Benefit the cotton farmers : పత్తి రైతులకు మేలు చేసే అన్ని చర్యలు తీసుకుంటాం…వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తే సెస్ తొలగిస్తామని పత్తి స్పిన్నింగ్, జిన్నింగ్ వ్యాపారులకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. రైతు దగ్గర పత్తి కొనుగోలు చేసే క్రమంలో లిమిట్ పెట్టడం ఏమిటని, రైతు పండించినదంతా CCL కొనే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.బుధవారం సచివాలయంలో పత్తి పరిశ్రమ సమస్యలపై జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర జౌళి శాఖ మంత్రి శ్రీమతి సవిత, అధికారులతో కలిసి పాల్గొన్నారు.
రైతుల మేలుకోసం….
- రైతులకు మేలు చేసేందుకే మనం ఇక్కడ ఉన్నామని అన్ని శాఖల సమన్వయంతో రైతులకు మేలు చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. దేశంలో 7 % స్పిన్నింగ్, జిన్నింగ్ సామర్థ్యం ఉన్న రాష్ట్రంలో 50% పత్తి దిగుబడి, కొనుగోళ్లు తగ్గడం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. గత ఏడాది 1.30 లక్షల బేళ్ల కాటన్ విక్రయాలకు సిద్ధం చేస్తే కేవలం వెయ్యి బేళ్లు మాత్రమే విక్రయించారని, 20 లక్షల బేళ్ల నుంచి 11 లక్షల బేళ్లకు దిగుబడి తగ్గిపోవడం బాధాకరం అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
పత్తి సేకరణలో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి !
- పత్తి సేకరణలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని రైతులకు సూచించారు.
- పత్తి సేకరణలో వెంట్రుకలు, ప్లాస్టిక్ అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు, సంచులు కత్తిరించే క్రమంలో పొరపాట్లు జరగడం పత్తి విక్రయాలపై ప్రభావం చూపుతోందని అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణలో పరిస్థితులు అధ్యయనం చేసి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
- ప్లాస్టిక్ సంచుల వినియోగం పూర్తిగా నిషేధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జూట్ సంచులు, కాటన్ సంచులు వినియోగంలోకి తీసుకు రావాలని, రైతులను చైతన్యం చేసేందు అధికారులు, జిన్నింగ్, స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యాలు, CCL ప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
- వ్యవసాయ శాఖ ఈ క్రాప్ నమోదు ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలని, దిగుబడి అంచనాల్లో హెచ్చు తగ్గులను సరి చేయాలని తద్వారా రైతులు తమ దిగుబడి పూర్తి స్థాయిలో విక్రయించుకోగలరని అధికారులకు మంత్రి సూచించారు.
మేలైన రకాలు అందుబాట్లోకి తేవాలి !
విదేశాల్లో మనకంటే రెండింతల దిగుబడి వచ్చే మేలైన రకాలు పండిస్తున్నారని, మన రైతులకు అటువంటి మేలైన రకాల సాగు జరిగే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలతో మాట్లాడి పరిశోధన చేసి మనకు మేలైన రకాలు లభ్యమయ్యేలా చూస్తామని మంత్రి తెలిపారు.గుంటూరు కస్తూరి కాటన్, ఆర్గానిక్ కాటన్ అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
పత్తి రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని, యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా తమ వంతు కృషి చేయాలని కోరారు.