రాష్ట్రంలో శనగ పంట కోత మొదలైంది. కోత దశలో, నిల్వ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా పంట నాణ్యతను పెంచుకోవచ్చు. శనగ పంట పరిపక్వత దశలో ఆకులు, కాయలు పసుపు రంగుకు మారుతాయి. ఈ దశలో గుర్తించి, పంటను పొడి వాతావరణంలో కోయాలి. మొక్కలను మొదలు వరకు కోసి కుప్పగా వేసుకొని ట్రాక్టర్ తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి లేదా కంబైండ్ హార్వెస్టర్ తో కాయల నుండి గింజలు వేరు చేయాలి. పంట కోసిన తరువాత గింజల్లోని తేమ 9 శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. దుమ్ము, ధూళి, తాలు గింజలను తొలగించి కొత్త సంచుల్లో బల్లలపై తేమ తగలకుండా నిల్వ చేయాలి. పాత సంచులనే ఉపయోగించాల్సి వస్తే సంచులను 5 శాతం వేప కాషాయం ద్రావణంలో ముంచి ఆరబెట్టి వాడుకోవాలి లేదా లీటరు నీటికి 10 మి.లీ. మలాథియాన్ లేదా 2 మి.లీ. డెల్టామెత్రిన్ చొప్పున కలిపినా మందు ద్రావణాన్ని సంచులపై పిచికారీ చేసి, ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. బస్తాలు నిల్వచేసే గదిని లీటరు నీటికి 20 మి.లీ. మలాథియాన్ ద్రావణం కలిపి పిచికారీ చేయాలి.