లోపల రైతువారి నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని రైతు ఖాతాకు జమ చేస్తారు.
వాతావరణ ఆధారిత పంటల బీమా:
ఈ పథకంలో వాతావరణ అంశాలైన వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి, తేమ వాటిల్లో హెచ్చుతగ్గుల ఆధారంగా అమలు చేస్తారు. ప్రతి జిల్లాలో సాగు విస్తీర్ణం ఆధారంగా గుర్తించిన పంటలకు మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అమలు చేస్తారు. ఏపీ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వారి వాతావరణ నివేదికను పరిగణలోకి తీసుకుని నష్టాన్ని అంచనా వేస్తారు. రైతుల సందేహాలను నివృత్తి చేసుకునేందుకు 155251 నెంబర్‌కు ఉచితంగా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. పంట కోత ప్రయోగాలు జనవరిలో పూర్తి అయిన వెంటనే ఫిబ్రవరిలో ప్రణాళిక శాఖ నుంచి నివేదికలు తీసుకుని మార్చి లేదా ఏప్రియల్ నెలలో బీమా పరిహారం నేరుగా ఆధార్ నెంబర్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాకు చెల్లిస్తారు.
పశువుల బీమా కోసం జగనన్న జీవక్రాంతి, పశుక్రాంతి, పశువుల బీమా పధకం అమల్లో ఉన్నాయి. గతంలో ఎకరానికి వరికి రూ. 7, 8 వందలు కట్టాల్సి వచ్చేది. ఇప్పుడది కేవలం ఒక్క రూపాయికే.. రైతులు పూర్తిగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలి. ఒక పంట పోతే మరోపంట పండిరచుకోవడానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది.
రాష్ట్రంలో ప్రతి రైతునూ బీమా పరిధిలోకి తేవాలన్నదే లక్ష్యం…
రాష్ట్రంలో సాగుదార్లందర్నీ ఉచిత పంటల బీమా పరిధిలోకి తేవాలన్నది లక్ష్యమని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్ చెప్పారు. ఏదైనా నష్టం జరిగినప్పుడు ఎటువంటి జాప్యం లేకుండా పరిహారానికి సంబంధించిన క్లెయిమ్స్‌ను పరిష్కరిస్తాం. దీనివల్ల రైతులు ఒక పంట నష్టపోతే తర్వాత పంట వేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
ఈ పథకం సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి…
ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పించాలి. చాలా మంది రైతులకు ఉచిత పంటల బీమా పధకం ఉందని తెలియదు. కొందరికి అవగాహన ఉన్నా ఇది వచ్చేదా, చచ్చేదా అనే ధోరణిలో రైతులుంటున్నారు. అందువల్ల అధికారులు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి.
ఇ-పంటలో నమోదు చేసే రోజే రూపాయి కట్టించుకుని బీమా చేయాలి. గ్రామ వ్యవసాయాధికారికి ఆయా గ్రామాల్లో ఉండే వాస్తవసాగుదెవరో తెలుసుగనుక ఆ ధృవపత్రాలు, ఈ ధృవపత్రాలంటూ చికాకు పెట్టకుండా నమోదు చేయాలి. పంట నష్టం అంచనా వేయడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా తక్షణమే ఇ-పంట ఆధారంగా నష్టాన్ని లెక్కించి రైతుల్ని ఆదుకోవాలి. నష్టపరిహారం, మదింపు హేతుబద్ధంగా ఉండాలి. నష్టం అంచనాకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
రైతుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో కొన్ని..
1. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతు కుటుంబాలు (26-11-2019 నాటికి) 45,82,505
. వీరిలో భూమి ఉన్న రైతు కుటుంబాలు : 44,57,732
. భూమి లేని కౌలు రైతు కుటుంబాలు : 1,24,773
. ఇప్పటి వరకు పంపిణీ చేసిన మొత్తం : రూ. 5,230.24 కోట్లు
. త్వరలో లబ్ధి పొందనున్న రైతు కుటుంబాలు : 2,14,538
2. ధరల స్థిరీకరణ నిధి : రూ. 3 వేల కోట్లు
3. ప్రకృతి విపత్తుల నిధి : రూ. 4 వేల కోట్లు
(ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు)
4. ముఖ్యమంత్రి అధ్యక్షతన అగ్రిమిషన్ ఏర్పాటు
5. ఆయిల్ ఫాం రైతుల గిట్టుబాటు ధరకు కేటాయించిన మొత్తం: రూ. 85 కోట్లు
6. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోల) సంఖ్య పెంపు: 171 నుంచి 271కి పెంపు
7. 45 వేల టన్నుల అరటి, 2 వేల టన్నుల మామిడి ఎగుమతి లక్ష్యం
8. బిందు సేద్యాన్ని 2.04 లక్షల హెక్టార్లకు పెంపు
9. రూ. 200 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో విత్తన, ఎరువుల పరీక్షా కేంద్రాలు
10. తెగుళ్ల బారినపడ్డ కొబ్బరి చెట్ల తొలగింపునకు చెట్టుకు రూ. 1,000 సాయం
11. సరుగుడు, సుబాబుల్, జామాయిల్ రైతులకు సాయం
12. రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి (జూలై -8)
13. కౌలు రైతుల కోసం – ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల బిల్లు-2019
14. ఉచిత పంటల బీమా పథకానికి రూ. 2,163 కోట్లు
15. ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్ విద్యుత్, 17 లక్షలకూ పైగా రైతులకు లబ్ధి
16. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబానికి రూ. 7 లక్షల సాయం
17. రైతులకు వడ్డీ లేని రుణాల పథకం
18. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు
19. శనగ రైతులకు క్వింటాల్‌కు రూ. 15 వందల చొప్పున మార్కెట్ వ్యత్యాస ధర చెల్లింపు
20. ఉచిత బోర్ల పథకం కింద 200 రిగ్గులను కొనుగోలుకు నిర్ణయం
21. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో శీతల గిడ్డంగి, వేర్‌హౌస్ ఏర్పాటుకు చర్యలు
22. త్వరలో సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 బోనస్
23. సహకార సొసైటీల ఆధునీకరణ, అభివృద్ధికి రూ. 120 కోట్లు
24. ఇన్‌పుట్ సబ్సిడీ సకాలంలో అందేలా చర్యలు
25. త్వరలో చిరుధాన్యాల బోర్డు
26. ఆచరణలోకి రానున్న వ్యవసాయ ఉత్పాదకాల దుకాణాలు
27. త్వరలో బయోపెస్టిసైడ్స్ నియంత్రణ చట్టం
28. స్కూలు విద్యార్థుల కోసం స్థానిక రైతుల నుంచే కోడిగుడ్ల కొనుగోలుకు చర్యలు
29. టమాటా, ఉల్లి ధరల నియంత్రణకు పకడ్బందీ ఏర్పాట్లు
30. పగటి పూటే 9 గంటల విద్యుత్
ఆకుల అమరయ్య, సీనియర్ జర్నలిస్టు (9347921291)
Also Read: Pulses Crops: పప్పుధాన్యాల పంటలలో నేల మరియు సీడ్‌బెడ్ తయారీలో మెళుకువలు